రెడ్‌జోన్‌లోకి జిల్లాకేంద్రం

Red Zone Alert in Nirmal Lockdown - Sakshi

ఢిల్లీ వెళ్లివచ్చిన వారిలో మరొకరు మృతి

అప్రమత్తంగా ఉన్నామంటున్న యంత్రాంగం

సంపూర్ణ లాక్‌డౌన్‌ తొలిరోజు విజయవంతం

నిర్మల్‌: ప్రశాంతంగా ఉన్న జిల్లాకేంద్రం ఒక్కసారిగా ప్రభావిత ప్రాంతంగా మారింది. కరోనా లక్షణాలతో బుధవారం ఒకరు మృతి చెందడంతో రెడ్‌ జోన్‌లోకి వెళ్లింది. ఈ మేరకు నిర్మల్‌తో పాటు భైంసాలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ప్రకటించిన నాలుగు రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌ శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. వారం రోజులతో పోలిస్తే తొలిరోజు లాక్‌డౌన్‌ సంపూర్ణంగా అమలైంది. అత్యవసర సేవలు మినహా ప్రజ లను రోడ్లపైకి అనుమతించడం లేదు. మరోవైపు నిర్మల్‌ నుంచి ఢిల్లీ వెళ్లి వచ్చిన ఇంకొకరు శుక్రవారం మృతి చెందారు. దీంతో స్థానికులు మరింతగా కలవరం చెందుతున్నారు. సదరు వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయా.. లేదా.. అనే విషయం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరొకరు మృతి...
జిల్లాకేంద్రం నుంచి ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో మరొ కరు మృతి చెందారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సదరు వ్యక్తిని క్వారంటైన్‌లో ఉంచా రు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో జిల్లా ఆస్పత్రి లోని ఐసోలేటెడ్‌ వార్డులోకి తరలించారు. శుక్రవా రం  పరిస్థితి సీరియస్‌గా మారడంతో హైదరాబాద్‌ తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నాయా..లేదా.. అనే విషయం ఇంకా తేలలేదు. సంబంధిత వ్యక్తికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రాలేదని అధికారులు చెబుతున్నారు.

భయం భయంగా...
ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో ఒకరు కరోనా పాజిటివ్‌ లక్షణాలతో చనిపోవడం, మరొకరు కూడా మృతి చెందడంతో జిల్లాకేంద్రంలో కలవరం పెరిగింది. కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ నాలుగు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ సమీప కాలనీల ప్రజలు భయం భయంగానే గడుపుతున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం కరోనా ప్రభావిత జోన్‌లోని కాలనీలను దిగ్బంధం చేశారు. స్థానికులు సైతం తమ ఇళ్లల్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. చాలా వీధుల ప్రజలు తమకు తాము తమ రహదారులను మూసివేశారు. ఇతరులను, అపరిచిత వ్యక్తులను రానివ్వడం లేదు. స్థానిక ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా మూసివేశారు. పట్టణంలోని వివిధ కాలనీలు ప్రధాన మార్గాలలో కూరగాయల విక్రయాలకు ఏర్పాట్లు చేశారు. కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించేలా మునిసిపల్‌ సిబ్బంది ప్రత్యేక బాక్సులను వేసి ఉంచారు.

ప్రారంభమైన వైద్య పరీక్షలు..
జిల్లాలోనూ వైరస్‌ పాజిటివ్‌ లక్షణాలు రావడంతో పాటు ప్రాథమిక, సెకండరీ వ్యక్తులకు వ్యాపించే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని పరీక్షించేందుకు శుక్రవారం వైద్య సిబ్బందిని పంపించారు. ముందుగా స్థానిక జోహ్రనగర్‌ కాలనీలో వైద్య సిబ్బంది పరీక్షలను చేపట్టారు. జిల్లా కేంద్రంలో మొత్తం 70వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇంటికి వచ్చే వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. జిల్లా కరోనా ప్రభావిత ప్రాంతంగా మారడంతో శుక్రవారం జిల్లాకేంద్రంతో పాటు భైంసాలో కలెక్టర్‌ ప్రత్యేకంగా పర్యటించారు. మరింత అప్రమత్తమై, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

భైంసాపై ప్రత్యేక నజర్‌..
భైంసాటౌన్‌(ముథోల్‌): జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ నేపథ్యంలో అధికారులు భైంసాపై ప్రత్యేక దృష్టి సా రించారు. పట్టణం నుంచి ఢిల్లీలో కార్యక్రమానికి హాజరైన 15 మందిని ఇప్పటికే గుర్తించి వారందరి నీ నిర్మల్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. అయితే వారికి పాజిటివ్‌ లక్షణాలు ఉన్నాయా.. లేదా.. అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారు భైంసా మండలం నుంచి 47 మందిని గుర్తించిన అధికారులు, వీరిలో ఇద్దరిని నిర్మల్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. మిగిలిన వారిని హోం క్వారంటైన్‌ పాటించాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో కరోనా మరణం నమోదైన నేపథ్యంలో నిర్మల్, భైంసా పట్టణాలను ప్రభుత్వం కరోనా హాట్‌స్పాట్‌ కేంద్రాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ శుక్రవారం ఉద యం భైంసాలో పర్యటించారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూరగాయల కోసం వచ్చిన సందర్భాల్లో రద్దీ ఏర్పడకుండా ఉండేందుకుగాను మినీ మార్కె ట్లు గుర్తించాలన్నారు. అనంతరం అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి మినీ మార్కెట్ల కో సం స్థలాలు గుర్తించారు. నిత్యావసరాల కోసం సమయాన్ని ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కుదించారు. ఆ తరువాత రోడ్లపై వాహనాలు తిరి గితే వాటిని స్వాధీనం చేసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ అమలుకు ప్రజలంతా సహకరించాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top