దిగమింగారు.. దొరికిపోయారు | The government allocated funds for the poor children | Sakshi
Sakshi News home page

దిగమింగారు.. దొరికిపోయారు

Jun 4 2014 3:09 AM | Updated on Sep 2 2017 8:16 AM

పేదల పిల్లల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు దుర్వినియోగమవుతున్నాయి. సమీక్షలు, అవగాహన సదస్సులు, ప్రచార ఆర్భాటాలతోనే అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు.

రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం)ను అవినీతి మత్తు వదలడం లేదు. తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రాథమిక విద్యకు పెద్దపీట వేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల బడ్జెట్ కేటాయిస్తుండగా... ఖర్చు చేయాల్సిన అధికారులు జేబులు నింపుకుంటున్నారు. నిధులు పక్కదారి పట్టించిన అధికారులు అడ్డంగా దొరికిపోయారు.
 
 కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : పేదల పిల్లల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు దుర్వినియోగమవుతున్నాయి. సమీక్షలు, అవగాహన సదస్సులు, ప్రచార ఆర్భాటాలతోనే అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు.
 
 గతంలో ఏక రూప దుస్తుల పంపిణీ టెండర్ల విషయంలో, పుస్తకాల పంపిణీలో అవకతవకలు జరిగిన విషయం విదితమే. తాజాగా పేద పిల్లల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులను ఎంఈవోలు దుర్వినియోగం చేశారని తేలింది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక విచారణ ఆధారంగా మంగళవారం ఐదుగురు ఎంఈవోలు, ఆర్వీఎం ప్రత్యామ్నాయ పాఠశాలల కోఆర్డినేటర్ (అలెస్కో)లను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
 
 కరీంనగర్ ఎంఈవో వేణుగోపాల్, ఎల్లారెడ్డిపేట ఎంఈవో రాజయ్య, రామగుండం ఎంఈవో మధుసూదన్, కాటారం ఎంఈవో కిషన్‌రావు, మంథని ఎంఈవో గంగాధర్, అలెస్కో జిల్లా కోఆర్డినేటర్ జయరాజ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా అటు విద్యాశాఖ, ఇటు రాజీవ్ విద్యామిషన్ అధికారులు ఉలిక్కిపడ్డారు.
 
 నిధుల దుర్వినియోగ ఫలితం
 2010-11, 2011-12, 2012-13 విద్యా సంవత్సరానికి గాను బాల కార్మికుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలల నిధులు(ఆర్‌ఎస్‌టీసీ) దుర్వినియోగం అవుతున్నాయని, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పిన పాఠశాలల నిర్వహణ విషయంలో పిల్లలు లేకున్నా హాజరుశాతం ఎక్కువగా చూపడం, పాఠశాలల నిర్వాహకులు, అలెస్కో జిల్లా కో ఆర్డినేటర్, ఎంఈవోలు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించారు. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి అందించారు.
 
 దీంతో రాష్ట్ర శాఖ నుంచి సంబంధిత ఆర్జేడీతోపాటు విద్యాశాఖ ఆర్వీఎం శాఖలకు నివేదిక ప్రతులు అందజేశారు. దీని ఆధారంగా కలెక్టర్ జోక్యం చేసుకొని అవినీతికి పాల్పడ్డ ఐదుగురు ఎంఈవోలతోపాటు అలెస్కో జిల్లా కోఆర్డినేటర్‌పై చర్యలు చేపట్టాలని ఆర్జేడీకి నివేదించడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆర్‌ఎస్‌టీసీలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థలు, అధికారులు అక్రమాలకు పాల్పడ్డట్లు తేలడంతో విచారణ లోతుగా చేపట్టి వారిపై కూడా వేటు వేయనున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement