ఎగువ నిండేదాకా దిగువ కడగండ్లే! | water shortage in Krishna river | Sakshi
Sakshi News home page

ఎగువ నిండేదాకా దిగువ కడగండ్లే!

May 31 2017 3:14 AM | Updated on Sep 5 2017 12:22 PM

ఎగువ నిండేదాకా దిగువ కడగండ్లే!

ఎగువ నిండేదాకా దిగువ కడగండ్లే!

కృష్ణా నది పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ఎండిపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది.

ఎగువ కర్ణాటక ప్రాజెక్టుల్లో 242 టీఎంసీల నీటి కొరత
► అవి నిండితేనే దిగువ జూరాల, శ్రీశైలం, సాగర్‌లకు నీరు
► 396 టీఎంసీల నీరొస్తేనే ప్రాజెక్టులు నిండే అవకాశం
►  లేదంటే సాగు, తాగునీటి అవసరాలకు తప్పని కటకట
 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నది పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ఎండిపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. కర్ణాటకలోని ప్రధాన ప్రాజెక్టులైన ఆలమట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో 242 టీఎంసీల నీటి కొరత ఉండటం, అవి నిండితేగానీ దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు నిండే అవకాశం లేకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

గణనీయంగా పడిపోయిన మట్టాలు...
కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా నీటిమట్టాలు పడిపోయాయి. ఎగువ కర్ణాటకలో గతేడాది ఆలస్యంగానైనా (సెప్టెంబర్, అక్టోబర్‌) భారీ వర్షాలు కురవడం వల్ల ఆలమట్టి, నారాయణపూర్‌లు నిండినా... ఖరీఫ్, రబీలలో అక్కడ గణనీయంగా సాగు జరగడంతో ఆ రెండు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 167 టీఎంసీల నిల్వకుగానూ కేవలం 25 టీఎంసీల నీటి లభ్యతే ఉంది.

ఇక తుంగభద్ర పరీవాహకంలో పెద్దగా వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 100 టీఎంసీలకుగానూ ఒక టీఎంసీ నీరు కూడా లేదు. దీంతో ఎగువ ప్రాజెక్టుల్లోనే దాదాపు 242 టీఎంసీల నీటి కొరత కనబడుతోంది. గతేడాది ఇదే సమయంలో ఉన్న నిల్వలతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 15 టీఎంసీలు తక్కువగా ఉంది. ఎగువన సుమారు 200 టీఎంసీల మేర నీరు చేరాకే దిగువకు నీరు వచ్చే అవకాశాలుంటాయి. అది జరగడానికి రెండు నెలలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది.

శ్రీశైలం, సాగర్‌దీ అదే పరిస్థితి...
ప్రస్తుతం జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో 396 టీఎంసీల మేర నీటి కొరత ఉంది. ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో వినియోగార్హమైన నీటి నిల్వలు 2 నుంచి 3 టీఎంసీల లోపే ఉన్నాయి. ఆ నీరు ఇరు రాష్ట్రాల జూన్‌ తాగునీటి అవసరాలను తీర్చగలిగేది అనుమానమే. ఒకవేళ జూన్, జూలైలో మంచి వర్షాలు కురిసినా రాష్ట్ర ప్రాజెక్టుల్లో చేరే నీటిలో సుమారు 90 టీఎంసీల నుంచి 100 టీఎంసీల మేర తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాకే ఖరీఫ్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్, అక్టోబర్‌ వరకు ఖరీఫ్‌ ఆయకట్టుపై స్పష్టత వచ్చే అవకాశాల్లేవు. సాగునీటి ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరని పరిస్థితుల్లో ఆ ప్రభావం మొత్తంగా 11 లక్షల ఎకరాల ఆయకట్టుపై పడే అవకాశం ఉంది. సాగర్‌ ఎడమ కాల్వ కింద నల్లగొండ జిల్లా పరిధిలోని కాలువల కింద 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్‌ల కింద 47 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో మరో 2.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎక్కువగా ఇబ్బందులు ఉండనుండగా జూరాల కింద లక్ష ఎకరాలు, పాక్షికంగా పూర్తయిన భీమా, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, కల్వకుర్తిల కింద మరో 4 లక్షల ఎకరాలకు నీరివ్వడం కష్టంగా మారనుంది. సకాలంలో నీరు రాకుంటే గతేడాది మాదిరే ఈసారీ తాగునీటికి కటకట ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో భారమంతా నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడే తుపానులపైనే ఆధారపడి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement