ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు

Telangana High Court Questions Government Over TSRTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సమ్మె చేపట్టిన కార్మికులతో చర్చలు జరపాలని ఆర్టీసీ కార్పొరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. శనివారం ఉదయం 10.30 గంటలకు రెండు యూనియన్లను చర్చలకు పిలవాలని ఆర్టీసీకి తెలిపింది. అలాగే మూడు రోజుల్లో చర్చలు పూర్తిచేయాలని పేర్కొంది. శుక్రవారం ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వం వాదనలు విన్న కోర్టు తీర్పును వెలువరించింది. కార్మికుల డిమాండ్లు పరిష్కారం అయ్యేలా చూడాలని అభిప్రాయపడింది.  అలాగే చర్చల వివరాలను ఈ 28న కోర్టుకు తెలపాలని ఆదేశాలు జారీచేసింది.

అంతకు ముందు వాదనల సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీసీ ఎండీ నియామకం ఇప్పటివరకు ఎందుకు చేపట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎండీ నియామకం చేపట్టి ఉంటే కార్మికులకు కాసింత నమ్మకం కలిగి ఉండేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే న్యాయస్థానం మాత్రం ప్రభుత్వ తీరుపై పలు ప్రశ్నలు సంధించింది. ప్రస్తుతం ఆర్టీసీ ఇంచార్జ్‌గా సీనియర్‌ అధికారి ఉన్నారని ప్రభుత్వం తెలుపడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడున్న అధికారి సమర్థుడైతే ఎండీగా ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.

ప్రజలు శక్తివంతులని, వాళ్లు తిరగబడితే.. ఎవరు ఆపలేరని కోర్టు తెలిపింది. రెండు వారాలుగా ఆందోళనలు జరుగుతుంటే ప్రభుత్వం వాటిని ఎందుకు ఆపలేదని ప్రశ్నించిన న్యాయస్థానం.. కార్మిక సంఘాలతో చర్చలు ఎందుకు జరపలేదని ప్రశ్నించింది. రేపు(శనివారం) ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన రాష్ట్ర బంద్‌పై ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని కోరింది. కార్మికులు శాంతియుతంగా బంద్‌ చేపడితే అభ్యంతరం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

‘ప్రస్తుతం ఆర్టీసీ పీకల్లోతు అప్పుల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు 67 శాతం జీతాలు పెరిగాయి. ప్రభుత్వం నిధులు 600 శాతం పెరిగాయి. కార్మికులతో చర్చలు జరపడానికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేశాం. చర్చలు జరుగుతుండగానే కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయి. వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించింది. ఆర్టీసీని కోలుకోలేని దెబ్బతీసిన సంఘాలు.. సంస్కరణకు అడుగడుగునా అడ్డుతగులుతున్నాయ’ని ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top