ట్రంప్‌ను తిట్టేముందు వెనక్కి చూసుకోవాలి!



న్యూఢిల్లీ: అంతర్యుద్ధాలతో రగిలిపోతున్న సిరియా, ఇరాన్, ఇరాక్, సోమాలియా, లిబియా, సూడాన్‌ లాంటి ముస్లిం దేశాల నుంచి ప్రజల రాకను అనుమతించబోమని, ఆయా దేశాలకు చెందిన కాందిశీకులను వెనక్కి పంపించి వేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం పట్ల ప్రపంచ దేశాలతోపాటు భారతీయులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ ఇప్పుడు కొత్తగా చేసిన ప్రకటన కాదది. ఎన్నికలో ప్రచారం సందర్భంగా తాను చేసిన వాగ్దానాలను నిలుపుకోవడం కోసమే ఆయన ఈ ప్రకటన చేయడంతోపాటు బిల్లును కూడా తీసుకొస్తున్నారు.



దేశం నుంచి ముస్లిం కాందిశీకులను పంపించేందుకు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ కూడా గతేడాది భారత పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు, పార్శీలు ఇంకెంతమాత్రం అక్రమవలసదారులు కాదన్నది చట్ట సవరణ సారాంశం. అంటే వీరికి మాత్రమే వసతి కల్పించి ముస్లింలను దేశం నుంచి పంపించేయడమే బిల్లు అసలు ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాల ప్రకారం యుద్ధం, హింస కారణంగా లేదా జాతి, మత, రాజకీయ కారణాలు, ఓ ప్రత్యేక సామాజిక గ్రూపునకు చెందారన్న కారణంగా మాత దేశాన్ని వీడివచ్చే కాందిశీకులకు ఆశ్రయం కల్పించడం ప్రపంచ దేశాల బాధ్యత. 1967లో తీసుకొచ్చిన ఈ చట్టంపైన అమెరికా, యూరప్‌ దేశాలు సంతకాలు చేశాయి. ఆ మేరకు ఆ దేశాలు తమ చట్టాలను కూడా సవరించుకున్నాయి.



ఈ అంతర్జాతీయ ఒడంబడికపై భారత్, ఆర్థిక వనరులు సరిపోవన్న కారణంగా సంతకం చేయలేదా, మరేమన్న దూరదృష్టితో సంతకం చేయలేదా అన్నది స్పష్టత లేదు. కాందిశీకులు ఎవరన్న నిర్వచనం ఇచ్చే చట్టం కూడా ఇంతవరకు మనకు లేదు. 1920నాటి భారత్‌లోకి ప్రవేశించే పాస్‌పోర్టు చట్టం, 1946 నాటి విదేశీయుల చట్టం, 1948 నాటి విదేశీయుల ఉత్తర్వు చట్టం, 1967లో సవరించిన పాస్‌పోర్టు చట్టం ప్రకారం భారత్‌ విదేశాల నుంచి వచ్చే కాందిశీకులను నియంత్రిస్తోంది. భారత్‌ రెండు దేశాలుగా విడిపోయినప్పుడు ఏర్పడిన గందరగోళమే నేటికి కొనసాగుతోంది. మొదట పాకిస్థాన్‌ నుంచి భారత్‌ వైపు వచ్చిన ప్రతి పౌరుడిని ‘హోం కమింగ్‌’ పేరిట ఆహ్వానించారు. ఆ తర్వాత అలా వచ్చిన హిందువులను కాందిశీకులుగాను, ముస్లింలను చొరబాటుదారులుగానూ భారత్‌ పేర్కొంటూ వచ్చింది.



బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్లో స్థిరపడ్డవారికి స్థలాలు కొనుగోలు చేసుకునేందుకు, శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు, చివరకు ఓటు సౌకర్యం కూడా నాటి కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించింది. ఇలాంటి కారణాలతోనే చైనాను ధిక్కరించి వచ్చిన టిబెటిన్లకు భారత్‌ ఆశ్రయం కల్పించడే కాకుండా వారికి ‘ప్రవాస ప్రభుత్వాన్ని’ ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చింది. చైనా వేధింపులను తట్టుకోలేక టిబెటిన్లు 1950దశకంలో భారతకు వలసరాగా 1971 యుద్ధం సందర్భంగా బంగ్లాదేశ్‌ నుంచి ముస్లింలు, హిందువులు, 1980లో శ్రీలంక నుంచి తమిళులు, ఆ తర్వాత అఫ్ఘాన్‌ యుద్ధం సందర్భంగా అక్కడి నుంచి మైనారిటీలు భారత్‌కు వలసవచ్చారు. వారందరిని భారత ప్రభుత్వం అధికారికంగానే దేశంలోకి అనుమతించింది. 1966 నుంచి 1971 మధ్య బంగ్లాదేశ్‌ నుంచి  వచ్చిన ముస్లింలను ఆ దేశంతో చర్చల ద్వారా వెనక్కి పంపించాలని, 1971, మార్చి 24 తేదీ తర్వాత దేశంలోకి వచ్చిన బంగ్లా ముస్లింలను దేశం నుంచి బహిష్కరించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కొత్త బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.



ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాల ప్రకారం కాందిశీకుల పట్ల ఎలాంటి జాతి, మత, సంస్కతి, రాజకీయ వివక్షత చూపరాదు. పైగా వలసవచ్చిన వారికి గౌరవప్రదంగా బతికేందుకు అవకాశం కల్పించాలి. ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్న కాందిశీకుల్లో ఎక్కువ మంది దారుణ పరిస్థితుల్లోనే జీవిస్తున్నారు. పాకిస్థాన్‌లో బలూచిస్థాన్‌లో తిరుగుబాటు చేస్తున్న నాయకుడు బ్రహుందాగ్‌ బుగ్తీకి ఢిల్లీలో మన ప్రభుత్వం అధికారికంగా ఆశ్రయం కల్పించింది. మళ్లీ కాశ్మీర్‌ మిలిటెంట్లకు పాకిస్థాన్‌ మద్దతిస్తోందని గోల చేస్తోంది. అలాంటిదే మనం ఇప్పుడు ట్రంప్‌పై గోల చేయడం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top