ఫస్టే.. కానీ లాస్ట్‌

South Central Railway Negligence on Railway Facilities - Sakshi

ఆదాయంలో ప్రథమం.. వసతుల్లో అథమం  

ఇదీ దక్షిణమధ్య రైల్వేలో పరిస్థితి  

ఆదాయంలో దేశంలోనే నంబర్‌ వన్‌  

సదుపాయాల కల్పనలో వెనుకబాటు  

రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

విస్తరణకు నోచని శివారు టర్మినల్స్‌

చర్లపల్లి, వట్టినాగులపల్లి ప్రతిపాదనలకే పరిమితం

సాక్షి, సిటీబ్యూరో: ఏటా రూ.కోట్లు ఆర్జిస్తూ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలుస్తోన్న దక్షిణమధ్య రైల్వే.. మౌలిక సదుపాయాల్లో మాత్రం  వెనుకబడి ఉంది. ప్రధాన మెట్రో నగరాల్లో రైల్వే సదుపాయాలు శరవేగంగా విస్తరిస్తుండగా... హైదరాబాద్‌లో మాత్రం ఒక అడుగు ముందుకు,నాలుగడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా..
ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా అభివృద్ధి, విస్తరణ జరగడం లేదు. దక్షిణమధ్య రైల్వే జోన్‌లోనే ప్రధాన స్టేషన్‌ అయిన సికింద్రాబాద్‌  దాదాపుగా స్తంభించింది. ప్రతిరోజు సుమారు 220 రైళ్లు, 1.95 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ స్టేషన్‌... చాలా ఏళ్ల క్రితమే సామర్థానికి మించిన ఒత్తిడికి చేరుకుంది. ఇక నాంపల్లి రైల్వేస్టేషన్‌ను విస్తరించేందుకు ఏ మాత్రం అవకాశం లేదు. అదనపు ప్లాట్‌ఫామ్‌లు కట్టేందుకు స్థలం లేదు. కాచిగూడ స్టేషన్‌లోనూ అదే పరిస్థితి. సుమారు  45వేల మందికి పైగా రాకపోకలు సాగించే ఈ స్టేషన్‌లో కేవలం 5 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ఈ మూడు ప్రధాన స్టేషన్‌లలోనూ రైళ్లు నిలిపేందుకు తగినన్ని ప్లాట్‌ఫామ్‌లు లేకపోవడంతో రాకపోకల్లో తీవ్రమైన జాప్యం నెలకొంటోంది. నగర శివార్లలోనూ రైళ్లనునిలిపివేయాల్సి వస్తోంది. మరోవైపు  ఇటీవల కాలంలో అభివృద్ధి చేసిన లింగంపల్లి రైల్వేస్టేషన్‌తో కొంతమేర ఊరట లభించినప్పటికీ సదుపాయాల కొరత ఇంకా తీరలేదు. నగర విస్తరణకుఅనుగుణంగా చర్లపల్లి, వట్టినాగులపల్లిలో పెద్ద టర్మినళ్లు నిర్మించేందుకు 2015లోనే ప్రణాళికలు రూపొందించారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు.  

లింగంపల్లితో ఊరట...
సికింద్రాబాద్‌పై ఒత్తిడి తగ్గించే చర్యల్లో భాగంగా లింగంపల్లి స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లను పొడిగించడం వల్ల కొన్ని రైళ్లకు హాల్టింగ్‌ సదుపాయం లభించింది. ఎంఎంటీఎస్‌ రాకపోకలకు మాత్రమే అనుగుణంగా ఉన్న ఈ స్టేషన్‌లో 24 బోగీలు ఉన్న ప్రధాన రైళ్లు ఆగేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్‌లను పెంచారు. ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీలను, అదనపు రిజర్వేషన్‌ కౌంటర్‌లను, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపర్చారు. దీంతో ప్రస్తుతం ఈ స్టేషన్‌ నుంచి ప్రతిరోజు సుమారు 50వేల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. నాగపూర్, ముంబై, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే వాటిలో కొన్నింటిని ఇక్కడి నుంచి నడుపుతున్నారు.  

ఆదాయంఅదుర్స్‌..
దక్షిణమధ్య రైల్వే గణనీయమైన ఆదాయం ఆర్జిస్తోంది. ఏటా ఆదాయం భారీగా నమోదవుతోంది. ఇటు ప్రయాణికుల రాకపోకలపై, అటు సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయంతో ప్రగతి పథంలో పయనిస్తోంది. పదేళ్లల్లో ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఈ ఏడాది సుమారు రూ.15వేల కోట్ల ఆదాయంతో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. ప్రయాణికుల రాకపోకలపై 2009–2010లో రూ.1,637 కోట్ల ఆదాయం లభించగా.. 2018–19 నాటికి రూ.4,059 కోట్లకు చేరుకుంది. ఇక సరుకు రవాణాపై 2009లో రూ.4,354 కోట్లు లభించగా.. ప్రస్తుతమది రూ.10,955 కోట్లకు పెరిగింది. పదేళ్ల క్రితం కేవలం 86 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేయగా.. ఇప్పుడది 122 మిలియన్‌ టన్నులకు చేరింది. అదే సమయంలో ప్రయాణికుల సంఖ్య 325 మిలియన్‌ల నుంచి 383 మిలియన్‌లకు చేరుకుంది.  

