
జనాలకిచ్చింది తక్కువే
నోట్ల రద్దు వ్యవహారంతో బ్యాంకులకు డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయి.
⇒ వచ్చింది (డిపాజిట్లు) రూ. 17,750 కోట్లు
⇒ ఇచ్చింది (విత్‌డ్రాలు) రూ. 550 కోట్లు
⇒ మార్పిడి రూ. 3,750 కోట్లు
- సోమవారం వరకు రాష్ట్ర బ్యాంకుల్లో జరిగిన లావాదేవీల విలువ
- మరింతగా డిపాజిట్లు పెరగవచ్చంటున్న బ్యాంకర్లు
- నగదు కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- ఆచితూచి ఖర్చులు.. దారుణంగా దెబ్బతిన్న వ్యాపారాలు
- పక్షం రోజుల్లో నష్టపోయిన టర్నోవర్ రూ. 65 వేల కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్
నోట్ల రద్దు వ్యవహారంతో బ్యాంకులకు డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర పరిధిలోనే ఏకంగా వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ అవుతున్నాయి. బ్యాంకింగ్ వర్గాల సమాచారం మేరకు.. నోట్ల రద్దు ప్రకటించిన నాటి నుంచి సోమవారం వరకు తెలంగాణలోని బ్యాంకుల్లో రూ.17,750 కోట్ల నగదు జమ అయింది. ఇదే కాకుండా మరో రూ.3,750 కోట్ల మేర నోట్ల మార్పిడి జరిగింది. అంటే మొత్తంగా బ్యాం కులకు చేరిన మొత్తం రూ.21,500 కోట్లు కాగా... ఈ నెలాఖరు నాటికి డిపాజిట్ అయ్యే మొత్తం రూ.25 వేల కోట్లకు చేరుకుంటుందని రిజర్వు బ్యాంకు అంచనా వేస్తోంది. ఈ నెల 24 తరువాత నోట్ల మార్పిడికి అవకాశం ఉండదని.. ఎవరైనా పెద్ద నోట్లను సొంత ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాల్సిందేనని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
ఆచితూచి ఖర్చులు!
మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లు దాదాపుగా బ్యాంకులకు చేరడంతో.. జనం వద్ద ఇప్పుడు పరిమితంగా రూ.2 వేల నోట్లు, వంద నోట్లు మాత్రమే ఉన్నాయి. బ్యాంకుల నుంచి నగదు తీసుకునే అవకాశం లేకపోవడంతో ప్రజలు ఖర్చు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తు న్నారు. నగదు విస్తృతంగా అందుబాటులోకి వస్తే తప్ప సినిమా, షాపింగ్ వంటి వాటికి ప్రజలు దూరంగా ఉంటారని వ్యాపార, వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో రూ.21,500 కోట్లు బ్యాంకులకు చేరగా.. నోట్ల మార్పిడి, నగదు ఉపసంహరణ, ఏటీఎంల ద్వారా ప్రజల్లోకి తిరిగి వచ్చింది అందులో ఐదో వంతే. అంటే రూ.4,300 కోట్లు మాత్రమే. దీనిలోనూ సగానికిపైగా బ్లాక్ మార్కెట్‌కు చేరినట్లు బ్యాంకింగ్ వర్గాలే అంచనా వేస్తున్నాయి. రూ.2 వేల నోట్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించిన బ్యాంకుల వివరాలు రాబట్టేందుకు రిజర్వుబ్యాంకు ఇప్పటికే ఓ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెలాఖరుకు దీనికి సంబంధించిన నివేదిక అందుతుందని, వచ్చే నెల మొదటి వారంలో సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని రిజర్వుబ్యాంకు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
భారీగా పడిపోయిన వ్యాపారాలు
నోట్ల రద్దుతో రాష్ట్రంలో అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. గత 15 రోజుల్లో సుమారు రూ.65 వేల కోట్ల విలువైన వ్యాపారాలు, లావాదేవీలు పడిపోయాయని.. వాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల మేర వ్యాట్ ఆదాయం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారానికై నా పరిస్థితిలో మార్పు రాకపోతే.. ఈ నష్టం మరింతగా పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మద్యం రూపేణా వచ్చే పన్నులో భారీగా తగ్గుదల నమోదైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మాల్స్, ఇతరత్రా వ్యాపార, వాణిజ్య డీలర్ల దగ్గర వ్యాపారం పడిపోవడంతో వారి నుంచి వసూలయ్యే వ్యాట్ తగ్గుతుందని పేర్కొంటున్నాయి.
మరోవైపు నగదు కొరత సమస్య ఔషధ దుకాణాలపైనా పడింది. రాష్ట్రంలో రోజూ రూ.1,500 కోట్ల మేర మందులు విక్రయిస్తుండగా.. నోట్ల రద్దు తరువాత అది రూ.1,000 కోట్లకు తగ్గింది. అత్యవసర సర్వీసుల పరిస్థితే ఇలా ఉంటే మామూలు వ్యాపారాల సంగతి చెప్పనవసరం లేదు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలన్న తేడా లేకుండా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. చివరకు ఇటుక బట్టీల్లో కూడా కూలీలు పనులకు వెళ్లడం లేదు. బీడీ కార్మికులకు కూలీ అందడం లేదు. అసంఘటిత రంగంలో లక్షలాది మంది కార్మికులు పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.