
సాక్షి, హైదరాబాద్: సిక్కిం, పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. అలాగే ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ రెండింటి ప్రభావాలతో బుధవారం కుమ్రంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గురువారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. గత 24గంటల్లో వరంగల్ రూరల్ జిల్లా వెంకటాపూర్‌లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా గార్ల, భూపాలపల్లి జిల్లా ములుగు, పెద్దపల్లి జిల్లా మంథనిలలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. గూడూరు, భూపాలపల్లి, మహబూబాబాద్‌లలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.