ద.మ.రై ధనాధన్‌..!

South Central Railway Speed Hikes 100 Trains - Sakshi

వంద రైళ్ల వేగం పెంపు

5 నుంచి 125 నిమిషాల వరకు స్పీడ్‌  

15 నుంచి 30 నిమిషాల వేగం పెరిగినవి 58 రైళ్లు

60 నిమిషాల వేగం పెరిగినవి ఆరు..

ట్రాక్‌ సామర్థ్యం, విద్యుదీకరణ, మౌలిక సదుపాయాలే కారణం  

సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వేలో సుమారు వందకు పైగా రైళ్ల వేగాన్ని పెంచారు. కనిష్టంగా 5 నుంచి గరిష్టంగా 125 నిమిషాల వరకు వేగం పెరగడం గమనార్హం. దూరప్రాంతాల మధ్య పరుగులు తీసే రైళ్ల వేగాన్ని గణనీయంగా పెంచారు. అలాగే సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్ల వేగం మాత్రం 10 నుంచి 15 నిమిషాల వరకే పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరి ఉదయం 6 గంటలకు ముంబై చేరుకొనే దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ ఇప్పుడు మధ్యాహ్నం 1.25 గంటలకు  బయలుదేరి  అదే సమయానికి  గమ్యంచేరుకుంటుకుంది. నగరం నుంచి బయలుదేరే ప్రయాణికుల సదుపాయం కోసం ఇక్కడి నుంచి బయలుదేరే సమయాన్ని మధ్యాహ్నం 12 నుంచి 1.25 గంటలకు పొడిగించారు. కానీ పాత సమయం ప్రకారమే అది గమ్యం చేరుకుంటుంది. అంటే ట్రైన్‌ వేగం గంటకు పైగా పెరగడమేఇందుకు కారణం. అలాగే సికింద్రాబాద్‌ మీదుగా వెళ్లే నర్సాపూర్‌–నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ 25 నిమిషాల వేగం పెరిగింది. సికింద్రాబాద్‌–నాగ్‌పూర్, సికింద్రాబాద్‌–రాజ్‌కోట్, కాచిగూడ–మధురై తదితర రైళ్ల వేగం సైతం 15 నుంచి 30 నిమిషాల వరకు వేగం పెరిగాయి. పటిష్టమైన ట్రాక్‌లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం గల కోచ్‌లు, సమయాభావాన్ని నియంత్రించే నిర్వహణతో మన రైళ్ల పరుగులో వేగం పెరిగింది. 

పెరిగిన పట్టాల సామర్థ్యం  
ద.మ. రైల్వే పరిధిలో ప్రతిరోజు 744 రైళ్లు తిరుగుతున్నాయి. ఒక్క హైదరాబాద్, సికింద్రాబాద్‌ నుంచే 250కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్, ట్రాక్‌ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఏటా రైళ్ల సమయపాలనలో మార్పులు చేస్తున్నారు. జోన్‌ పరిధిలో మొత్తం 6,234 కి.మీ ఉండగా, ఇప్పటి వరకు 3.538 కి.మీ విద్యుదీకరించారు. మరో 2,777 కి.మీ మార్గాన్ని విద్యుదీకరించేందుకు ప్రణాళికలను రూపొందించారు. దీంతో రైళ్ల వేగం పెరిగింది. బ్రిటీష్‌ కాలం నాటి గ్రాండ్‌ ట్రంక్‌ పట్టాల పునుద్ధరణతో పట్టాలపై ఎక్కువ రైళ్లు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభించింది. అలాగే కాపలాలేని రైల్వేగేట్లను తొలగించడం కూడా రైళ్ల రాకపోకలకు అంతరాయం లకుండా సిగ్నలింగ్‌ వ్యవస్థను మెరుగుపర్చారు.

