ఆర్థికాభివృద్ధికి కేరాఫ్‌ రంగారెడ్డి, హైదరాబాద్‌

Rangareddy district top with GDDP Of 1,73,143 crores - Sakshi

జీడీడీపీ, తలసరి ఆదాయంలో రెండు జిల్లాల దూకుడు

రూ.1,73,143 కోట్ల జీడీడీపీతో రంగారెడ్డి జిల్లా టాప్‌..

రూ.1,67,231 కోట్ల జీడీడీపీతో రెండో స్థానంలో ‘భాగ్యనగరం’

సాక్షి, హైదరాబాద్‌: వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కేంద్రమైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు.. వస్తు, సేవల ఉత్పత్తిలోనూ అగ్రగామిగా నిలుస్తున్నాయి. దేశ, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి రేటును దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ), రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్పీడీపీ)గా మదిస్తారు. ఈ తరహాలోనే జిల్లాల ఆర్థికాభివృద్ధి రేటును జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)గా మదిస్తారు. ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో, సాధారణంగా ఒక ఏడాదిలో ఒక జిల్లాలోని భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయిన అన్ని తుది వస్తువులు, సేవల మొత్తం ఆర్థిక విలువను జీడీడీపీగా పేర్కొంటారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా రూ.1,73,143 కోట్ల జీడీడీపీతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రూ.1,67,231 కోట్ల జీడీడీపీతో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. కేవలం ఈ రెండు జిల్లాలే రూ.లక్ష కోట్లపైగా జీడీడీపీని కలిగి ఉన్నాయి.

రాష్ట్ర ఆర్థికాభి వృద్ధి రేటును పరుగులు పెట్టించడంలో ఈ రెండు జిల్లాలదే ప్రధాన పాత్ర అని తాజా గా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక, సామాజిక సర్వే నివేదికలోని జీడీడీపీ గణాంకాల పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌ దేశానికే ఫార్మా రంగ రాజధానిగా పేరుగాంచింది. నగరంలో పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు, తయారీ తదితర రంగాల పరిశ్రమలున్నాయి. వీటిల్లో అధిక శాతం హైద రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేంద్రీకృతమై ఉండడంతో ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు ఏటా రూ.లక్షల కోట్లు విలువ చేసే వస్తు, సేవల ఉత్పత్తులు ఎగుమతి, రవాణా అవుతున్నాయి. హైదరా బాద్, రంగారెడ్డి జిల్లాల జీడీడీపీ మాత్రమే రూ.లక్షన్నర కోట్ల గీటురాయిను దాటి రూ.2 లక్షల కోట్ల దిశగా దూసుకుపోవడానికి ఈ పరిశ్రమలే ప్రధాన తోడ్పాటు అందిస్తున్నాయి.  

పెరుగుతున్న అసమానతలు.. 
జీడీడీపీతో పాటు తలసరి ఆదాయంలో సైతం ఈ 2 జిల్లాలు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు అందనంత దూరంలో ఉన్నాయి. రూ.5,78,978 తలసరి ఆదాయంతో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలవగా, రూ.3,57,287తో హైదరాబాద్, రూ.2,21,025తో మేడ్చల్‌–మల్కాజ్‌గిరి ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఏ ఒక్క జిల్లా రూ.2 లక్షల తలసరి ఆదాయాన్ని కలిగి ఉండగకపోవ డం గమనార్హం. పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రంలోని జిల్లాల మధ్య నెలకొన్న అసమానతలను ఈ గణాంకాలు అద్దంపడుతున్నాయి. జీడీడీపీ, తలసరి ఆదాయంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, స్థానికంగా పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అమలు చేయాల్సిన ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలు, రాయితీ, ప్రోత్సాహాకాల విధానాల రూపకల్పన కోసం ఈ గణాంకాలు కీలకం కానున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top