కరోనాపై యుద్ధం... జైళ్ల శాఖ సైతం | Telangana Prisons Department also involved to fight with Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనాపై యుద్ధం... జైళ్ల శాఖ సైతం

Apr 15 2020 2:00 AM | Updated on Apr 15 2020 2:00 AM

Telangana Prisons Department also involved to fight with Coronavirus - Sakshi

చేనేత వస్త్రాలు, కుటీర పరిశ్రమల ద్వారా వస్తువులు, పెట్రోల్‌ బంకులు..ఇలా సమకాలీన అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తులతో తమదైన ముద్ర వేసుకుంటున్న తెలంగాణ జైళ్ల శాఖ కరోనాపై జరిగే యుద్ధంలోనూ పాల్గొంటోంది. వెంటిలేటర్‌కు పూర్తి ప్రత్యామ్నాయం కాకపోయినా శ్వాస తీసుకోలేని కరోనా బాధితులకు కృత్రిమ శ్వాస అందించడానికి ‘మెకానికల్‌ రెస్పరేటరీ సపోర్ట్‌ సిస్టమ్‌’పేరుతో పరికరాన్ని రూపొందించింది. దీన్ని పరీక్షించిన నగరానికి చెందిన ఓ ఆస్పత్రి వైద్యులు సైతం సంతృప్తి వ్యక్తం చేయడంతో అప్రూవల్‌ కోసం ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)కు లేఖ రాయాలని నిర్ణయించింది. కరోనా బాధితులకు ప్రధానంగా ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకుంటారు. అలాంటి వారికి వైద్యులు వెంటిలేటర్‌ ద్వారా శ్వాస అందిస్తుంటారు. మానవుడి శ్వాస అన్నివేళలా ఒకే విధంగా ఉండదు. అది తీసుకునే ప్రమాణంలో హెచ్చుతగ్గులు, సమయాల్లో మార్పులు ఉంటాయి. వెంటిలేటర్‌లో ఉండే మైక్రోప్రాసెసర్‌ వీటిని ముందుగానే గుర్తించి రోగికి అవసరమైన స్థాయిలో, ఆయా సందర్భాల్లో ఆక్సిజన్‌ను ఊపిరితిత్తులకు పంప్‌ చేస్తూ ఉంటుంది.     
– సాక్షి, హైదరాబాద్‌

ఎక్కువ ధర ఉండటంతో..
ఒక్కో వెంటిలేటర్‌ రూ.20 లక్షలకు పైగా ఖరీదు ఉండటంతో పాటు ఒకేసారి వీటి ఉత్పత్తిని పెంచేందుకు ఆస్కారం లేకపోవడంతో దిగుమతి చేసుకోవడం ఒక్కటే మార్గంగా మారింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని తెలంగాణ జైళ్ల శాఖ ఈ మెకానికల్‌ రెస్పరేటరీ సపోర్ట్‌ సిస్టమ్‌ను రూపొందించింది. ఆ శాఖ డీజీ రాజీవ్‌ త్రివేది ఆలోచన మేరకు చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ దశరథరామిరెడ్డి నేతృత్వంలోని బృందం చర్లపల్లి కేంద్ర కారాగారంలోని స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వర్క్‌షాప్‌లో దీన్ని తయారు చేసింది. ఆదివారం నగరంలోని ఓ ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలో దీన్ని పరీక్షించగా..సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఉపకరణం ఆక్సిజన్‌ సరఫరా వ్యవస్థకు, రోగికి మధ్య అనుసంధానించి ఉంటుంది. దీని ద్వారా రోగికి అందే ఆక్సిజన్‌ ఫ్రీక్వెన్సీతో పాటు పరిమాణాన్నీ మార్చుకోవచ్చు. రోగికి అందే గాలిలో ఎంతవరకు ఆక్సిజన్‌ ఉండాలి అనేది నిర్దేశిస్తుంది. ఒక్కో ఉపకరణం తయారీకి గరిష్టంగా రూ.20 వేలు మాత్రమే ఖర్చవుతుందని అధికారులు చెప్తున్నారు. ఐసీఎంఆర్‌ అప్రూవల్‌ లభించిన తర్వాత పూర్తిస్థాయిలో తయారీ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

