హరితం శివం సుందరం | Telangana haritha haram program today | Sakshi
Sakshi News home page

హరితం శివం సుందరం

Jul 3 2015 2:45 AM | Updated on Aug 14 2018 10:54 AM

హరితం శివం సుందరం - Sakshi

హరితం శివం సుందరం

రాష్ట్రంలో 33 శాతం మేర పచ్చదనాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ‘తెలంగాణ హరితహారం’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు.

నేడు హరితహారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం
చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద ప్రారంభం.. 33 శాతం పచ్చదనం పెంచడమే లక్ష్యం
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 33 శాతం మేర పచ్చదనాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ‘తెలంగాణ హరితహారం’ కార్యక్రమానికి  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చిలుకూరు బాలాజీ మందిరంలో పూజలు నిర్వహించిన అనంతరం సాంఘిక సంక్షేమ వసతి గృహం ఆవరణలో మొక్కలు నాటడం ద్వారా ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు.

తొలుత నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించినా.. అనివార్య కారణాలతో కార్యక్రమం చిలుకూరుకు మారింది. శుక్రవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా హరితవారోత్సవాలు సాగుతాయి. సెప్టెంబర్ నెలాఖరు వరకు దీనిని ప్రజా ఉద్యమంగా రూపొందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. హరితహారంను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్ ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో బస్సు యాత్రల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
 
ఈజీఎస్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్
ఏపీఓతో సహా ఉపాధి హామీ సిబ్బంది 11 రోజులుగా సమ్మెలో ఉండడం హరితహారం కార్యక్రమానికి ప్రతిబంధకంగా మారనుంది. దీంతో ముందుజాగ్రత్తగా మండల స్థాయిలో ఎంపీడీఓకు కార్యక్రమ అమలు, పర్యవేక్షణ బాధ్యత అప్పగించింది. అయినా అటవీశాఖ నిర్వహిస్తున్న నర్సరీలు మినహా మిగిలిన విభాగాల పరిధిలోని నర్సరీల్లో మొక్కలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.

నర్సరీల్లో మొక్కలు, గుంతల తవ్వకం తదితరాలపై అధికారులు కాకిలెక్కలతో నివేదికలు రూపొందిం చినట్లు విమర్శలు ఉన్నాయి. నర్సరీల్లో విత్తనాల సేకరణ, పాలిథిన్ కవర్ల టెండర్లు వివాదాస్పదమయ్యాయి. మొక్కలు నాటే కార్యక్రమం నవంబర్ వరకు కొనసాగే సూచనలున్నాయి.
 
మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు
‘హరితం శివం సుందరం’ నినాదం స్ఫూర్తితో హరితహారంలో భాగంగా మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రతి గ్రామంలో 40 వేలు, నియోజకవర్గం పరిధిలో 40 లక్షల చొప్పున మొక్కలు నాటాలని నిర్దేశించారు. అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, గిరిజన సంక్షేమ శాఖలు, నీటి యాజమాన్య సంస్థ ద్వారా దాదాపు 4,300 నర్సరీల్లో ఇందుకోసం మొక్కలు సిద్ధం చేశారు.

హరితహారం పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయగా, మొక్కల సంరక్షణకు గ్రామస్థాయిలో సర్పంచ్ చైర్మన్‌గా ‘హరిత రక్షణ కమిటీలు’ ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement