రాజకీయ చతురత అంటే ఇదే! | thst is caled political game | Sakshi
Sakshi News home page

రాజకీయ చతురత అంటే ఇదే!

May 1 2016 5:09 AM | Updated on Sep 17 2018 5:32 PM

రాజకీయ చతురత అంటే ఇదే! - Sakshi

రాజకీయ చతురత అంటే ఇదే!

టీపీసీసీలో ఒక ముఖ్యనాయకుడు చూపుతున్న రాజకీయ చతురతను చూసి ఆ పార్టీ ముఖ్యనేతలు, సీనియర్లే ముక్కున వేలేసుకుంటున్నారు.

టీపీసీసీలో ఒక ముఖ్యనాయకుడు చూపుతున్న రాజకీయ చతురతను చూసి ఆ పార్టీ ముఖ్యనేతలు, సీనియర్లే ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఆయన నెరపుతున్న రాజకీయాన్ని చూసి అంతే గుర్రుగా కూడా ఉన్నారట. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన టీపీసీసీ కార్యవర్గంపై సదరు నేత తప్ప మరెవ్వరూ సంతృప్తిగా లేరట. ఎందుకంటే తనకు కావాల్సిన వారందరిని కూడా ఎగ్జిక్యూటివ్‌లో స్థానం కల్పించడంలో ఆయన పూర్తిస్థాయిలో సఫలమయ్యారట. అందుకోసం ఆయన పన్నిన వ్యూహం, రాజకీయంగా ప్రదర్శించిన తెలివితేటల పట్ల పార్టీనాయకుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కార్యవర్గంలో తన కోటా తాను తెచ్చుకుని, మిగతా వారిని దిగ్విజయ్‌సింగ్, కొప్పుల రాజు, ఆర్‌సీ కుంతియా వంటి వారి ద్వారా పరోక్షంగా సిఫార్సు చేయించుకుని స్థానం కల్పించారట. దీంతో కార్యవర్గంలో మెజారిటీ ఆయన అనుయాయులతోనే నిండిపోయిందట.

పార్టీకి అనుబంధంగా ఉన్న ఆయా విభాగాలకు సదరునాయకుడిని ఇన్‌చార్జీగా చేయాలని రాష్ర్ట నాయకత్వానికి ఒక నాయకుడు సూచించాడట. ఇప్పటికే పలు బాధ్యతలు ఉన్నందున ఆయనపై మరింత వద్దులే అని ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సదరునేత పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా మళ్లీ ఢిల్లీస్థాయిలో పావులు కదిపి అక్కడి నుంచే ఈ ప్రతిపాదన వచ్చేలా చేశారట. ఇది చూసి ముఖ్యనేతలకు దిమ్మతిరిగి పోయిందట.

గతంలో  స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా పోటీ నివారణకు టీఆర్‌ఎస్-కాంగ్రెస్ ఒక అవగాహనకు వచ్చి బలమున్న సీట్లను పంచుకోవాలనే ప్రాథమిక చర్చ జరిగిందట. దీనిని కూడా కుమ్మక్కు రాజకీయాల కింద ఈ నాయకుడు చిత్రించడంతో కొన్ని జిల్లాల్లో పోటీకి అభ్యర్థులను కూడా పెట్టక అప్రతిష్టపాలు కావొచ్చిందని కాంగ్రెస్‌నాయకులు వాపోతున్నారు. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో పోటీ వలన పార్టీ నుంచి కోట్లాదిరూపాయల చమురు కూడా వదిలిన వైనాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేత తెలివితేటల కారణంగా పార్టీలో ఇంకా ఏమేమి జరుగుతుందోనని కాంగ్రెస్ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement