ఉద్యమాలతోనే యురేనియం తవ్వకాల్ని ఆపాలి: హరగోపాల్‌ 

Professor Haragopal Comments On BJP And TRS - Sakshi

తెలుగు రాష్ట్రాలు కూడా పోరాడాలి  

హైదరాబాద్‌: ప్రజా ఉద్యమాలతోనే యురేనియం తవ్వకాలను ఆపాలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పిలుపునిచ్చారు. భూమి కింద ఉన్న అభివృద్ధిని చూస్తున్నారు కాని భూమిపైన ఉన్న మనుషుల్ని చూడటంలేదని, మనుషుల కోసమే అభివృద్ధి అని ఇప్పుడు వారినే విధ్వంసం చేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతోందని, సహజ వనరులు ఉండటమే ప్రజలు చేసిన పాపమా అని ప్రశ్నించారు. ఈ విధ్వంసం నుంచి దూరం కావాలనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, రాష్ట్రం ఏర్పడ్డాక మార్పు ఉంటుందని భావించామని, కాని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ గత పాలకులు చేసినట్టుగానే వ్యవహరిస్తోం దని విమర్శించారు.

జాతీయత, దేశభక్తి పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు వనరులను కాపాడుతుందనుకుంటే పరుగెత్తి మార్కెట్‌ను పూర్తిగా ఓపెన్‌ చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యురేనియంను బయటకు తీశామంటే అది విషంగా మారుతుందని, గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురైనా ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నించారు. నదులు, నీరు, గాలి విషతుల్యమై ఆదివాసీలతో పాటు హైదరాబాద్‌ ప్రజలు కూడా విషపు నీరు తాగాల్సి వస్తుందని, అలాంటి అభివృద్ధి అవసరమా అని టీఆర్‌ఎస్, బీజేపీలను ప్రశ్నించారు. ఇది కేవలం నల్లమల సమస్య కాదని, అమరావతి, హైదరాబాద్‌కు కూడా ప్రమాదకరమన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు కె. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top