రేవంత్ కేసులో కొత్త మలుపు.. మరో కీలకనేత!
ఎమ్మెల్యే ఓటు కొనుగోలు వ్యవహారం సరికొత్త మలుపు తిరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో కీలక నేత కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే ఓటు కొనుగోలు వ్యవహారం సరికొత్త మలుపు తిరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మరో కీలక నేత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నాలుగో నిందితుడైన ముత్తయ్య ఆ నేత పేషీలో పనిచేశారని అంటున్నారు. మరో నిందితుడైన సెబాస్టియన్ కూడా ఆ మంత్రికి సన్నిహితుడని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఉన్న ఒక మంత్రికి సంబంధించిన వ్యక్తులే దీని వెనక ఉన్నట్లు తెలుస్తోంది. స్టీఫెన్తో కూడా ఆ మంత్రికి సంబంధాలు ఉన్నాయి. మైనారిటీ సంస్థలతో పనిచేసిన ఆ మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు ఆరేడు నెలల పాటు ముత్తయ్య ఆయన పేషీలో ఉండి.. చాలావరకు వ్యవహారాలు చక్కబెట్టినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఆ మంత్రికి అత్యంత సన్నిహిత అనుచరుడే స్టీఫెన్తో మొదట సంప్రదింపులు జరిపారు. తర్వాత రేవంత్ రంగప్రవేశం చేశారు. నిజానికి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినా, చంద్రబాబు వద్ద మంచి మార్కులు కొట్టాలన్న ఉద్దేశంతో ఈ పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఆ మంత్రి ముగ్గురు అనుచరులూ ఈ ఆపరేషన్లో ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ బేరసారాల కోసం మొదట మరో ఎమ్మెల్యేను రంగంలో దించాలని అనుకున్నారు. కానీ, ఆయన అందుకు నిరాకరించడంతో రేవంత్ రెడ్డిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసు మరెంతమంది మెడకు చుట్టుకుంటుందో, ఇంకెంత మంది తెరమీదకు వస్తారో చూడాల్సి ఉంది.


