ఆశించిన దాని కంటే ఎక్కువే వస్తుంది

ఆశించిన దాని కంటే ఎక్కువే వస్తుంది - Sakshi


* ఆర్థిక ప్యాకేజీ నీతి ఆయోగ్ సిఫారసు చేస్తుంది

 
*  ప్రధాని ఆమోదం తర్వాత ప్రకటన: జైట్లీ

 
*  ప్రత్యేకహోదా నీతిఆయోగ్ పరిశీలనలో ఉంది

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించిన దాని కంటే ఎక్కువే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడిన సమావేశం అనంతరం ఒకసారి, సాయంత్రం 4గంటలకు మరోసారి చంద్రబాబుతో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.



‘చంద్రబాబు, నేను, ప్రధానమంత్రి పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి పొందుపరిచిన హామీలపై చర్చించాం. ఈరోజు చంద్రబాబు సమర్పించిన నివేదికపైనా చర్చించాం. ప్రధానమంత్రి చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. విజయదశమి రోజు రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు రావాలని ప్రధానమంత్రిని సీఎం ఆహ్వానించారు. ఈ సందర్భంలో ప్రధానమంత్రి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌కు.. చట్టంలో ఉన్న నిబంధనలను, వాటికి అనుగుణంగా చేయాల్సిన సాయంపైన ఒక జాబితాను, షెడ్యూలును వేగవంతంగా రూపొందించాలని సూచించారు’ అని కేంద్ర మంత్రి జైట్లీ తెలిపారు.

 

ప్రత్యేకహోదాపై మాట్లాడుతూ.. ‘14వ ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో దానికి ఎలా పరిష్కారం చూపాలన్నది మరో అంశం. ఈ మొత్తం అంశానికి ప్రత్యామ్నాయ పద్ధతిలో అదనపు నిధులు ఇవ్వడం మరో అంశం. నీతిఆయోగ్ నుంచి సిఫారసులు వచ్చాక.. వీటన్నింటికీ ఒక రూపాన్ని ప్రధానమంత్రి ప్రకటిస్తారు..’ అని పేర్కొన్నారు. మీడియా పలు ప్రశ్నలకు ఆర్థిక మంత్రి సమాధానాలిచ్చారు.

 

సిఫారసుల కోసం వేచి చూద్దాం...

‘ప్రత్యేకహోదా లేనట్టేనా?’ అన్న ప్రశ్నకు సమధానంగా ‘14వ ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో దానికి పరిష్కారం చూపాల్సి ఉంది’ అని మంత్రి జైట్లీ అన్నారు. బీహార్‌లో ఎన్నికలు ఉన్నాయనే పెద్ద ప్యాకేజీ ఇచ్చారా? అని ప్రశ్నించగా.. చట్టంలో ఉన్నవన్నీ అమలుచేస్తామని చెప్పారు. ‘బీజేపీ కూడా ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలని పట్టుబట్టింది. ఇప్పుడు సాధ్యం కాదని అంటున్నారా?’ అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘అలా అనడం లేదు. నీతి ఆయోగ్ ఆ విషయం పరిశీలిస్తుందని’ స్పష్టీకరించారు.  



నీతిఆయోగ్ సిఫారసుకు గడువు విషయమై మాట్లాడుతూ..‘ సాధ్యమైనంత త్వరగా చేస్తారని’ అన్నారు. హోదా విషయమై ఇప్పుడు వెనక్కి వెళుతున్నారా?.. అన్న దానికి సమాధానమిస్తూ  ‘వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదు. ఏపీ కోసం ఆనాడు సభలో పోరాటం చేశాం. అందుకే ఇప్పుడు కసరత్తు చేస్తున్నాం’అని పేర్కొన్నారు. స్పెషల్ ప్యాకేజీ ఎంత ఉండొచ్చు.. అనేదానిపై మాట్లాడుతూ సిఫారసుల కోసం వేచి చూద్దామన్నారు. చివరగా.. ఏపీ ఆశించిన దాని కంటే ఎక్కువగా పొందుతుందని చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top