కలిసొచ్చిన బైపాస్‌ రూట్లు
చాలాచోట్ల సుదీర్ఘమైన రైలు మార్గాలను కుదించడం వల్ల కొంత సమయం కలిసొచ్చింది. ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి విశాఖకు రాకపోకలు సాగించే రైళ్లు విజయవాడ మీదుగా వెళ్లాలి. అయితే, రాయనపాడు నుంచి వాటిని నేరుగా విశాఖ వైపు మళ్లించడం వల్ల విజయవాడకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. దూరం తగ్గడంతో రైళ్ల సమయ పాలనలోనూ మార్పు వచ్చినట్టు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాజీపేట్, బల్లార్ష మీదుగా వచ్చి బెంగళూరు వైపు వెళ్లే రైళ్లను సికింద్రాబాద్‌తో సంబంధం లేకుండా మౌలాలీ నుంచి కాచిగూడ మీదుగా వెళ్లేలా మార్పులు చేయడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్లకు అదనపు సమయం కలిసొచ్చింది. ఏపీ సంపర్క్‌ క్రాంతి వంటి పలు రైళ్లు నేరుగా కాచిగూడ మీదుగా బయలుదేరుతున్నాయి. గౌతమి ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరికొన్ని రైళ్లకు సికింద్రాబాద్‌లో కాకుండా లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్‌ ఇచ్చారు. దీనివల్ల సికింద్రాబాద్‌ వద్ద రైళ్లను టర్మినేట్‌ చేసి యార్డుకు మళ్లించే సందర్భంగా చోటుచేసుకొనే జాప్యానికి తావు లేకుండా పోయింది. మరోవైపు గంటకు 120 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్లలేని పాతకాలం నాటి కన్వెన్షనల్‌ ఐసీఎఫ్‌ కోచ్‌ల స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన లింక్‌ హాఫ్‌మెన్‌ బుష్‌ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను ప్రవేశపెట్టడం వల్ల రైళ్ల సామర్థ్యం గంటకు 140 కి.మీ పెరిగింది. కొన్నింటిలో 160 కిలోమీటర్లు కూడా పెరగడం గమనార్హం. ‘ఇదంతా ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. నిరంతర ప్రణాళికలు, కార్యాచరణలో తగిన మార్పులు చేసుకోవడం, అన్నింటికీ మించి లైన్ల సామర్థ్యాకి చేపట్టిన చర్యలతో రైళ్ల వేగం క్రమంగా పెరుగుతోంది. భవిష్యత్‌లో మన పట్టాలపై మరింత వేగంతో పరుగులు తీసే రైళ్లు అందుబాటులోకి వస్తాయి’ అని ద.మ రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా అన్నారు. 

వేగం ఇలా పెరిగింది..
జోన్‌ పరిధిలో మొత్తం 100 రైళ్ల వేగంలో మార్పులు చేశారు. కనిష్టంగా 5 నుంచి గరిష్టంగా 125 నిమిషాల వరకు ఈ వేగం ఉంది.  
68 ఎక్స్‌ప్రెస్‌ల సగటు వేగం 23 నిమిషాలు పెరగ్గా, మరో 32 ప్యాసింజర్‌ రైళ్ల సగటు వేగం 25 నిమిషాల వరకు పెరిగింది.
మొత్తం 100 రైళ్లలో 58 రైళ్ల వేగం 15 నిమిషాల వరకు పెరగ్గా, మరో 21 రైళ్ల వేగం 15 నుంచి 30 నిమిషాల వరకు పెంచారు. మరో 15 రైళ్ల వేగం 30 నుంచి 60 నిమిషాల వరకు
పెరిగింది.  
యశ్వంత్‌పూర్‌–టాటానగర్‌ (18112) ఎక్స్‌ప్రెస్‌ వేగం ఏకంగా 125 నిమిషాలు పెరగడం విశేషం.  
సికింద్రాబాద్‌–ముంబై సీఎస్‌టీ, గుంటూరు–విశాఖ, సికింద్రాబాద్‌–దేవగిరి, సికింద్రాబాద్‌–రాజ్‌కోట్, తదితర రైళ్ల వేగం గంట వరకుపెరిగింది.  
ఈ రైళ్లన్నీ గతంలో నిర్థారించిన సమయపాలన కంటే తక్కువ సమయంలో ఎక్కువ వేగంతో వెళుతున్నాయి. ట్రాక్‌ సామర్థ్యం, రైళ్ల నిర్వహణ పెరగడమే ఇందుకు కారణం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top