
బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
బ్రహ్మాండనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురార్పణ జరగనుంది...
- రేపు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ
- 16న ఏపీ సీఎం పట్టువస్త్రాల సమర్పణ..
- 17న తిరుమలకు గవర్నర్
- ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ
సాక్షి, తిరుమల: బ్రహ్మాండనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురార్పణ జరగనుంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఛత్రచామర మంగళవాద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి నైరుతి దిశలోని రాతివసంత మండపానికి చేరుకుంటారు. నిర్ణీత పునీత ప్రదేశంలో భూమి పూజతో అర్చకులు మట్టిని సేకరిస్తారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో(కుండలు) నవ ధాన్యాలతో అంకురార్పణం చేస్తారు. శుక్లపక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు.
రేపు ధ్వజారోహణం,పెద్ద శేషవాహన సేవ
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బుధవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 5.30 గంటల్లోపు మీన లగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాలకు 4,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 17న గవర్నర్ తిరుమల సందర్శించనున్నారు.
బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం:ఈవో
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు అన్నారు. సోమవారం ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసి సర్వదర్శనం భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. గరుడ వాహన సేవ రాత్రి 8 గంటలకు ప్రారంభించి భక్తులు సంతృప్తిగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. కాగా బ్రహ్మోత్సవాల భద్రతలో భాగంగా నాలుగు మాడ వీధుల్లో డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పోలీసు విభాగం వెనక్కు తీసుకుంది.
ఆలయం వద్ద ఇనుప కంచెల తొలగింపు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవల్లో కొలువైన ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు అడ్డుగా నిలిచే ఇనుప చైన్‌లింక్ కంచెలను సోమవారం టీటీడీ ఇంజినీర్లు తొలగించారు. బ్రహ్మోత్సవాలకు భద్రతా వలయం అన్న శీర్షికతో ఇనుప కంచెల కారణంగా భక్తులకు ఉత్సవమూర్తుల దర్శనం కలగదన్న విషయాన్ని సోమవారం ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన టీటీడీ అధికారులు ఆలయం వద్ద నిర్మించిన బారికేడ్లపై అదనంగా నిర్మించిన చైన్‌లింక్ కంచెలను వెంటనే తొలగించారు.