ఆరోగ్యభవనాలు! | Healthy Buildings, Healthy People | Sakshi
Sakshi News home page

ఆరోగ్యభవనాలు!

Jan 11 2014 4:44 AM | Updated on Oct 4 2018 4:27 PM

ఆరోగ్యభవనాలు! - Sakshi

ఆరోగ్యభవనాలు!

నగరంలో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో ఆరోగ్యరీత్యా పర్యావరణ స్పృహ పెరిగిపోయింది.

ఎటుచూసినా పచ్చని చెట్లు.. ఆహ్లాద వాతావరణం..ఆకాశహర్మ్యాలే సిగ్గుపడేలా అందమైన భవనాలు.. అచ్చం ఇలాంటి ఆహ్లాదకరమైన ఇళ్లనే కోరుకుంటున్నారు నగరవాసులు. వారి అభిరుచికి తగ్గట్టుగానే హైదరాబాద్‌లోని నిర్మాణ సంస్థలు కూడా గ్రీన్ బిల్డింగ్స్ ప్రమాణాలకు అనుగుణంగానే నిర్మాణాలు చేపడుతున్నాయి. దీంతో బెంగళూరు, ఢిల్లీ వంటి ఇతర మెట్రో నగరాలకు పోటీగా నగరంలో కూడా హరిత భవనాలు పెరిగిపోతున్నాయి. పచ్చని ప్రకృతితో పాటు, నిర్వహణ ఖర్చుల్లో తగ్గుదల ఉండటంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. కాలుష్యానికి దూరంగా.. ఆరోగ్యానికి దగ్గరగా.. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో కొలువుదీరుతున్న హరిత భవనాలపై ‘సాక్షి రియల్టీ’ కథనమిది..
 - సాక్షి, హైదరాబాద్
 
 నగరంలో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో ఆరోగ్యరీత్యా పర్యావరణ స్పృహ పెరిగిపోయింది. ఇతర ఫ్లాట్ల కంటే గ్రీన్ బిల్డింగ్స్‌లో నిర్వహణ వ్యయం, కరెంట్ బిల్లుల బాదుడు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో భవన నిర్మాణంలోనూ పర్యావరణ సూత్రాలను పాటించాలని కోరుకుంటున్నారు. గ్రీన్‌బిల్డింగ్స్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఫ్లాట్లనే కొనుగోలు చే సేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘‘ఇటీవల మా దగ్గరికొస్తున్న కస్టమర్లలో ఎక్కువ శాతం గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ల వైపే మొగ్గుచూపుతున్నారు. నగరానికి దూరమైనా ఇబ్బంది లేదు కానీ విశాలంగా ఉండి, జిమ్, క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక వసతులుండాలంటున్నారు’’ అని వసతి హౌసింగ్ చైర్మన్, సీఈఓ పీవీ రవీంద్రకుమార్ చెప్పారు. రద్దీ లేకుండా, జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాలనే ఎంపిక చేసుకుంటున్నారని ఆయనన్నారు. మురుగు శుద్ధి కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ, సౌరశక్తి వంటి ఏర్పాట్లు ఉంటేనే ఫ్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ చైర్మన్, ఎండీ ఎస్.రాంరెడ్డి చెప్పారు.
 
 ప్రాజెక్ట్‌ను బట్టి పాయింట్లు: ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన వెంచర్లు, ప్రాజెక్టులకు ప్లాటినం, గోల్డ్, సిల్వర్ అనే మూడు కేటగిరీల్లో సర్టిఫికెట్లు ఇస్తారు. 80కి పైగా పాయింట్లు వస్తే ప్లాటినం, 60-79 మధ్య వస్తే గోల్డ్, 50-59 మధ్య వస్తే సిల్వర్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఇవి కాకుండా 40-49 పాయింట్ల మధ్య వచ్చిన ప్రాజెక్టులకు మామూలు సర్టిఫికెట్ ఇస్తారు. ఐజీబీసీ సర్టిఫికెట్ కోసం నగరంలో చాలా నిర్మాణ సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) వద్ద రిజిస్టర్ చేసుకున్నాయి.
 
 ఐజీబీసీ ప్రమాణాలివే..

  • భవన నిర్మాణంలో నీరు, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి.
  • తక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి.
  • ఫ్లాట్ల పరిసరాల్లో వేడి తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  • నీటి గుంతలను నిర్మించి వాన నీటిని భూగర్భంలోకి పంపే ఏర్పాటు చేసుకోవాలి.
  • వాడిన నీటిని శుద్ధి చేసుకొని తిరిగి వాడుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
  • భవన నిర్మాణం, నిర్వహణలో సాధ్యమైనంత వరకు సౌరశక్తిని వినియోగించాలి.
  • ఇంట్లో వినియోగించే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కూడా త్రీ స్టార్, ఫైవ్ స్టార్ ఉండే వి మాత్రమే చూసుకోవడం.
  •  భవనాల లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా పైకప్పు నిర్మాణ ంలో చిన్నచిన్న మార్పులు చే యాలి.
  • భవనం లోపల పూర్తిగా కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైటింగ్(సీఎఫ్‌ఎల్) బల్బులను వాడాలి.
  • భవనాల్లో ఉండే నల్లాల మొదట్లో ఎరోటర్‌ను వినియోగించాలి. దీంతో నీటి వృథా తగ్గటమే కాకుండా నీటిలో ఉండే మలినాలు, చెత్త  చెదారం వంటివి ఎరోటర్‌లో నిలిచిపోతాయి.
  • ఆయా ప్రాజెక్టు పరిసరాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి.
  • భవనాల ఆవరణలో లాన్‌ను పెంచకుండా ఎక్కువ మొక్కలను పెంచాలి. ఎందుకంటే లాన్ ఎక్కువ నీటిని తీసుకుంటుంది.
  • వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి.

 
 
 ఐజీబీసీ సర్టిఫికెట్ పొందిన ప్రాజెక్టుల్లో కొన్ని..

  • కొంపల్లిలో 70 ఎకరాల్లో సాకేత్ ఇంజనీర్స్ నిర్మిస్తున్న భూఃసత్వ. మొత్తం ఫ్లాట్లు 600. ప్రారంభ ధర రూ. 65 లక్షలు.
  • మూసాపేటలో 22 ఎకరాల్లో సైబర్‌సిటీ బిల్డర్స్ నిర్మిస్తున్న రెయిన్‌బో విస్టాస్-రాక్ గార్డెన్. మొత్తం ఫ్లాట్లు 2,500. చ.అ. ధర రూ. 3,900.
  •  కిస్మత్‌పూర్‌లో 4 ఎకరాల్లో గిరిధారి కన్‌స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న విల్లా ఓనిక్స్. మొత్తం విల్లాలు 44. ప్రారంభ ధర రూ. 1.25 కోట్లు.
  •  అప్పా జంక్షన్‌లో 5 ఎకరాల్లో వసతి ఆనంది. మొత్తం 480 ఫ్లాట్లు. ప్రారంభ ధర రూ. 24.1 లక్షలు.
  • కూకట్‌పల్లి సమీపంలోని చింతల్‌లో రెండున్నర ఎకరాల్లో వసతి నవ్య. మొత్తం 190 ఫ్లాట్లు. ప్రారంభ ధర: రూ. 22.1 లక్షలు.
  • శంషాబాద్‌లో 25 ఎకరాల్లో సుచిరిండియా ఇన్‌ఫ్రాటెక్ ప్రై.లి. టింబర్‌లీఫ్. మొత్తం 123 విల్లాలు. ప్రారంభ ధర  రూ. 1.50 కోట్లు
  •  ఘట్‌కేసర్‌లో 8 ఎకరాల్లో సుచిరిండియా ఇన్‌ఫ్రాటెక్ ప్రై.లి. సుచిర్ ఒడిస్సీ. మొత్తం 99 విల్లాలు. ప్రారంభ ధర రూ. 36 లక్షలు.

 
 వివరణ పత్రాన్ని ఇవ్వాల్సిందే
 ప్రస్తుతం తమ ప్రాజెక్ట్, వెంచర్ ఐజీబీసీ సర్టిఫికెట్ పొందిందని కొనుగోలుదారులకు మౌఖికంగా చెబితే సరిపోతుంది. దాన్ని కొనుగోలుదారులు నమ్మేస్తున్నారు. కానీ సమీప భవిష్యత్తులో కొంత మార్పు రానుంది. నగరవాసుల్లో పర్యావరణ స్పృహ పెరిగిపోవడంతో సంబంధిత ప్రాజెక్ట్, వెంచర్ బ్రోచర్‌తో పాటు ఐజీబీసీ సర్టిఫికెట్ వివరణ పత్రాన్ని కూడా కొనుగోలుదారులకు తప్పనిసరిగా ఇచ్చే నిబంధనలు రానున్నాయి. దీంతో అన్ని నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా గ్రీన్‌బిల్డింగ్స్ ప్రమాణాలను పాటిస్తాయి.
 - లయన్ కిరణ్, సుచిరిండియా ఇన్‌ఫ్రాటెక్ ప్రై.లి. సీఈఓ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement