150 టీఎంసీలు ఎత్తిపోయాలి

Telangana CM KCR Visits Kaleshwaram Project - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శనలో అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

జూన్‌లోనే గోదావరి జలాలను వినియోగంలోకి తేవాలి

కాళేశ్వరం నుంచి కోదాడ వరకు పంట చేలు తడపాలి

కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శనలో అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

పనులన్నీ త్వరగా పూర్తిచేయాలి

ప్రాజెక్టులకు దేవతామూర్తులు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు 

మంచిరోజు చూసి ప్రాజెక్టులు ప్రారంభిద్దామని వెల్లడి

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/సాక్షి, జగిత్యాల: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలంటే దశాబ్దాలు పట్టే దేశంలో రెండు మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పలు బ్యారేజీలు, అత్యంత క్లిష్టమైన ఎత్తిపోతల నిర్మాణాలు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను పూర్తిచేస్తుండడంతో ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. వలస పాలనలో నత్తనడకన నడిచిన తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పనులు.. స్వయంపాలనలో యుద్ధప్రాతిపదికన పూర్తి కావస్తుండడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కాళేశ్వరం నీటితో ఎస్సారెస్పీ ప్రాజెక్టును నింపుతామని స్పష్టంచేశారు. అలాగే 150 టీఎంసీల నదీజలాలను ఎత్తిపోసే విధంగా మేడిగడ్డ ప్రాజెక్టులు సిద్ధం చేయాలని.. తద్వారా కాళేశ్వరం నుంచి కోదాడ వరకు గోదావరి జలాలు పంటచేలను తడపాలని ఆకాంక్షించారు.

వీలైనంత మేర గోదావరి జలాలను జూన్‌లోనే వినియోగంలోకి తేవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరి«ధిలోని పలు పంపుహౌస్‌లు, బ్యారేజీలను మంగళవారం ఆయన సందర్శించారు. ఉదయం 8.45 గంటలకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌ వద్ద నిర్మిస్తున్న పంపుహౌస్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న రివర్స్‌ పంపింగ్‌ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. నాలుగు జిల్లాలకు సాగునీరందించే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును నింపే రాంపూర్‌ పంపుహౌస్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. పంపుహౌస్‌ ఎనిమిది మోటార్లలో ఐదింటిని జూలై 15లోగా ఏర్పాటు చేయాలని, మిగిలిన మూడు పంపుల పనులు ఆగస్టులోగా పూర్తిచేయాలని స్పష్టంచేశారు.


మేడిగడ్డ వద్ద పనుల వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఎం కేసీఆర్‌
వచ్చే నెలలోనే కాళేశ్వరం నీటిని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీకి పంపించాలని, ఇందుకు అనుగుణంగా అందరూ పనిచేయాలన్నారు. పనుల పురోగతిపై వారంలో రెండుసార్లు అధికారులతో సమీక్షించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు. జూలై నాటికి ఐదు పంపుల నిర్మాణాన్ని పూర్తిచేసి రోజుకు 0.6 టీఎంసీ నీటిని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉంచుతామని ప్రాజెక్టు ఈఎన్‌సీ మురళీధర్‌రావు సీఎంకు తెలిపారు. జూన్‌ 15నాటికి మోటార్ల డ్రైరన్‌ను పూర్తి చేస్తామని జూలై 15 నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. దాదాపు అరగంటపాటు అక్కడే ఉన్న సీఎం.. అనంతరం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజ్‌ సందర్శనకు వెళ్లారు.
 
నదిలోకి దిగి మొక్కు చెల్లింపు... 

సీఎం కేసీఆర్‌ తొలుత హెలికాప్టర్‌లో ఏరియల్‌ వ్యూ ద్వారా మేడిగడ్డ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టు పక్కన వ్యూ పాయింట్‌ నుంచి పనుల పురోగతిని చూసి, అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడ నుంచి బ్యారేజీ మీదుగా ప్రయాణిస్తూ.. ఇప్పటికే అమర్చిన 85 గేట్లను అక్కడక్కడా ఆగి పరిశీలించారు. ఆ తర్వాత బ్రిడ్జి దిగి కాఫర్‌ డ్యాం మీదుగా వెళ్లి పనులు సాగుతున్న తీరును స్వయంగా చూశారు. ఎండను సైతం తట్టుకుని పనిచేస్తున్న వర్కర్లకు అభినందనలు తెలిపారు. పక్కనే పాయలా పారుతున్న గోదావరి నది లోపలికి దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్లి నదిలో మొక్కు పైసలు జారవిడిచారు. మరికొద్ది రోజుల్లో ఆ ప్రాంతమంతా జలమయం కానుందని, అక్కడ ఇకపై ఎవరూ నిలబడలేరని, అదో చారిత్రక సందర్భమని సీఎం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తన వెంట వచ్చిన అధికారులు, పార్టీ నాయకులు, సిబ్బందితో ఫొటోలు దిగారు. సీఎం కేసీఆర్‌ మండుటెండను కూడా లెక్క చేయకుండా మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కలియతిరిగి అణువణువూ పరిశీలించారు. 

