
ఈవీఎంలు రిగ్గింగా: ఐతే నేనెలా సీఎం అయ్యాను?
ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంలో సొంత పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి..
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లు (ఈవీఎంలు) ట్యాంపరింగ్‌కు గురయ్యాయంటూ ప్రతిపక్షాలతో గొంతు కలిపి కాంగ్రెస్ పార్టీ గగ్గోలు రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంలో సొంత పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ ఈ ట్యాంపరింగ్ ఆరోపణలను కొట్టిపారేయగా.. తాజాగా మరో సీనియర్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి సైతం ఇదేరీతిలో స్పందించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈవీఎంలు రిగ్గింగ్‌కు గురయితే.. తాను ఎలా సీఎంను అయ్యేవాడినంటూ అమరీందర్‌సింగ్ ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై స్పందించాలని కోరగా.. ‘ఒకవేళ ఈవీఎంలు రిగ్గింగ్‌కు గురై ఉంటే నేను ఇక్కడ (సీఎం కుర్చీలో) కూర్చోని ఉండేవాణ్ని కాదు. అకాలీలే ఇక్కడ ఉండేవారు’ అని ఆయన అన్నారు.
శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి దశాబ్దపు పాలనకు చరమగీతం పాడుతూ.. 117 స్థానాలున్న పంజాబ్‌లో కాంగ్రెస్ 77 స్థానాలు గెలుపొంది విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు గురయ్యాయని, ఏ పార్టీకి ఓటు వేసినా.. బీజేపీకి వెళ్లిందని, అందువల్లే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఆ పార్టీ ఘనవిజయం సాధించిందని కాంగ్రెస్‌తో సహ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణల్ని సొంతపక్షం నేత వీరప్ప మొయిలీ తప్పుబట్టారు. ఒకప్పుడు ఈవీఎంలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టే ఇప్పుడు ఈ విషయంలో రాద్ధాంతం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.