లోక్‌సభ అభ్యర్థులపై  టీఆర్‌ఎస్‌ ప్రకటన

Trs, Bjp  Warangal Mp Contestents  Releases Tomorrow - Sakshi

లోక్‌సభ అభ్యర్థులపై  టీఆర్‌ఎస్‌ ప్రకటన

నిజామాబాద్‌ సభలో స్పష్టత ఇచ్చిన కేసీఆర్‌ 

వరంగల్, మహబూబాబాద్‌లకు రేపు ఖరారు

 అదే రోజు బీజేపీ సైతం   

సాక్షి ప్రతినిధి వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాలకు గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిజామాబాద్‌ పార్లమెంట్‌ సన్నాహక సభలో మంగళవారం స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఐదు స్థానాలపై స్పష్టత ఇచ్చిన కేసీఆర్‌... మరో 11 స్థానాలకు ఈనెల 21న అభ్యర్థులను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో వరంగల్, మహబూబాబాద్‌ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ 25న ముగియనుండగా... 21, 23, 24 తేదీలు సెలవు దినాలు. 21న అభ్యర్థులను ప్రకటిస్తే 22న నామినేషన్‌ వేసేందుకు అవకాశం ఉంటుందని అధినేత భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు నియోజకవర్గాలకు 21వ తేదీనే అభ్యర్థులను ప్రకటించేందుకు నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అభ్యర్థుల ప్రకటన విషయంలో అధికార పార్టీ జాబితాపై ఇప్పటికే ఆలస్యం జరిగినా... వరంగల్, మహబూబాబాద్‌ సిట్టింగ్‌లకు ఇవ్వడమా? మార్చడమా? అన్న విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు. అయితే వరంగల్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్‌ మళ్లీ పోటీ చేసేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. సోమావారం హైదరాబాద్లో కేటీఆర్ను కలిసిన ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు.

ఇదే సమయంలో ఈ స్థానం నుంచి  మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అదేవిధంగా మహబూబాబాద్‌ స్థానంలో సిట్టింగ్‌ ఎంపీ సీతారాం నాయక్‌ను మార్చితే మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి రామచంద్రనాయక్‌ పేర్లు అధినేత కేసీఆర్‌ పరిశీలిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ రెండు స్థానాలకు గురువారం అభ్యర్థులను ప్రకటించనుండగా రెండింటికి రెండు సిట్టింగ్‌ ఎంపీలకు ఇస్తారా? లేక మార్పులు చేస్తారా? మార్పులు చేస్తే ఎక్కడ ఎవరికి ఇస్తారు? ఏ స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తారు? అన్న సస్పెన్స్‌కు అదేరోజు తెరపడనుంది.

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మహబూబాబాద్‌కు కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, వరంగల్‌కు దొమ్మాటి సాంబయ్యలను కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ప్రకటించింది. గురువారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ సైతం అదే రోజు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నామని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదే జరిగి ఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తే ఇక నామినేషన్లు, ప్రచారమే తరువాయిగా మారనుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top