అభివృద్ధి అంతంతే...
వందల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొస్తున్న రైళ్లకు సైతం నగర శివార్లలో బ్రేకులు తప్పడం లేదు. విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర స్టేషన్‌ల నుంచి వచ్చే రైళ్లకు సికింద్రాబాద్‌లో ప్లాట్‌ఫామ్‌లు లేకపోవడంతో ఘట్కేసర్‌ సమీపంలో నిలిచిపోతున్నాయి. నిర్ధారించిన సమయం కంటే  30–45 నిమిషాలు ఆలస్యంగా సికింద్రాబాద్‌ చేరుకుంటున్నాయి. ఇటు ముంబై నుంచి వచ్చే రైళ్లకు సైతం లింగంపల్లికి  చేరుకోకుండానే బ్రేకులు పడుతున్నాయి. సికింద్రాబాద్‌లోని 10 ప్లాట్‌ఫామ్‌లలో ఏదో ఒకటి ఖాళీ అయితే తప్ప.. మరో రైలు వచ్చేందుకు అవకాశం లేదు. దీంతో రైళ్లు రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. నిజామ్స్‌ రైల్వే 1874 అక్టోబర్‌లో ఒకే ఒక్క ప్లాట్‌ఫామ్‌తో దీన్ని ప్రారంభించింది. క్రమంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో దశలవారీగా ప్లాట్‌ఫామ్‌లను విస్తరించారు. 2003 నాటికి 10వ ప్లాట్‌ఫామ్‌ కట్టించారు. కానీ ఆ తరువాత అభివృద్ధి ఆగిపోయింది. స్టేషన్‌లో అదనపు హంగులు తప్ప.. విస్తరణ చేపట్టలేదు. కాచిగూడలో ప్లాట్‌ఫామ్‌లు  4 నుంచి 5కు పెరిగాయి. లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. కానీ నాంపల్లిలో ఆ కనీస సదుపాయాలు కూడా లేవు.   

రైళ్లు తక్కువే... 
దక్షిణమధ్య రైల్వే ఆర్జిస్తున్న ఆదాయం స్థాయిలో సదుపాయాలు మాత్రం పెరగడం లేదు. ఢిల్లీ, ముంబై తదితర ఉత్తరాది నగరాల్లోని రైళ్ల కంటే  హైదరాబాద్‌ కేంద్రంగా రాకపోకలు సాగిస్తున్న రైళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దక్షిణమధ్య రైల్వే జోన్‌కు కేంద్రబిందువైన నగరం నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా రైళ్ల కొరత కారణంగా కనీసం 6 నెలల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి వస్తోంది. నగరం నుంచి విశాఖ, బెంగళూర్, ఢిల్లీ, తిరుపతి, షిర్డీ, పట్నా, శబరి తదితర ప్రాంతాలకు రైళ్ల కొరత తీవ్రంగా ఉంది. పదేళ్లలో కొత్త రైళ్లు అందుబాటులోకి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పండుగలు, వేసవి సెలవులు, తీర్థయాత్రల లాంటి ప్రత్యేక సందర్భాల్లో  ప్రయాణం నరకప్రాయమవుతుంది.  

కాగితాల్లోనే టర్మినల్స్‌.. 
ఈ మూడు స్టేషన్‌లపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ఔటర్‌రింగ్‌ రోడ్డుకు దగ్గర్లోని చర్లపల్లిలో అతిపెద్ద టర్మినల్‌ నిర్మించేందుకు 2015లోనే ప్రణాళికలు సిద్ధం చేశారు. దాంతో పాటే వట్టినాగులపల్లికి ప్రతిపాదనలు చేశారు. మొదట చర్లపల్లి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు రూ.100 కోట్లతో కనీసం వంద ఎకరాల్లో 10 ప్లాట్‌ఫామ్‌లకు కార్యాచరణ సిద్ధంచేశారు. కానీ చర్లపల్లికి భూసేకరణ పెద్ద సవాల్‌గా మారింది. దీనికి అవసరమైన భూమిని అందజేసేందుకు మొదట రాష్ట్రప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇప్పటి వరకు ఎకరం కూడా ఇవ్వలేదు. రైల్వేశాఖ రూ.30 కోట్ల వరకు నిధులు కేటాయించింది. భూమి అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతమున్న రైల్వే భూమిలోనే కనీసం 6 ప్లాట్‌ఫామ్‌లతో విస్తరించాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. కానీ ఆ దిశగా కూడా అడుగు ముందుకు పడలేదు. చర్లపల్లి విస్తరణ పూర్తయితే ప్రతిరోజు 150 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికులు ఔటర్‌ మీదుగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top