కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు - Sakshi


- 57వేల మంది మాజీలు తిరిగి సైన్యం లోకి..

- యుద్ధ సామర్థ్యం పెంపు, ఖర్చుల నియంత్రణలపై కమిటీ ఏర్పాటు

- ప్రభుత్వ సంస్థలు, బ్యాంకు పోస్టు ఓబీసీ కోటా వర్తింపు

- భారత ఎన్నికల సంఘం- విదేశీ ఎన్నికల సంస్థల మధ్య ఒప్పందానికి గ్రీన్‌ సిగ్నల్‌

- ఇండో-ఇజ్రాయెల్‌, ఇండో-మయన్మార్‌ ఎంవోయూలకు ఆమోద ముద్ర

- వెల్లడించిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ




న్యూఢిల్లీ: గడిచిన కొద్ది రోజులుగా దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక, రక్షణ రంగాన్ని పఠిష్టపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు 57 వేల మంది మాజీ ఉద్యోగులను తిరిగి సైన్యంలోకి చేర్చుకోవాలన్ని సూచనకు అంగీకారం తెలిపింది. ఇండియన్‌ ఆర్మీకి సంబంధించి ఇది అతిపెద్ద సంస్కరణ.



ఈ మేరకు లెఫ్టినెంట్‌ జనరల్‌(రిటైర్డ్‌) డీబీ షెకాట్కర్‌ కమిటీ చేసిన 92 సిఫార్సుల్లో 65 అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అంతేకాక, యుద్ధ సామర్థ్యం పెంచుకోవడం, రక్షణ రంగంలో ఖర్చుల నియంత్ర తదితర అంశాలపై అధ్యయనం కోసం సలహా కమిటీని నియమించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీ వివరాలను ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ మీడియాకు వెల్లడించారు.



ఓబీసీ కోటా: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ), బ్యాంకులు, ఇన్సురెన్స్‌ సంస్థల్లో ప్రభుత్వ పోస్టుల నియామకాల్లో సమతుల్యత పాటించేందుకుగానూ ఓబీసీ కోటాను అమలుపర్చాలని కేంద్రం నిర్ణయించింది.



ఎన్నికల సంఘం: భారత ఎన్నికల సంఘం.. పలు దేశాల ఎన్నికల వ్యవస్థలు, ఆయా దేశాల ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)కు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.



స్మారక పోస్టల్‌ స్టాంపులు: భారత్‌-కెనడా సంబంధాలు, దీపావళి పండుగలపై రెండు స్మారక పోస్టల్‌ స్టాంపులు విడుదల చేయనున్నట్లు తెలిపిన జైట్లీ



ఇజ్రాయెల్‌, బ్రెజిల్‌, మయన్మార్‌లతో ఒప్పందాలకు ఆమోదం: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ఇజ్రాయెల్‌లో పర్యటించిన సందర్భంలో ఆ దేశంతో కుదుర్చుకున్న పారిశ్రామిక అభివృద్ధి-పరిశోధన, సాంకేతిక నవీకరణ నిధి ఎంవోయూలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే బ్రెజిల్‌తో జెబూ ఆవుల సంతతి అభివృద్ధి, మయన్మార్‌, భూటాన్‌లలో భూకంపాల తాకిడికి దెబ్బతిన్న గోపురాల పునరుద్ధరణ ఒప్పందాలకు మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.



లగ్జరీ కార్ల ధరలు: కొత్త జీఎస్‌టీ చట్టం కింద  15 శాతం నుంచి 25 శాతం వరకు మధ్యతరహా, పెద్ద కార్లు, ఎస్యూవీలపై సెస్‌  పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top