
ఈ కంప్యూటర్ బామ్మ ఇదివరకు రాళ్లు కొట్టేది!
కంప్యూటర్ నేర్చుకోవడం ఈ రోజుల్లో బ్రహ్మ విద్యేమి కాదు. కానీ కొంత మంది రాజకీయ నాయకులకు ఇప్పటికీ అది కొరకుడు పడని విద్యే.
జైపూర్: కంప్యూటర్ నేర్చుకోవడం ఈ రోజుల్లో బ్రహ్మ విద్యేమి కాదు. కానీ కొంత మంది రాజకీయ నాయకులకు ఇప్పటికీ అది కొరకుడు పడని విద్యే. అలాంటి వారికి ఈ కంప్యూటర్ బామ్మ ఒక ప్రేరణ. ఒక స్ఫూర్తి. ఈ బామ్మ పేరు నౌరోతి దేవి. 74 ఏళ్లు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా, హర్మడా గ్రామం మాజీ సర్పంచ్. ఒక్క కంప్యూటర్ విద్యలోనే కాదు. గ్రామ సర్పంచ్‌గా గ్రామాన్ని ఎలా తీర్చిదిద్దవచ్చో చేసి చూపించిన ధీరవనిత. ఆమె వద్ద కంప్యూటర్ శిక్షణ పొందిన అనేక మంది గ్రామస్థులు ఇప్పుడు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
విద్యార్హతల కారణంగా ఈసారి మళ్లీ సర్పంచ్‌గా పోటీ చేయడానికి అవకాశం దొరక్కపోవడంతో ఆమె నిరాశ నిస్పృహలకేమి గురికాలేదు.
తనకు తెలిసిన కంప్యూటర్ విద్యను ఊరిలోని పిల్లలు, పెద్దలకు నేర్పుతూ నూతనోత్సాహంతో జీవిస్తోంది. ఈ బామ్మకు కంప్యూటర్‌ను ఎలా ఉపయోగించాలో 15 ఏళ్ల క్రితం వరకు తెలియను కూడా తెలియదు. అది తెలియడానికి కనీసం అక్షరాలు కూడా రావు. దళిత కుటుంబానికి చెందిన ఈ బామ్మ ఎన్నడూ బడికి పోలేదు. చదువుకోలేదు. తోటి కార్మికుల వలే రాళ్లు కొట్టి జీవించేది. ఎక్కువ వరకు రోడ్డు పనులకు రాళ్లు కొట్టేది. 1980వ దశకం వరకు ఆమె జీవనం ఇలాగే కొనసాగింది. అప్పట్లో ఆమెతోపాటు ఆడవారికి రోజుకు నాలుగు రూపాయలు కూలీ ఇచ్చేవారు.
మగవాళ్లకు మాత్రం ఏడు రూపాయల కూలీ ముట్టేది. మగవాళ్లతో సమానంగా కష్టపడి పనిచేస్తున్నా ఈ వివక్ష ఏమిటని ఆమె కాంట్రాక్టర్‌ను, ప్రభుత్వ ఇంజనీరును ప్రశ్నించింది. మగవాళ్లు కష్టపడినంతగా ఆడవాళ్లు కష్టపడలేరని వారి నుంచి జవాబు వచ్చేది. ఎందుకు కష్టపడలేమంటూ ఆమె తోటి ఆడవాళ్లను ఉత్సాహపరిచి మగవాళ్లకన్నా ఎక్కువ రాళ్లు కొట్టి చూపించింది. అయితే దినసరి వేతనాల్లో ఈ వ్యత్యాసం కొనసాగుతూ వచ్చింది. తోటి మహిళలతో కలసి జిల్లా కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో న్యాయపోరాటం జరిపింది. అప్పటికీ న్యాయం జరగలేదు. దాంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
అవిశ్రాంతంగా పోరాటం జరిపింది. సుప్రీం కోర్టులో గెలిచింది. మగవారితో సమానంగా వేతనాలను అందుకొంది. న్యాయపోరాటంలో ఆమెకు ఎన్నో విషయాలు తెలిసివచ్చాయి. కంప్యూటర్ ప్రపంచంలో వేలి ముద్ర వేయడం ఆమెకు నామోషి అనిపించింది. ఎలాగైనా తాను చదువుకోవాలనుకుంది. 60 ఏళ్ల ప్రాయంలో చదువుకోవడం ఏమిటని ప్రశ్నించిన వాళ్లు లేకపోలేదు. అయినా ఆమె పట్టించుకోకుండా స్వగ్రామమైన హర్మడాకు నాలుగు కిలోమీటర్ల దూరంలోవున్న టిలోనియాలోని ‘బేర్‌ఫుట్ కాలేజ్’కు వెళ్లి ఆరు నెలల కోర్సు చదివారు. అక్కడే అక్షర మాల నుంచి ప్రపంచ విజ్ఞానం వరకు తెలుసుకున్నారు.
కంప్యూటర్ నేర్చుకుంటేగానీ జ్ఞానం సంపూర్ణం కాదని భావించిన బామ్మ కంప్యూటర్ తెలిసిన పిల్లల ద్వారా కంప్యూటర్ విద్య నేర్చుకున్నారు. న్యాయపోరాటంలో భాగంగా తోటి మహిళలతోపాటు గ్రామంలోను ఆమె నాయకురాలిగా ఎదిగారు. గ్రామస్థుల సలహామేరకు ఆమె 2010లో గ్రామ సర్పంచ్‌గా పోటీచేసి గెలిచారు. ఆ వెంటనే సర్పంచ్ కార్యాలయంలో తాను శిక్షణ పొందిన బేర్‌ఫుట్ కాలేజ్ సహకారంతో ఓ కంప్యూటర్‌ని ఏర్పాటు చేశారు. అన్ని పనులు తానే స్వయంగా కంప్యూటర్ ద్వారా నిర్వహించడమే కాకుండా పంచాయతీ కార్యదర్శికి కూడా ఆమె కంప్యూటర్ నేర్పించారు.
కంప్యూటర్ ద్వారానే తనకు మహిళల హక్కులేమిటో, గ్రామ పౌరుల హక్కులేమిటో, సర్పంచ్‌గా తాను నిర్వహించాల్సిన బాధ్యతలేమిటో తెలుసుకున్నారు. ఆ విజ్ఞానంతో ఆమె గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ‘వర్డ్’పైనా, ‘ఎక్సెల్’పైనా ఎలా పనిచేయాలో, ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తనకు బాగా తెలుసుని ఈ బామ్మ గర్వంగా చెబుతారు.
ఇలాంటి బామ్మకు 2015లో సర్పంచ్‌గా మళ్లీ పోటీ చేయాలనుకున్న విద్యార్హతల కారణంగా వీలు కాలేదు. సర్పంచ్ పదవికి పోటీచేసే వారు కనీసం 8వ తరగతి, జిల్లా పరిషద్, పంచాయతి సమితికి పోటీచేసే వారికి కనీసం పదవ తరగతి పాసైన విద్యార్హతలు ఉండాలని నిర్దేషిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం 2015లోనే బిల్లు తీసుకొచ్చింది. ఆ కారణంగా ఇప్పుడు బామ్మ కంప్యూటర్ శిక్షణకే పరిమితమయ్యారు.