30 ఏళ్ల క్రితం ఘటనే కారణమా?
తెలంగాణ జైళ్ల శాఖ ఈ మెకానికల్‌ రెస్పరేటరీ సపోర్ట్‌ సిస్టమ్‌ తయారు చేయడం వెనుక డీజీ రాజీవ్‌ త్రివేదీకి 30 ఏళ్ళ క్రితం ఎదురైన అనుభవమే కారణం. అప్పట్లో ఆయన సన్నిహితులు ఒకరు చండీగఢ్‌ నుంచి సిమ్లాకు ప్రయాణించే క్రమంలో రైలు నుంచి పడిపోయారు. దీంతో ఆయనకు వెన్నుపూసలోని సీ4, సీ5 విరిగిపోవడంతో పాటు కార్డెరోపెల్జియాకు లోనయ్యారు. ఈ కారణంగా ఆయన మెడ నుంచి కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయి శ్వాస తీసుకోలేకపోయారు. ఆయనకు చికిత్స చేసిన చండీగఢ్‌ పీజీఐ వైద్యులు వెంటిలేటర్‌ అమర్చారు.

ఓ దశలో వెంటిలేటర్ల కొరత ఏర్పడటంతో ఆయనకు ఆక్సిజన్‌ అందించే సిలిండర్‌ను యాంబుబ్యాగ్‌తో అనుసంధానించారు. బ్లాడర్‌ మాదిరిగా ఉండే ఆ బ్యాగ్‌ను నొక్కుతూ ఉండాలని పేషెంట్‌ సన్నిహితులు, అటెండర్లకు సూచించారు. ఇలా రెండ్రోజుల పాటు జరిగిన వ్యవహారంలో కొన్ని గంటల పాటు రాజీవ్‌ త్రివేది సైతం పాలుపంచుకున్నారు. ప్రస్తుతం కరోనా రోగులకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు, వెంటిలేటర్ల కొరత వార్తలు విన్న రాజీవ్‌ త్రివేదీకి నాటి యాంబుబ్యాగ్‌ అనుభవం గుర్తుకొచ్చింది. నిర్విరామంగా ఈ బ్యాగ్‌ నొక్కుతూ ఉండటానికి ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగి సమీపంలో ఎవరూ ఉండరు గనుక ఆ పంపింగ్‌ కోసం డివైజ్‌ను సృష్టించి మెకానికల్‌ రెస్పరేటరీ సపోర్ట్‌ సిస్టమ్‌గా మార్చారు. 

మరో రెండు ఉపకరణాలు కూడా..
కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ జైళ్ళ శాఖ మరో రెండు ఉపకరణాలనూ తయారు చేసింది. ఇటీవల కాలంలో అనేక ప్రాంతాల్లో సేఫ్‌ టన్నెల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కార్యాలయాల్లోకి వెళ్ళే వారు వీటి ద్వారానే వెళ్ళాలని స్పష్టం చేస్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు రసాయనాలు పిచికారీ చేస్తూ శరీరం, వస్త్రాలపై ఉన్న వైరస్‌లు, బ్యాక్టీరియాలు చంపేందుకు ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత అనేక సినిమా హాళ్ళు, మాల్స్, షాపింగ్‌ సెంటర్లు తదితరాల్లో ఇవి ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టన్నెల్స్‌ కేవలం మూడు వైపుల నుంచే రసాయనాలను పిచికారీ చేస్తాయి. వాటి నుంచి వస్తున్న వ్యక్తి చెప్పులు, బూట్లకు కింది భాగంలో అంటుకుని ఉన్నవి చావవు.

ఈ నేపథ్యంలోనే పాదాలతో సహా 360 డిగ్రీల కోణంలో రసాయనం పిచికారీ చేసే టన్నెల్‌ను జైళ్ళ శాఖ రూపొందించింది. అలాగే చేతులతో పని లేకుండా, సెన్సర్లు వంటి ఆటోమేటిక్‌ పరిజ్ఞానాన్ని ఆపరేట్‌ చేసే శానిటరీ వాష్‌ బేసిన్లను తయారు చేసింది. కేవలం పెడల్స్‌ ద్వారానే నీరు, హ్యాండ్‌ వాష్‌లను విడుదల చేసే వీటిని ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేసింది. వీటిని ఖరీదు చేయాలనే ఆసక్తి ఉన్న వారు తెలంగాణ జైళ్ళ శాఖకు సంప్రదించాలని జైల్స్‌ డీజీ రాజీవ్‌ త్రివేది కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement