
‘కాల్‌మనీ’పై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) కన్నెర్రజేసింది.
♦ ఇది నవీన కట్టు బానిసత్వమని వ్యాఖ్య
♦ మానవ హక్కుల ఉల్లంఘనే.. తీవ్రంగా పరిగణిస్తున్నాం
♦ రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి.. ఏపీ సీఎస్, డీజీపీకి ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) కన్నెర్రజేసింది. ఇలాంటి వ్యవహారం నిజమే అయితే అది నవీన కట్టు బానిసత్వమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అని, తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొంది. రెండు వారాల్లోగా ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక, ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను వివరిస్తూ రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది. మంగళవారం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నేతృత్వంలో రాజ్యసభ సభ్యులు జైరాం రమేశ్, కేవీపీ రాంచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలం, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీతో కూడిన బృందం ఇక్కడి ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రధాన కార్యాలయంలో ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యుడు జస్టిస్ మురుగేషన్‌కు సంబంధిత ఫిర్యాదును, పత్రికల క్లిప్పింగులను సమర్పించింది.
కాల్‌మనీ వ్యవహారం మొత్తాన్ని వీరి నుంచి తెలుసుకున్న జస్టిస్ మురుగేషన్ విషయాన్ని తీవ్రంగా పరిగణి స్తున్నట్టు స్పష్టం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఏపీ సీఎస్, డీజీపీకి ఈ రోజే నోటీసు ఇస్తున్నాం. ఫిర్యాదును బట్టి విషయం తీవ్రమైనదని అర్థమవుతోంది. ఈ వ్యవహారం నవీన బానిసత్వంగా కనిపిస్తోంది..’ అని పేర్కొన్నారు. నోటీసు జారీచేసినట్టు ఎన్‌హెచ్‌ఆర్సీ మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది.
బదిలీ చేయడం దుర్మార్గం: రఘువీరా
ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసిన అనంతరం రఘువీరా మీడియాతో మాట్లాడారు. ‘కాల్‌మనీ ఒక పెద్ద ఆర్థికపరమైన, సెక్స్‌పరమైన రాకెట్. ముఖ్యమంత్రి కార్యాలయం పక్కనే ఈ వ్యవహారం నడుస్తోంది. ఆయన అనుంగు శిష్యులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులే నడుపుతున్నారు. నిజాయితీ కలిగిన పోలీసు కమిషనర్‌ను సెలవులో పంపారు. దోషులను వదిలి పెట్టబోమని చెప్పినందుకే 24 గంటలు పూర్తికాకముందే సీఎం ఆ అధికారిని సెలవులో పంపారు. అందువల్ల మొదటి నిందితుడు ముఖ్యమంత్రే. కమిషన్ మా ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించింది.’ అని పేర్కొన్నారు.
దోషులను కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్
ఏపీలో మహిళలను వేధింపులకు గురిచేస్తున్న కాల్‌మనీ వ్యవహారంపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని జాతీయ మహిళా కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. మంగళవారమిక్కడ జాతీయ మహిళా కమిషన్ సభ్యుడు అలోక్ రావత్‌ను పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేష్, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మశ్రీ కలసి కాల్‌మనీ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులతోసహా ఫిర్యాదు చేశారు. దీనిపై అలోక్ రావత్ స్పందిస్తూ.. వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.