ఆర్టీసీ నష్టాలు రూ.928 కోట్లు

RTC losses are Rs 928 crore - Sakshi

2018–19 లెక్కలు తేల్చి ప్రభుత్వానికి నివేదించిన సంస్థ

బ్యాంకు అప్పులు, ఐఆర్‌ చెల్లింపు, డీజిల్‌ ఖర్చు తడిసిమోపెడు

వెంటనే చక్కదిద్దకుంటే మనుగడ కష్టమంటున్న కార్మిక సంఘాలు

3 వేల డొక్కు బస్సులతో ముందుకు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ రికార్డు సృష్టించింది. కాకపోతే నష్టాల్లో! రూ.వేయికోట్ల నష్టాల మార్కుకు చేరువైంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాని ఏకంగా రూ.928.67 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్టు ప్రభుత్వానికి టీఎస్‌ ఆర్టీసీ నివేదించింది. ఆర్టీసీ ఆవిర్భవించిన 8 దశాబ్దాల చరిత్రలో ఇదే అతి భారీనష్టం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాదిలో స్వల్ప లాభాలు నమోదు చేసిన ప్రగతిరథం నష్టాల బాట వీడనుందనే ఆశ కల్పించింది. కానీ, ఆ తర్వాత క్రమంగా ఏ యేటికాయేడు నష్టాల ఊబిలోకే పరుగులు పెట్టింది. దీంతో సిబ్బందికి జీతాలు చెల్లించటమే గగనంగా మారింది. ఆరేళ్లుగా సిబ్బంది నియామకాలు లేకపోవటంతో డ్రైవర్ల కొర త ఏర్పడింది. కొంతకాలంగా అద్దె బస్సులనే తీసుకుంటోంది. 600 బ్యాటరీ బస్సులు కేటాయించాలంటూ కేంద్రాన్ని కోరాలని నిర్ణయించిన ఆర్టీసీ.. వాటిని కూడా అద్దె బస్సులుగానే ఏర్పాటు చేసుకోవాలనుకుంది. దీంతో అద్దె బస్సుల సంఖ్య పెరిగి ప్రైవేటీకరణకు మార్గం సుగమమవుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

రూ.312 కోట్ల ఆదాయం పెరిగినా... 
ఈసారి ఆర్టీసీలో ఏకంగా రూ.312 కోట్ల మేర ఆదాయం పెరిగినా నష్టాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. నియంత్రించలేని ఖర్చులు పెరగటంతో నష్టాలు కూడా నమోదయ్యాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ రూ.4,570 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.4,882 కోట్లుగా తేలింది. అంటే అంతకుముందు సంవత్స రం కంటే రూ.312 కోట్ల ఆదాయం పెరిగింది. బస్సుచార్జీలు పెంచకున్నా ఆదాయం పెరగడం విశేషం.
 
కొంప ముంచిన వడ్డీ, డీజిల్, ఐఆర్‌ 
ఆర్టీసీకి రూ.3,500 కోట్లకుపైగా బ్యాంకు అప్పులున్నాయి. వడ్డీ భారం రూ.181 కోట్లు. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే రూ.16 కోట్లు ఎక్కువ. తాజా నష్టాల్లో డీజిల్‌ వాటా పెద్దదే. చమురు రూపంలో రూ.1,384 కోట్లు ఖర్చయింది. ఇది అంతకుముందు సంవత్సరం కంటే రూ.192.33 కోట్లు ఎక్కువ. గతేడాది ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి మధ్యంతర భృతి(ఐఆర్‌)ని 16 శాతంగా ప్రకటించిం ది. ఇది వెంటనే అమలులోకి రావటంతో వేతన భారం కూడా పెరిగింది. ఆర్థిక సంవత్సరంలో వేత నాల రూపంలో రూ.2,381 కోట్లు చెల్లించారు. ఇది అంతకుముందు ఏడాదికంటే రూ.127.77 కోట్లు ఎక్కువ. మోటారు వెహికిల్‌ టాక్స్‌ రూ.174 కోట్లు. ఇలా అన్నీ కలిపి అంతకుముందు సంవత్సరం నష్టాల కంటే రూ.179.76 కోట్లను పెంచుకుని రూ.వేయి కోట్లకు చేరువైంది.  

ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా... 
ప్రస్తుత ఆర్థిక సంవవత్సరం తొలి త్రైమాసిక నష్టాలను చూస్తే ఏప్రిల్‌లోనే రూ.38.23 కోట్లు, మేలో రూ.37.96 కోట్లు నష్టాలు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ (రూ.34 కోట్లు), మే(రూ.26 కోట్ల) కంటే చాలా ఎక్కువ.
- తెలంగాణలో వేయి గ్రామాలకు బస్సు వసతి లేదు. వీటికి బస్సులు నడపాలంటే కనీసం 1,500 కొత్త బస్సులు కొనాలి. మూడు వేల మంది అదనపు డ్రైవర్లు, కండక్టర్లు కావాలి.  
- 3 వేల బస్సులు డొక్కుగా మారి నడవటానికి యోగ్యంగా లేవు. వాటిని రీప్లేస్‌ చేయాలంటే కొత్త బస్సులు కొనాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top