జర్నీ ‘స్మార్ట్‌’గా సాగేనా!

Smart Touch And Go Services Delayed In ORR - Sakshi

ఓఆర్‌ఆర్‌పై నిత్యం 1.30 లక్షల వాహనాల రాకపోకలు

స్మార్ట్, టచ్‌ గో అండ్‌ కార్డు సేవల్లో తాత్సారం  

ఆర్‌ఎఫ్‌ఐడీదీ అదే తీరు.. ఇబ్బందుల్లో వాహనదారులు

సాక్షి, సిటీబ్యూరో: నగరానికే తలమానికమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను వినియోగించే వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ మార్గం ద్వారా గతేడాది డిసెంబర్‌ వరకు నిత్యం 75 వేల వాహనాలు రాకపోకలు సాగించగా.. ఈ అక్టోబర్‌లో ఆ సంఖ్య 1.30 లక్షలకు చేరుకుంది. ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టి సాఫీ జర్నీకి మార్గం సుగమం చేసేందుకు ‘స్మార్ట్‌ కార్డు’ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఏళ్ల నుంచి చెబుతున్న అధికార యంత్రాంగం మాటలు ఆచరణలోరూపుదాల్చడం కష్టంగానే కనిపిస్తోంది.  అయితే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) సేవలను సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్న ఓఆర్‌ఆర్‌ అధికారులు ఇప్పుడూ ఏం చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

ప్రిపెయిడ్‌ కార్డు సేవలు ఎప్పుడో..
ఓఆర్‌ఆర్‌పై 19 ఇంటర్‌చేంజ్‌ల్లో టోల్‌ చార్జీలను వసూలు చేసేందుకు 180 టోల్‌ లేన్లను ఏర్పాటు చేశారు. వాహనం ఔటర్‌పైకి వెళ్లేముందు కంప్యూటర్‌లో వివరాలను నమోదు చేసి.. ఓ స్లిప్‌ను వాహనదారుడికి ఇవ్వాలి. ఎగ్జిట్‌ పాయింట్‌ వద్దనున్న కౌంటర్‌లో ఆ స్లిప్‌ను అందివ్వాలి. ఆ తర్వాత సిబ్బంది ప్రయాణించిన దూరాన్ని లెక్కించి ఎంత చెల్లించాలో చెబుతారు. దీంతో  ముఖ్యంగా సెలవు దినాల్లో  టోల్‌ చార్జీల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఈ ఇబ్బందులను గమనించిన హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్‌ సిబ్బంది టోల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(టీఎంఎస్‌)ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ట్రయల్‌ రన్‌ పద్ధతిలో స్మార్ట్‌ కార్డు విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ విధానంలో వాహనదారుడు ఔటర్‌పైకి వాహనం ఎక్కగానే టోల్‌ లేన్‌ వద్ద క్షణం ఆలస్యం చేయకుండా ఓ స్మార్ట్‌ కార్డును సిబ్బంది అందజేస్తారు. ఆ కార్డు దిగే దగ్గర అందజేస్తే స్కాన్‌ చేసి ఎంత చెల్లించాలో సిబ్బంది చెబుతారు. రోజూ వచ్చే వాహనదారులకు కాకుండా అప్పుడప్పుడూ వచ్చేవారి కోసం ఎక్కువగా ఉపయోగపడే ఈ ప్రిపెయిడ్‌ కార్డు సేవలు ఎప్పుడూ అందుబాటులోకి తీసుకొస్తామనేది ఓఆర్‌ఆర్‌ విభాగ అధికారులకే స్పష్టత లేకుండా పోయింది. 

‘టచ్‌ అండ్‌ గో’ పరిస్థితీ అంతే..  
ఓఆర్‌ఆర్‌పై 19 టోల్‌ప్లాజాలు దాటుకొని వెళ్లాలంటే వాహనదారులకు పడుతున్న సమయాన్ని తగ్గించేందుకు ‘టచ్‌ అండ్‌ గో’ కార్డులను పరిచయం చేస్తున్నామని చాలా నెలల క్రితం అధికారులు ప్రకటించారు. కార్లు, లారీలు.. ఇలా ఏ వాహనదారుడికైనా ప్రత్యేక రంగు, ఆ వాహనం గుర్తుతో కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. ‘ఈ కార్డును తీసుకున్న వాహనదారుడు  157 మ్యానువల్, టంచ్‌ అండ్‌ గో లేన్స్‌లో వెళ్లవచ్చు. తమ కార్డును టోల్‌ప్లాజా వద్ద ఉండే స్క్రీన్‌కు చూపించి ముందుకెళ్లాలి. అలా చూపడం వల్ల ఆ కార్డులో ఉండే నగదును ఆ సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. ఈ విధానం ఆచరణ రూపందాల్చకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్‌ఎఫ్‌ఐడీ సేవలకు మోక్షం కలిగేనా..
ఇది కూడా టచ్‌ అండ్‌ గో మాదిరిగానే ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఈటీసీ) కార్డు పనిచేస్తుంది. జాతీయ రహదారుల్లో ఉపయోగించే ఆర్‌ఎఫ్‌ఐడీ ఈటీసీ కార్డులున్న వాహనాలను 23 లేన్లలో మాత్రమే అనుమతిస్తారు. ఈ విధానాన్ని వచ్చే నవంబర్‌లో పట్టాలెక్కించేందుకు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి ఓఆర్‌ఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో  మాదిరిగా ప్రయోగాత్మంగా అమలు చేసి ఆపేస్తారా.. నిరంతరాయంగా కొనసాగిస్తారా అనేది వేచిచూడాలి.

నానక్‌రామ్‌గూడ,శంషాబాద్‌ మార్గాల్లోనే అధికం  
ఓఆర్‌ఆర్‌లో నానక్‌రామ్‌గూడ– శంషాబాద్‌ మార్గంలోనే అత్యధికంగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఫిబ్రవరిలో నానక్‌రామ్‌గూడలో రోజుకు 13,010 వాహనాలు రాకపోకలు సాగిస్తే ప్రస్తుతం 18,353కు చేరుకుంది. శంషాబాద్‌లో 10,090– 15,822, మేడ్చల్‌లో 6,938– 9,133, పెద్దఅంబర్‌పేటలో 6,443– 7042 మేర వాహనాల రాకపోకలు పెరిగాయి. రావిర్యాలలో అత్యల్పంగా 623 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్టుగా హెచ్‌ఎండీఏ సర్వే రిపోర్టులో తేలింది. ఎక్కువగా కారు, జీప్, వ్యాన్‌లే అత్యధికంగా సంచరిస్తున్నాయని తేల్చింది.

చిల్లర సమస్యకు చెక్‌..  
టోల్‌ప్లాజాల్లో వాహనదారుల వద్ద సరైన చిల్లర లేకపోవడంతో సమయం వృథా కావడంతో పాటు ట్రాఫిక్‌జాం అవుతోందని అధికారులు గుర్తించారు. 158 కి.మీ ఓఆర్‌ఆర్‌ వెంట ఆ సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లేలా వినూత్న ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే చిల్లర వల్ల సమయం వృథాతో పాటు ట్రాఫిక్‌ చిక్కులు ఎదురవుతాయంటూ వాహనదారులకు తెలిసేలా ఓఆర్‌ఆర్‌ వెంట బోర్డులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top