గులాబీ ఎమ్మెల్యేలకు సర్వే ఫీవర్‌..!

గులాబీ ఎమ్మెల్యేలకు సర్వే ఫీవర్‌..! - Sakshi


నియోజకవర్గాల్లో బిజీ బిజీ.. జిల్లా పర్యటనల్లో మంత్రులు

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ పెద్ద పరీక్షే పెట్టారు. ఆయా ప్రజాప్రతినిధుల పనితీరును బేరీజు వేసేందుకు సీఎం అంతర్గత సర్వేలు చేయిస్తున్నారు. వారికి ప్రజల్లో ఉన్న బలమెంత? అదే సమయంలో పార్టీకి జనంలో ఉన్న ఆదరణ ఎంతంటూ లెక్కలు తీస్తున్నారు. దీంతో పార్టీ ప్రజాప్రతినిధులకు ‘సర్వే’ల జ్వరం పట్టుకుంది. ఒక్కో సర్వేలో తమ ర్యాంకును మెరుగుప రుచుకునేందుకు వారంతా నియోజకవర్గాలకు పరుగులు పెడుతున్నారు.



మరో సర్వే జరుగుతుందనడంతో..

పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై చేయించిన తొలి సర్వే ఫలితాలను కేసీఆర్‌ తొలుత బయటకు లీక్‌ చేయలేదు. రెండో సర్వే కూడా పూర్తి చేశాక.. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి వారి జాతకాలను బయట పెట్టారు. ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి పనితీరును విశ్లేషించారు. ఇక తాజాగా మూడో సర్వే కూడా చేపడుతున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యేలు తమ ర్యాంకును మెరుగుపర్చుకునే పనిలో పడ్డారు. అసలు నియోజకవర్గాలను వదిలి బయటకు రావడం లేదు. ఏప్రిల్‌ నెలలో సభ్యత్వ నమోదు, గ్రామ, మండల కమిటీల ఎంపిక వంటి సంస్థాగత పనులతో తీరిక లేకుండా గడిపారు.


ఆ నెలాఖరులో వరంగల్‌లో నిర్వహించిన సభకు జన సమీకరణ చేశారు. దాదాపు అందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటనలు పెట్టుకుంటున్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పనుల పర్యవేక్షణతో పాటు జనానికి అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు సైతం తమ జిల్లాల్లోనే ఏదో ఒక నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల పనుల్లో ఉంటుండడం గమనార్హం. ఇలాగైనా సీఎం సర్వేల్లో తమ ర్యాంకు మెరుగుపడుతుందనే యోచనలో ఉన్నారు.



పిలుపు ఉంటేనే క్యాంపు ఆఫీసుకు..

సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు వస్తున్న మంత్రుల సంఖ్య తగ్గిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం నుంచి ప్రత్యేకంగా పిలుపు ఉంటే తప్ప క్యాంపు ఆఫీస్‌కు రావొద్దన్న ఆదేశాలు మంత్రులకు వెళ్లాయని సమాచారం. హైదరాబాద్‌లో ఉంటే తమ శాఖలపై సమీక్షలు జరపడం, లేదంటే నియోజకవర్గాల్లో తమ శాఖల నుంచి చేపడుతున్న అభివృద్ధి పనుల కార్యక్రమాలకు హాజరుకావడం చేస్తున్నారు.


గతంలో నిత్యం సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టిన కొందరు మంత్రులు.. ఇప్పుడు దాదాపు నెల రోజులుగా అటు వైపు వెళ్లడం లేదని, సీఎం సూచనలే దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల పర్యటనలు పెరిగాయని, ఆయా నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు మొదలయ్యాయని అంటున్నారు. అంతే కాకుండా ఇటీవల విపక్షాల నుంచి అధికార పక్షంపై విమర్శల దాడి పెరిగిన నేపథ్యంలో... గతంలో ఏమీ పట్టనట్టు వ్యవహరించిన మంత్రులు కూడా ఇప్పుడు దూకు డుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top