ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. చంద్రబాబు వ్యాఖ్యలు విస్మయం కలిగిస్తున్నాయని వాసిరెడ్డి పద్మ బుధవారమిక్కడ అన్నారు. అధికారులు ముక్కుసూటిగా వ్యవహరించొద్దని చంద్రబాబు గతంలోనే చెప్పారన్నారు.
దానికి కొనసాగింపుగానే తాజాగా చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లకు పచ్చ చొక్కాలు వేస్తే సరిపోతుందని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. ఇకనైనా చంద్రబాబు విపరీత పోకడలు మానుకోవాలని ఆమె హితవు పలికారు. సీఎం, మంత్రులకు ప్రభుత్వాధికారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనల మేరకు నిక్కచ్చిగా అధికారులు వ్యవహరించాలని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
కాగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బదిలీలు ఉండాలని, మాట వినే వారికే పోస్టింగ్ ఇవ్వాలని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల కలెక్టర్లు, ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.