
ప్రత్యేక హోదాపై కసరత్తు షురూ
తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా సీమాంధ్రకు రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేలు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది.
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా సీమాంధ్రకు రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేలు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రణాళికా సంఘం కూడా సీమాంధ్రకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పనకు సంబంధించి త్వరలోనే కేబినెట్ నోట్‌ను రూపొందించే సూచనలు కన్పిస్తున్నారుు. రాష్ట్ర విభజనపై ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీ సభ్యుడు జైరామ్ రమేశ్ మంగళవారం ఉదయం ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియాతో భేటీ అయ్యూరు. అనంతరం ఆయనకు రెండు లేఖలు రాశారు. ‘రాజ్యసభలో హోం మంత్రి చేసిన ప్రకటన ప్రకారం కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ నేతృత్వంలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే ఆ అభివృద్ధికి తగినరీతిలో నిధులు సమకూర్చాల్సి ఉంది. అందువల్ల ఈ రోజు మన మధ్య జరిగిన చర్చల మేరకు త్వరితగతిన కార్యాచరణ రూపొందించగలరు’ అని ఒక లేఖలో పేర్కొన్నారు.
మరో లేఖలో.. ‘కేంద్ర సాయం అందేందుకు వీలుగా ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని ప్రధాని ప్రక టించారు. ఒడిశాలోని కోరాపుట్-బొలంగిర్-కలహండికి ఇచ్చిన ప్రత్యేక తరహా ప్యాకేజీ, బుందేల్‌ఖండ్‌కు ఇచ్చిన ప్రత్యేక తరహా ప్యాకేజీ మాదిరి రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీలు ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు తక్షణం కార్యాచరణకు పూనుకోవాలని కోరుతున్నాం..’ అని పేర్కొన్నారు.
రెండు కమిటీలు నియమించండి..
కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖమంత్రి వి.నారాయణసామికి కూడా జైరాం రమేశ్ ఒక లేఖ రాశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడే సమయంలో ఉద్యోగుల విభజనకు రెండు సలహా కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి ఒకటి, రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీకి మరొక కమిటీని తక్షణం ఏర్పాటుచేయాలని కోరారు. ఇలావుండగా ‘సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీ గురించి జైరామ్ నాకు చెప్పారు. రాజ్యసభలో ప్రధాని ప్రకటనను కూడా నేను చదివా. బహుశా వారికి దానిపై కేబినెట్ నోట్ కావాలనుకుంటా..’ అని జైరామ్‌తో భేటీ అనంతరం అహ్లూవాలియూ చెప్పారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆ మేరకు ఆదేశాలు వస్తే కేబినెట్ నోట్‌ను ప్రతిపాదిస్తాం అని ఆయన తెలిపారు. అహ్లూవాలియూ చెప్పిన ప్రకారం.. 90:10 నిష్పత్తిలో కేంద్ర సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే 90% కేంద్ర నిధులను గ్రాంటు రూపంలో, మిగతా 10% రుణంగా ఇస్తారు.
కొత్త ప్రభుత్వానికి వదిలేస్తారా?
సీమాంధ్రకు ప్రత్యేక హోదాపై యూపీఏ ప్రభుత్వం తప్పించుకునే వైఖరి అవలంబిస్తోందా? జైరామ్ రమేశ్ వ్యాఖ్యలు ఈ అనుమానాలకు తావిస్తున్నారుు. సాధారణంగా ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశం ప్రత్యేకంగా జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) పరిధిలో ఉంటుంది. సీమాంధ్రకు ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయూన్ని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఎన్‌డీసీకి తెలియజేయూల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ ఎన్‌డీసీ కనుక ఈ విషయమై చర్చించాలని భావిస్తున్నట్టుగా కేంద్రానికి జవాబిస్తే.. అందుకోసం సమావేశం నిర్వహించాలా? లేక ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి ఈ నిర్ణయూన్ని ముందుకు తీసుకెళ్లే విషయం వదిలివేయూలా?.. తాము నిర్ణయం తీసుకుంటామని జైరామ్ సోమవారం ఓ ఆంగ్ల దినపత్రికకు చెప్పడం గమనార్హం. ప్రస్తుత ఎన్‌డీసీ నిబంధనల ప్రకారమైతే ప్రత్యేక రాష్ట్ర హోదా అర్హత సీమాంధ్రకు లేదు. ఈ నేపథ్యంలోనే సీమాంధ్రకు ప్రత్యేక హోదా సాధ్యాసాధ్యాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. బీహార్ విభజన 2000 సంవత్సరంలో జరిగితే 2003-04 ఆర్థిక సంవత్సరంలో కానీ ఎన్‌డీసీ ప్రత్యేక ప్రణాళికను ఆమోదించి బీహార్‌కు నిధులు విడుదల చేయడం ప్రారంభించలేదు.