నైరుతి.. నిరాశే!

South-West Monsoon Disappoints Telangana

ఖరీఫ్‌ సాగు డీలా..

జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య 13% లోటు వర్షపాతం

10 జిల్లాలు, 184 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు

వరి నాట్లు 82 శాతానికే పరిమితం

బాగా పడిపోనున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి

ఒక్క పత్తి సాగు మాత్రమే ఆశాజనకం

18 వేలకుపైగా చెరువులు ఖాళీ

సాక్షి, హైదరాబాద్ ‌: నైరుతి రుతుపవనాలు ఊరించి ఉసూరుమనిపించాయి.. తొలుత భారీ వర్షాలతో ఊపందుకున్నట్లు కనిపించినా చివరికి నిరాశ పర్చాయి.. సెప్టెంబర్‌ 30తో ముగిసిన ఖరీఫ్‌ సీజన్‌లో (జూన్‌ –సెప్టెంబర్‌) 13% లోటు వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్రం దాదాపు 18 వేల చెరువులు ఖాళీగానే ఉండిపోయాయి. మరో 10 వేల చెరువుల్లో సగం వరకు కూడా నీరు చేరలేదు. దీంతో రబీలోనూ పంటల సాగుపై నీలినీడలు అలుము కున్నాయి. అయితే ప్రస్తుతం అల్పపీడనాల ప్రభావం, నైరుతి తిరోగమనంలో ఉండటంతో పది పదిహేను రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

తొలుత ఊరించినా..
నైరుతి మొదలైన జూన్‌లో రాష్ట్రంలో 49 శాతం అధిక వర్షపాతం నమోదుకాగా.. తర్వాత పరిస్థితి తారుమారై జూలైలో 41 శాతం లోటు నమోదైంది. ఆగస్టులో 8 శాతం, సెప్టెంబర్‌లో 30 శాతం లోటు ఏర్పడింది. మొత్తంగా రాష్ట్రంలోని 184 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 307 మండలాల్లో సాధారణ, 92 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్, మెదక్‌ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, గద్వాల జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.

18 వేల చెరువులు ఖాళీయే!
నైరుతి సీజన్‌ ముగుస్తున్నా రాష్ట్రంలోని చాలా చెరువులు ఇంకా నిండలేదు. ప్రస్తుతం పడుతున్న వర్షాలేవీ భారీ ప్రవాహాలుగా మారే రీతిలో లేకపోవడంతో చెరువుల్లోకి నీరు చేరే పరిస్థితి కూడా కనిపించడం లేదు. రాష్ట్రంలో
మొత్తంగా 44 వేలకు పైగా చెరువులు ఉండగా.. 18,330 చెరువుల్లో నీటి జాడే లేదు. మరో 10 వేల చెరువుల్లో సగానికంటే తక్కువే నీరు చేరింది.

ముఖ్యంగా కృష్ణా బేసిన్‌ పరిధిలోని జిల్లాల చెరువులు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ బేసిన్‌ పరిధిలో మొత్తం 23,378 చెరువులుండగా.. 13,129 చెరువులు ఖాళీయే. సిద్దిపేట, నాగర్‌ కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోనే 9 వేలకు పైగా చెరువులు నీటి కటకటను ఎదుర్కొంటున్నాయి. ఇక గోదావరి బేసిన్‌ చెరువుల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఈ బేసిన్‌లో మొత్తంగా 20,814 చెరువులు ఉండగా.. 8 వేలకుపైగా చెరువుల్లో సగానికి కన్నా తక్కువగా నీటి నిల్వలున్నాయి.

‘పత్తి’పేరిటే సాగంతా..
ఖరీఫ్‌ పంటల సాగు నిరాశతోనే ముగిసింది. ఒక్క పత్తి తప్ప మిగతా పంటలన్నీ సాధారణ సాగును చేరుకోలేకపోయాయి. ఆహార ధాన్యాల సాగు బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా వరి సాగు భారీగా పడిపోయింది. కేవలం బోర్లు, బావుల కిందే వరి వేశారు. మొత్తంగా ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. ఈసారి 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.

ఆహార ధాన్యాలు, ఇతర పంటల సాగు భారీగా తగ్గినా.. పత్తి అంచనాలకు మించి పెరగడంతో మొత్తంగా సాగు పెరిగింది. ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలుకాగా.. ఈసారి 47.72 లక్షల (114%) ఎకరాల్లో వేశారు. అదే ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.70 లక్షల ఎకరాలుకాగా.. 40.72 లక్షల ఎకరాలకు తగ్గింది. ఇందులో వరి సాధారణ విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలకుగాను.. 19.07 లక్షల (82%) ఎకరాలకే పరిమితమైంది. కీలకమైన పప్పుధాన్యాల సాగు కూడా..10.55 లక్షల ఎకరాలకుగాను 9.27 లక్షల ఎకరాలకు తగ్గింది.

ఆహార ధాన్యాల దిగుబడి ఢమాల్‌!
ఖరీఫ్‌ సాగు తగ్గడం, సరైన సమయాల్లో వర్షాలు పడకపోవడంతో ఈసారి ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోనుందని వ్యవసాయ శాఖ మొదటి ముందస్తు అంచనా నివేదికలోనే స్పష్టం చేసింది.
ఖరీఫ్‌ ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 54.6 లక్షల టన్నులుకాగా.. 36.87 లక్షల టన్నులకే పరిమితం కావొచ్చని పేర్కొంది.

– ఈసారి వరి ఉత్పత్తి లక్ష్యం 32.47 లక్షల టన్నులుకాగా.. 22.66 లక్షల టన్నులే రావచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది ఉత్పత్తితో పోల్చితే ఇది ఆరున్నర లక్షల టన్నులు తక్కువ కావడం గమనార్హం.
– మొక్కజొన్న ఉత్పత్తి లక్ష్యం 18.64 లక్షల టన్నులకుగాను.. 11.86 లక్షల టన్నులే రావొచ్చని అంచనా వేశారు.
– జొన్న లక్ష్యం 50 వేల టన్నులుకాగా.. 29 వేల టన్నులే ఉత్పత్తి కానుంది.
– 2.94 లక్షల టన్నుల పప్పుధాన్యాల దిగుబడి అంచనా వేయగా.. 2.03 లక్షల టన్నులకే పరిమితం కానుంది. కీలకమైన కంది పప్పు 2.03 లక్షల టన్నులకుగాను 1.34 లక్షల టన్నులు, పెసర 64 వేల టన్నులకుగాను 49 వేల టన్నులకు తగ్గిపోనుంది.
– సోయా ఉత్పత్తి లక్ష్యం 2.97 లక్షల టన్నులుకాగా 1.71 లక్షల టన్నులే దిగుబడి వస్తుందని అంచనా.

నేడు భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా భారీ వర్షాలు నమోదవుతాయని వైకే రెడ్డి వెల్లడించారు. తర్వాత మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

అతి తక్కువగా చెరువులు నిండిన జిల్లాలు

జిల్లా            నిండని చెరువులు    సగానికి కన్నా తక్కువ నిండినవి
సిద్దిపేట            2,310                          794
నాగర్‌కర్నూల్‌    2,100                          61
రంగారెడ్డి           1,524                          247
మహబూబ్‌నగర్‌ 1,467                           516
నల్లగొండ          1,353                           488
పెద్దపల్లి            1,022                           66

లోటుపై అధ్యయనం చేస్తున్నాం – కేంద్ర భూవిజ్ఞాన శాఖ
ఈసారి నైరుతి రుతుపవనాల వల్ల వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా నమోదైందని కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దానివల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై ప్రభావం పడుతోందని ఆ శాఖ కార్యదర్శి ఎం.రాజీవన్‌ తెలిపారు. రుతుపవనాలు ప్రారంభమైన తొలి రెండు నెలల్లో సాధారణంకన్నా 3 శాతం అధికంగా వర్షపాతం కురిసిందని, మిగతా రెండు నెలల్లో 12.5 కొరత నెలకొందని చెప్పారు. తక్కువ వర్షపాతానికి కారణాలపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top