కమల వికాసానికి సర్వం సిద్ధం!!

కమల వికాసానికి సర్వం సిద్ధం!! - Sakshi


మరొక్క రోజు.. గట్టిగా చూస్తే 24 గంటలు కూడా లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కమల వికాసం.. హస్త విలాపం అంటున్న సర్వేల అంచనాలు ఎంతవరకు నిజమవుతాయన్నది తేలిపోతుంది. ఐదు రాష్ట్రాలకు గాను ఒక్క మిజోరంలో తప్ప మరెక్కడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం పొరపాటున కూడా లేదన్నది సర్వే సంస్థలన్నీ ఏకగ్రీవంగా చెబుతున్న మాట. ఇండియా టుడే, టైమ్స్ నౌ, సీఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్స్, టుడేస్ చాణక్య .. ఇలా అన్ని సంస్థలూ కమలానికే పెద్దపీట వేశాయి.ఢిల్లీలో అధికారం చేపట్టేందుకు కావల్సినంత పూర్తిస్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేకపోయినా, బీజేపీ మాత్రం అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయమని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కాంగ్రెస్, బీజేపీలకు గట్టి పోటీ ఇచ్చినట్లు ఎగ్జిట్ పోల్స్ వివరించాయి.రాజస్థాన్‌లో బీజేపీ 43 శాతం ఓట్లను గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీకి 33 శాతం ఓట్లే రావచ్చని సీఎన్‌ఎన్-ఐబీఎన్, ద వీక్ ఎగ్జిట్ పోల్ సర్వే పేర్కొంది. ఇక్కడ అశోక్ గెహ్లాట్ సర్కారు ఈసారి అధికారం కోల్పోక తప్పని పరిస్థితి కనపడుతోంది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ హ్యాట్రిక్ కొట్టడానికి నూటికి నూరుపాళ్లు అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే తమకున్న బలాన్ని ఆయన మరింత పెంచుకుంటారని కూడా అంటున్నారు. ఇదే జరిగితే మాత్రం అక్కడ రికార్డే అవుతుంది. ఎందుకంటే, ఇంతవరకు మధ్యప్రదేశ్లో ఏ ఒక్క ప్రభుత్వమూ వరుసగా మూడుసార్లు అధికారంలోకి రాలేదు.ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి 42 శాతం ఓట్లు (2008లో 40 శాతం ఓట్లు), కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు (2008లోనూ 38 శాతం ఓట్లు) వస్తాయని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. ఆయుర్వేద వైద్యుడు, సౌమ్యుడిగా పేరున్న రమణ్ సింగ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే అవకాశం కనిపిస్తోంది. అభివృద్ధి మంత్రంతోనే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారం చేపడుతుందని అంటున్నారు.మిజోరం రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కొంతవరకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న మొత్తం 40 సీట్లకు గాను 2008లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 38.89% ఓట్లతో 32 సీట్లు గెలుచుకుంది. ఈసారి మాత్రం అన్ని స్థానాలు వచ్చే అవకాశం లేదని, మహా అయితే కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలు మాత్రమే వస్తాయని టుడేస్ చాణక్య సంస్థ తన సర్వేలో తెలిపింది. ఎంఎన్ఎఫ్-ఎంపీసీ కూటమికి 19 స్థానాలు, జడ్ఎన్పీకి మరో 5 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top