మందు గోలీ.. ఈఎస్‌ఐ ఖాళీ | Shortage Of Medication At ESI Warangal District | Sakshi
Sakshi News home page

మందు గోలీ.. ఈఎస్‌ఐ ఖాళీ

Dec 30 2019 2:04 AM | Updated on Dec 30 2019 2:04 AM

Shortage Of Medication At ESI Warangal District - Sakshi


ఈ ఫొటోలోని వ్యక్తి పేరు వేముల వీరభద్రయ్య. ఇతడి కుమారుడు శ్రీనివాస్‌ భూపాలపల్లిలోని జెన్‌కోలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరభద్రయ్యకు 2 నెలల కింద గుండెపోటు రావడంతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో స్టెంట్‌ వేయించుకున్నాడు. ప్రతి నెలా మందులకు వేల రూపాయలు అవుతుండటంతో కొడుకు కార్డుపై ఈఎస్‌ఐ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. డాక్టర్‌ రాసిన మందుల్లో ఒకటి లేదని, తర్వాత రావాలని పంపారు. 45 రోజుల్లో రెండుసార్లు వెళ్లాడు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల నుంచి వరంగల్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రికి రావాలంటే రూ.150లు ఖర్చు అవుతోందని, ఈఎస్‌ఐ కార్డు ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందని బాధితుడు వాపోతున్నాడు.

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో మందుల కొరత వేధిస్తోంది. అనారోగ్యంతో వస్తున్న కార్మికులకు పూర్తిస్థాయిలో మందుల్లేక తప్పని పరిస్థితుల్లో ప్రైవేటులో కొనుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ్యాక్టరీలు, ఇతర ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు (నెలసరి ఆదాయం రూ.21వేల లోపు ఉన్న వారు) ఈఎస్‌ఐ పరిధిలోకి వస్తారు. కార్మికుడికి చెల్లించే జీతం నుంచి 0.75 శాతం కార్మికుడి వాటాగా చెల్లించాలి. పనిచేసే కంపెనీ యాజమాన్యం వారు 3.25 శాతం ఈఎస్‌ఐకి చెల్లిస్తుంది.

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో 1,55,525 ఈఎస్‌ఐ కార్డుదారులు ఉండగా.. 17 డిస్పెన్సరీలు ఉన్నాయి. వీటిలో రోజుకు ఒక్కో డిస్పెన్సరీకి 200 మందికి పైగా కార్మికులు చికిత్సకు వస్తుంటారు. ఏడాది నుంచి పలు కారణాలతో మందుల సరఫరా మందగించగా ఇటీవల వెలుగు చూసిన మందుల కొనుగోలు కుంభకోణంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

ప్రైవేటుకు పరుగులు
అనారోగ్య సమస్యలతో ఇక్కడికొచ్చే కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇస్తుంటారు. స్థానికంగా చికిత్స అందని రోగులను వరంగల్, హైదరాబాద్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తారు. స్థానిక డిస్పెన్సరీలతో పాటు వరంగల్, హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో సైతం పూర్తి స్థాయి వైద్య పరీక్షలు, చికిత్సలు, మందులు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది.

కార్మికులు ఎక్కువగా బీపీకి టెల్మా–హెచ్, షుగర్‌కు గ్లిమీఫ్రైడ్‌ 1 ఎంజీ, 2 ఎంజీ, ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు, నొప్పులకు అసిక్లోఫినాక్, వోవరాన్, జ్వరానికి పారాసిటమాల్, కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి అటర్వాస్‌ మందుల కోసం ప్రతి నెలా వస్తుంటారు. అయితే 6 నెలలుగా ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఈ మందులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు మందుల దుకాణాలకు వెళ్తున్నారు.

నెలరోజుల్లో పూర్తి స్థాయి సరఫరా.. 
డిస్పెన్సరీలకు నెల రోజుల్లో పూర్తి స్థాయి మం దులు సరఫరా అవుతాయి. డైరెక్టరేట్‌ నుంచి మాకు వస్తే మా పరిధిలోని డిస్పెన్సరీలకు సరఫరా చేస్తాం. మా చేతిలో ఏమీ లేదు. మాకు మందులు కొనుగోలు చేసే అధికారం లేదు. – డాక్టర్‌ సురేశ్‌కుమార్, నోడల్‌ అధికారి, వరంగల్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

నెల నుంచి తిరుగుతున్నా..
మా కుమారుడు హన్మకొండలోని ఓ ఫైనాన్స్‌ ఆఫీస్‌లో పని చేస్తాడు. మాకు ఈఎస్‌ఐ కార్డు వచ్చింది. నాకు బీపీ ఉంది. టెల్మా–హెచ్‌ మందుల కోసం నెల రోజులుగా డిస్పెన్సరీకి తిరుగుతున్నా లేవని చెబుతున్నారు. బయట కొందామంటే ఎక్కువ ధర ఉంది. అన్ని రకాల మందులను అందుబాటులో ఉండేలా చూడాలి. – అడప అనురాధ, వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement