వర్షాకాలం ప్రారంభమై రెండునెలలు గడుస్తున్నా...వానలు పడడంలేదని ఆందోళన చెందుతున్న జిల్లా ప్రజలకు సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో ఉపశమనం లభించింది.
మెదక్ మున్సిపాలిటీ: వర్షాకాలం ప్రారంభమై రెండునెలలు గడుస్తున్నా...వానలు పడడంలేదని ఆందోళన చెందుతున్న జిల్లా ప్రజలకు సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో ఉపశమనం లభించింది. మెదక్ పట్టణంలో ఓ మోస్తరు వర్షం పడడంతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లబడింది. మండుటెండలు, ఉక్కపోతలతో అల్లాడిపోయిన జనం, వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు ఆనంద పరవశులయ్యారు.
గత రెండు నెలల తరువాత కురిసిన వర్షంతో రైతుల ఆశలకు ఊపిరి పోసినట్లయింది. దాదాపు ఖరీఫ్ సీజన్ మరో 10 రోజుల్లో ముగియనున్న తరుణంలో వర్షం రావడంతో అన్నదాతలు, సామాన్యప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వర్షం మరింతగా పెరిగి చెరువులు, కుంటలు నిండి పంటలు బాగా పండాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.
సదాశివపేటలో ఓ మోస్తరు వర్షం
సదాశివపేట: ఎండ వేడిమి ఉక్కపోతతో అల్లాడుతున్న పట్టణ ప్రజలకు సోమవారం ఉపశమనం లభించింది. అయితే మండల పరిధిలోని చాల గ్రామాల్లో వర్షం కురవలేదు. పట్టణంలో వర్షం కుర వడంతో మండలంలో కూడా కురుస్తుందని అశించిన రైతుల ఆశలు అడియాశలయ్యాయి. పట్టణంలో సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 3 గంటల పాటు మోస్తరు వర్షం కురిసింది.