వారం పదిరోజుల్లో పూర్తి చేయండి... 
ప్రాజెక్టు పరిశీలన అనంతరం సీఎం కేసీఆర్‌ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 85 గేట్ల బిగింపు పూర్తి అయిందని, డ్యాం నుంచి చుక్క నీరు కూడా పోకుండా చూసేందుకు బిగిస్తున్న రబ్బరు సీలింగ్‌ పనులు సాగుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. 26 గేట్లకు రబ్బరు సీలు ఫిక్సింగ్‌ పూర్తికాగా, మిగిన 59 గేట్లకు బిగించాల్సి ఉందని చెప్పారు. ఈ పనులన్నీ వారం పదిరోజుల్లో పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. గోదావరి నదీ జలాలను వీలైనంత వరకు జూన్‌లోనే వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. మేడిగడ్డ పని పూర్తి చేసుకుని తద్వారా ప్రాణహిత నుంచి వచ్చే జలాలను ఈ సీజన్‌లోనే బ్యారేజీలో నిలువరించాలని సూచించారు.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌ వద్ద పంపుహౌస్‌ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌  

మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంపుహౌస్‌ ద్వారా అన్నారం బ్యారేజీలోకి, అక్కడనుంచి సుందిళ్ల బ్యారేజీలోకి రివర్స్‌ పంపింగ్‌ చేయడానికి సంబంధించిన పంపుహౌస్‌ల నిర్మాణాలు త్వరలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. కన్నెపల్లి పంపు హౌస్‌ నుంచి అన్నారం బ్యారేజీకి 3 టీఎంసీల నీటిని తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన 13.5 కిలోమీటర్ల అతిపెద్ద కాలువ పని కూడా పూర్తయిందని, ఆ నీటిని ఎల్లంపల్లి వరకు ఎత్తిపోసి, అక్కడ నుంచి నందిమేడారం పంపుల ద్వారా ఎస్సారెస్సీ వరద కాలువకు కాళేశ్వరం జలాలను చేరవేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. అదే వరద కాలువ ద్వారా మిడ్‌ మానేర్‌ డ్యాంను నింపితే, అక్కడ నుంచి మల్లన్నసాగర్‌ వరకు నీటిని తరలించడానికి అవకాశం ఏర్పడుతుందని సీఎం వివరించారు. 

వాకీటాకీలను సమకూర్చుకోండి... 

ఐదు పంపు హౌజులు, మూడు బ్యారేజీల పనులను పూర్తిచేసుకుని 150 టీఎంసీల నదీ జలాలను ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. తద్వారా కాళేశ్వం నుంచి కోదాడ వరకు గోదావరి జలాలు పంట చేలను తడపాలని ఆకాంక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులు ఒక సమాహారంగా ఉన్నందున ఒక బ్యారేజీ నుంచి ఇంకో బ్యారేజీకి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తగిన ఫోన్లతో పాటు వైర్‌లెస్‌ వాకీటాకీల వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులు పూర్తయి జలాలు వినియోగంలోకి వచ్చిన తర్వాత నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నందున ప్రాజెక్టుల వద్ద నీటిపారుదల శాఖ శాశ్వత భవనాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

దేవుడు కరుణించి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ప్రాజెక్టులకు దేవతామూర్తుల పేర్లు గానీ తెలంగాణ చరిత్రను సంస్కృతిని ప్రతిబింబించే పేర్లను గానీ పెట్టుకుందామని కేసీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్, టీఆర్‌ఎస్‌ నేతలు శ్రవణ్‌ కుమార్‌రెడ్డి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ రాజేశంగౌడ్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ‘మెగా’కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ ఏ.గోపాల్‌రావు తదితరులు ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top