‘డబుల్’కు ట్రబుల్!


- గందరగోళంగా మారిన రెండు పడక గదుల పథకం


- లబ్ధిదారుల ఎంపిక ఆసాంతం అస్తవ్యస్తం


- ఏ ప్రాతిపదిక లేకుండా సాగుతున్న ఎంపిక


- అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ప్రక్రియ


- మొదటి విడతలో ఒక్కో ఊరికి వచ్చేది ఐదు ఇళ్లే!


- తమకే కేటాయించాలంటూ అనుచరుల ఒత్తిళ్లు


- వారి జాబితానే పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు


- అసలు లబ్ధిదారులను పట్టించుకునే వారే కరువు


- రాష్ట్రంలో గూడు లేని కుటుంబాలు 4 లక్షలపైనే


 


సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదులు, ఓ వంటగది, రెండు టాయిలెట్లు, ఇంటి ముందు విశాల స్థలం..! ‘డబుల్ బెడ్రూం’ పథకంలో రాష్ట్ర సర్కారు పేదలకు నిర్మించి ఇవ్వనున్న ఇళ్లు ఇవీ!! దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పథకం అత్యంత గందరగోళంగా మారింది. లబ్ధిదారుల ఎంపిక ఓ పజిల్‌లా తయారైంది. విధివిధానాలు ప్రకటించి సర్కారు చేతులు దులుపుకున్నా.. క్షేత్రస్థాయిలో పథకం అమలు అయోమయంగా మారిపోయింది.


 


లబ్ధిదారుల ఎంపిక చిత్రవిచిత్రంగా సాగుతోంది. ఈ మొత్తం ప్రక్రియ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగుతుండటంతో.. తమకే ఇళ్లు కేటాయించాలంటూ అనుచరులు, పార్టీ సానుభూతిపరుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో అర్హుల ఎంపికకు ఓ ప్రాతిపదికంటూ లేకుండా పోయింది. గతంలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక కసరత్తు జరగడం లేదు. స్థానిక నేతలు ఇచ్చిన జాబితాలతోనే ఎమ్మెల్యేల కార్యాలయాలు నిండిపోతున్నాయి. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట్ల ఆ వ్యవహారాన్ని జిల్లా మంత్రులు చక్కబెట్టేందుకు సిద్ధమయ్యారు.


 


వచ్చేవి ఊరికి ఐదే..


డబుల్ బెడ్రూం పథకం కింద మంజూరైన ఇళ్లను రాష్ట్రవ్యాప్తంగా పంచితే ఊరికి ఎన్ని ఇళ్లు కేటాయించాల్సి వస్తోందో తెలుసా...? కేవలం ఐదు! ఆశ్చర్యంగా ఇది నిజం. పథకం తొలివిడత కింద ప్రభుత్వం 60 వేల ఇళ్లను కేటాయించింది. వీటిలో సీఎం కోటా పోను మిగతా వాటిని నియోజకవర్గానికి 400 చొప్పున పంచారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున 80-90 గ్రామాలుంటాయి. అంటే ఒక్కో గ్రామానికి గరిష్టంగా ఐదు ఇళ్లు వస్తాయన్న మాట. ఆ ఐదు ఇళ్లకు ప్రతి ఊరిలో కనీసం వందకు తక్కువ కాకుండా కుటుంబాల పేర స్థానిక నేతలు ఎమ్మెల్యేలు/జిల్లా మంత్రులకు జాబితాలు సమర్పించేశారు.


 


దీంతో ఆ ఐదు ఇళ్లలో అధికార పార్టీ అనుచరులే పాగా వేసే పరిస్థితి నెలకొంది. మొత్తం ఇళ్లలో 50 శాతం స్థానిక ఎమ్మెల్యే, మిగతా 50 శాతం జిల్లా మంత్రి ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ ఇళ్లు ఏయే గ్రామాల్లో నిర్మించాలో కూడా వీరే ఖరారు చేస్తారు. వీరు సిద్ధం చేసిన జాబితాను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని రెవెన్యూ అధికారుల బృందం పరిశీలిస్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అయితే గ్రేటర్ కమిషనర్ నియమించిన అధికారుల బృందం పరిశీలిస్తుంది. జాబితాను గ్రామసభ/వార్డు సభలో ప్రదర్శించి అర్హతను ఖరారు చేస్తారు. అనంతరం దాన్ని కలెక్టర్‌కు సమర్పిస్తారు. మరోసారి అధికారుల బృందం తుది పరిశీలన పూర్తి చేయటంతో అధికారికంగా లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుంది.


 


అర్హులకు చోటేది?


ఇప్పటివరకు ఏ నియోజకవర్గంలో ఏయే గ్రామాల్లో ఇళ్లు నిర్మించాలో తేల్చలేదు. గ్రామానికి సగటున ఐదు చొప్పున ఇళ్లు నిర్మించాల్సి రావటంతో గ్రామాల ఎంపిక ఎమ్మెల్యేలకు కత్తిమీద సాములా మారింది. దీంతో తొలుత కొన్ని గ్రామాలనే ఎంపిక చేయాలని చాలా మంది ఎమ్మెల్యేలు నిర్ణయించారు. మరోవైపు అధికార పార్టీ క్రియాశీలంగా ఉన్న గ్రామాల్లో సర్పంచులు, స్థానిక నేతలు ఇప్పటికే జాబితాలు సమర్పించారు. వాటి నుంచే ఉజ్జాయింపుగా కొన్ని పేర్లను కూడా సిద్ధం చేశారు.


 


కానీ ఎక్కడా గతంలో ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గానీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్వహించిన సర్వే నివేదికను గానీ ప్రాతిపదికగా తీసుకోలేదు. స్థానిక నేతలు, సర్పంచులు సమర్పించిన జాబితాలనే ఎమ్మెల్యేలు పరిగణనలోకి తీసుకున్నారు. ఫలితంగా ఇళ్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న అసలైన పేదలకు ‘చోటు’ లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపికపై నేతల నుంచి ఒత్తిడి ఉండటంతో సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప తన నియోజకవర్గంలో ఈ పథకం శంకుస్థాపనకే దూరంగా ఉండిపోవడం గమనార్హం.


 


వచ్చే విడతలో ఊరికి కనీసం 25 ఇళ్లు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి


 ‘‘ఈ విడత కేవలం నమూనా (మోడల్)గానే పరిగణిస్తున్నాం. తక్కువ ఊళ్లు ఎంపిక చేస్తే ఎక్కువ ఇళ్లు చొప్పున వస్తాయి. మలి విడత కింద కనీసం ఊరికి 25 ఇళ్లు వచ్చేలా కేటాయిస్తాం. ఈసారి అందరికీ ఇళ్లు సాధ్యం కాకున్నా.. వచ్చేవి కూడా నిరుపేదలకే ఇచ్చేలా చూస్తున్నాం. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు ఎంపిక చేసిన లబ్ధిదారులు అర్హులా కాదా అన్నది కలెక్టర్లు తనిఖీ చేస్తారు. ఎక్కడా అనర్హులు లేకుండా చూస్తాం’’


 


గూడు లేనివారెందరో..


  • రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల పేద కుటుంబాలకు సొంతిళ్లు లేవు. జనాభా లెక్కల ఆధారంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వమే ఈ  మేరకు తెలిపింది.

  • రాష్ట్రంలో 2.5 లక్షల కుటుంబాలు కనీస ప్రమాణాలకు నోచుకోని ఇళ్లలో గడుపుతున్నాయి. ఊళ్ల అవతల ప్లాస్టిక్ కాగితాలు, వెదురు తడకల్లాంటి వాటినే ఆవాసంగా మార్చుకుని ఉంటున్నాయి. ఇలాంటి కుటుంబాల వివరాలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సర్వే నివేదికలో ఉన్నాయి.

  • ఉమ్మడి రాష్ట్రంలో రచ్చబండ పథకం కింద దరఖాస్తు చేసి ఇళ్లు మంజూరై ఎదురుచూస్తున్న కుటుంబాలు 5 లక్షల వరకు ఉన్నాయి.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top