
వరంగల్ అడవుల్లో ఎన్‌కౌంటర్
రాష్ట్రంలో మళ్లీ అలజడి చెలరేగింది.. వరంగల్ జిల్లా తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఎన్‌కౌంటర్ జరిగింది.
* ఇద్దరు మావోయిస్టులు మృతి
* గోవిందరావుపేట- తాడ్వాయి ఘటన.. తెలంగాణలో తొలి ఎన్‌కౌంటర్
* మృతులు తంగెళ్ల శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డి!
* ఎంటెక్ ఫైనలియర్ చదువుతున్న శ్రుతి
* ఊరిని మార్చుతానంటూ వెళ్లిన సాగర్
* కొత్త కేడర్‌పై పోలీసుల టార్గెట్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో మళ్లీ అలజడి చెలరేగింది.. వరంగల్ జిల్లా తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఎన్‌కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ దళాల కాల్పుల్లో మంగళవారం ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట-తాడ్వాయి అడవుల్లో ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం... మరణించిన వారు తంగెళ్ల శ్రుతి (23) అలియాస్ మహిత, మణికంటి విద్యాసాగర్‌రెడ్డి(27) అలియాస్ సాగర్‌గా తెలిసింది. గోవిందరావుపేట-తాడ్వాయి మండలాల సరిహద్దులోని రంగాపురం సమీపంలోని బోడగుట్టపై మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు గ్రేహౌండ్స్ దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో శ్రుతి, సాగర్ మరణించారు.
వీరిద్దరు వరంగల్ జిల్లాకు చెందిన వారే. కొద్దినెలల కిందే వీరు మావోయిస్టు పార్టీలో చేరినట్లు తెలిసింది. మంగళవారం ఉదయమే ఈ ఎన్‌కౌంటర్ జరిగినా మృతుల వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. చనిపోయినవారి కుటుంబాలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మృతదేహాలకు బుధవారం ఉదయం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు వరంగల్ ఎస్పీ తెలిపారు. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్ చేయడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
తప్పించుకున్న మరికొందరు!: గోవిందరావుపేట-తాడ్వాయి మండలాల సరిహద్దులోని రంగాపురం సమీపంలో బోడగుట్టపై మావోయిస్టు దళాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయని పోలీసు వర్గాలు తెలిపాయి. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే... ఒక బృందం అక్కడ బస చేసిన ఆనవాళ్లున్నాయి. వాగు పక్కన బండపై ఈ ప్రదేశం ఉంది. శ్రుతి మృతదేహం వద్ద రైఫిల్, సాగర్ మృతదేహం వద్ద స్టెన్‌గన్ ఉన్నాయి. ఘటనా స్థలంలో రెండు టిఫిన్ బాంబులు, 9 కిట్‌బ్యాగ్‌లు, సోలార్‌లైట్ ఉన్నాయి. కొండపై చెట్లు నరికి, కొంత ప్రదేశం చదును చేసి ఉంది. వంటలు చేసిన ఆనవాళ్లున్నాయి. దాదాపు ఐదు కిలోల అన్నం వండి ఉంది.
రెండు వైపులా చెట్లకు టిఫిన్ బాంబులు ఉన్నాయి. మంగళవారం ఉదయం కాల్పుల శబ్దం వినపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు ఎక్కువ మంది మావోయిస్టులు అక్కడున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వరంగల్-కరీంనగర్-ఖమ్మం జిల్లాల మావోయిస్టు పార్టీ కార్యదర్శి దామోదర్, మరికొందరు ఈ ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నారని పేర్కొంటున్నాయి. వారికోసం పోలీసు బలగాలు గాలిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలోని గుత్తికోయ గూడాల్లో అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. తాడ్వాయి, ఘణపురం, గోవిందరావుపేట ఎస్సైల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
గ్రామ పరిస్థితులను మార్చాలని..
మణికంటి విద్యాసాగర్‌రెడ్డి (27) అలియాస్ సాగర్ సొంతూరు వరంగల్ జిల్లా హన్మకొండ మండలం భట్టుపల్లి. చిన్నప్పుడే అమ్మమ్మ ఊరైన ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో స్థిరపడ్డారు. సాగర్ తల్లిదండ్రులు లలిత, సుధాకర్‌రెడ్డి. ఇతనికి ఒక చెల్లెలు ఉంది. సాగర్ ఇంటర్ చదివాడు. కొన్నేళ్లు గ్రోమోర్ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేశాడు. గుడుంబా అమ్మకాల నియంత్రణ, ఇతర అంశాలలో పెండ్యాలలో పలు పార్టీల నేతల మధ్య జూన్‌లో గొడవ జరిగింది. సర్దిచెప్పేందుకు వెళ్లిన సాగర్‌ను అక్కడి వారు చులకన చేసి మాట్లాడారు. దీంతో ఆవేదన చెందిన సాగర్ గ్రామంలోని పరిస్థితులను మార్చాలనే ఆలోచనలో ఉండేవాడు. ఆ క్రమంలోనే 3 నెలల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు.
ఎంటెక్ చదువుతూ..
తంగెళ్ల శ్రుతి (23) అలియాస్ మహిత ఎంటెక్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పల్లగుట్ట జెడ్పీ హైస్కూలలో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. విరసం సభ్యుడిగా ఉన్నారు. డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్)లో పనిచేస్తున్నారు. హసన్‌పర్తి మండలం ముచ్చర్లనాగారం వీరి సొంతూరు. రెండు దశాబ్దాల కింద వరంగల్ నగరంలోని వడ్డేపల్లిలో స్థిరపడ్డారు. శ్రుతికి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లున్నారు. తల్లి పేరు రమాదేవి. శ్రుతి హన్మకొండలోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (ఈసీఈ) పూర్తిచేసి హైదరాబాద్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతోంది. గతేడాది అక్టోబర్ నుంచి ఆమె ఇంటికి రాలేదని తెలిసింది.
స్థానిక పోలీసులకు తెలియదు!
ఎప్పటిలాగే స్థానిక పోలీసులకు సమాచారం లేకుండానే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్ జరిగిన సమాచారం మంగళవారం ఉదయమే జిల్లాలోని మీడియాకు, స్థానికులకు తెలిసింది. భారీ సంఖ్యలో గ్రేహండ్స్ పోలీసులు ములుగు డివిజన్‌లో రోడ్లపై తిరుగుతూ హడావుడి చేశారు. మధ్యాహ్నం డీఎస్పీ బానోత్ రాజ మహేంద్రనాయక్, సీఐలు కిశోర్‌కుమార్, శ్రీనివాసరావు, పస్రా ఎస్సై యాసిన్, పోలీసు బృందం, స్థానికులను, మీడియా ప్రతినిధులను తీసుకుని బయలుదేరింది. సాయంత్రం 4.10 నిమిషాలకు బోడగుట్ట వద్ద ఎన్‌కౌంటర్ ప్రదేశానికి చేరారు. అప్పటికే మరో 30 మంది సాయుధ పోలీసులు అక్కడ ఉన్నారు. స్థానికులకు మృతదేహాలను చూపించి గుర్తుపడతారా అని అడిగారు. పంచనామా కార్యక్రమాలు పూర్తి చేయాలని చెబుతూ 15 నిమిషాల తర్వాత మీడియా వారిని, స్థానికులను అక్కడి నుంచి వెనక్కి పంపారు.
కొత్త కేడర్‌పై నజర్
మావోయిస్టు పార్టీకి 2006 నుంచి మైదాన ప్రాంతాల్లో రిక్రూట్‌మెంట్ ఆగింది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కొన్ని సంఘాల ద్వారా మావోయిస్టు పార్టీ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంది. దాదాపు 36 మంది ఉన్నత విద్యావంతులు మావోయిస్టు పార్టీలో చేరారు. వీరితో 1983 నాటి తరహాలో ఒక కమాండర్, ఇద్దరు సభ్యులతో దళాలను ఏర్పాటు చేశారు. ఏడాదిగా అన్నిరకాలుగా శిక్షణ తీసుకున్న ఈ కొత్త దళాలు... అటవీ ప్రాంతాలకు సమీపంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోకి వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో అధికార పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఆరు నెలలుగా అప్పుడప్పడు గ్రామాల్లో పోస్టర్లు వెలుస్తున్నాయి. రెండు రోజుల కింద ములుగు మండలంలో ఎర్రమట్టి క్వారీ వద్ద జేసీబీ దహనమైంది. నెల కింద వెంకటాపురం మండలంలో ఇలాంటి ఘటనే జరిగింది. వరుస ఘటనల నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వివేక్ కొత్తవారిని రిక్రూట్ చేసే ప్రక్రియలో కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నాయి. వివేక్ ద్వారానే శ్రుతి, సాగర్ వంటివారు మావోయిస్టులో చేరారని వారు అంటున్నారు.
బాధ్యత కేసీఆర్‌దే..
‘‘ఇది నరహంతక ప్రభుత్వం. హక్కుల కోసం పోరాడేవారిని అన్యాయంగా హతమార్చారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి బాధ్యత వహించాలి.’’
- సుదర్శన్, శ్రుతి తండ్రి
ప్రభుత్వం పాశవికంగా హత్య చేసింది
‘‘ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్ పేరుతో శ్రుతిని పాశవికంగా హత్య చేసింది. వారిని చిత్రహింసల కు గురిచేసిన తర్వాత హత్య చేశారు. ఈ హత్యలను ఖండిస్తున్నాం.’’
- బాసిత్, విరసం రాష్ట్ర నాయకుడు
మావోయిస్టులపై నిషేధం పొడిగింపు
- ఆగస్టు 18న గెజిట్ జారీ
- తాజాగా బహిర్గతం చేసిన సర్కారు
మావోయిస్టు పార్టీలపై నిషేధాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఆగస్టు 18నే ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినా గోప్యంగా ఉంచింది. తాజాగా వరంగల్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యం లో దానిని బహిర్గతపరిచింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ మావోయిస్టు), రెవల్యూషనరీ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఆర్‌డీఎఫ్), రాడికల్ యూత్ లీగ్, రైతు కూలీ సంఘం (ఆర్‌సీఎఫ్)లపై నిషేధాన్ని పొడిగించింది.