పౌల్ట్రీ రైతు విలవిల  | Poultry Farmers Loss With Temperature | Sakshi
Sakshi News home page

పౌల్ట్రీ రైతు విలవిల 

May 27 2019 12:10 PM | Updated on May 27 2019 12:10 PM

Poultry Farmers Loss With Temperature - Sakshi

చనిపోయిన కోళ్లను చూపిస్తున్న రైతు లిక్కి సుధాకర్‌రెడ్డి

యాచారం: ఇటీవల భానుడి ప్రకోపానికి పౌల్ట్రీఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో నిత్యం ఒక్కో ఫారంలో వందలాదిగా చనిపోతున్నాయి. నిత్యం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కోళ్లు పెంచుతున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కోళ్ల మృత్యువాతను భరించలేక చిన్న, సన్నకారు రైతులు తల్లడిల్లిపోతున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల చికెన్‌ ధరలు కిలో రూ. 200 దాటింది. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లకు చల్లదనం కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదు. దీంతో కోళ్లు చనిపోవడం పరిపాటిగా మారింది.

ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, మాడ్గుల తదితర మండలాల్లో వెయ్యి మంది రైతులు ఆయా మండలాల్లోని పీఏసీఏస్‌లు, వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని పౌల్ట్రీఫారాలు నిర్వహిస్తున్నారు. కొందరు రైతులు ఇంటిగ్రేషన్‌ పద్ధతిలో సుగుణ, స్నేహ, సీపీ తదితర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని కోళ్లను పెంచుతున్నారు. ఆయా కంపెనీలు రైతులకు కోడిపిల్లలను సరఫరా చేయడంతో అవి రెండు నుంచి రెండున్నర కిలోల బరువు వచ్చే వరకు పౌల్ట్రీ ఫారాల్లో పెంచుతున్నారు. కోడి పిల్లలకు కావాల్సిన దాణా, వైద్యం తదితరాలను కంపెనీ ప్రతినిధులే భరిస్తారు. కోళ్లు 40 నుంచి 45 రోజుల వయసు రాగానే రైతులు ఆయా కంపెనీలకే కోళ్లను విక్రయిస్తుంటారు.

కిలోకు రూ. 22 నుంచి రూ.23 వరకు కంపెనీలు రైతులకు చెల్లిస్తున్నాయి. ఇలా డివిజన్‌ పరిధిలోని ఆయా గ్రామాల్లో వెయ్యి మందికి పైగా రైతులు కోళ్ల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాగా, ఇటీవల భానుడి ప్రతాపంతో పౌల్ట్రీ రైతు పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం ఒక్కో ఫారంలో వందలాదిగా కోళ్లు చనిపోవడం(మొటాల్టీ)తో ఇంటిగ్రేటెడ్‌ రైతులతో పాటు స్వతహాగా ఫారాలు నిర్వహిస్తున్న రైతులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో ఒక్కో ఫారంలో సగటున 20 నుంచి 30 శాతం వరకు కోళ్లు చనిపోతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.
  
నిత్యం లక్ష వరకు మృతి.. 
ఇటీవల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో డివిజన్‌లోని ఆయా గ్రామాల్లో నిత్యం 50 వేల నుంచి లక్ష వరకు కోళ్లు చనిపోతున్నాయి. ఎండల తీవ్రత నుంచి కోళ్లకు ఉపశమనం కలిగించడం కోసం రైతులు ఫ్యాన్లను  ఏర్పాటు చేయడం, గోనె సంచులు కట్టి నీళ్లను చల్లడం, పైకప్పులపై గడ్డి వేసి నీళ్లు పోయడం.. తదితర రక్షణ చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎండల తీవ్రత పెరగడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.

యాచారం, మంచాల, మాడ్గుల, ఇబ్రహీంపట్నం మండలాల్లో బోరుబావుల్లో భూగర్భజలాలు లేకపోవడంతో కోళ్లను కాపాడుకోవడం, వాటి దాహార్తి తీర్చడం కోసం రైతులు ఒక్కో ట్యాంటర్‌కు రూ. 800 నుంచి రూ. 1,500 వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా కోళ్ల పెరిగే 40 రోజుల్లోనే కేవలం నీటికే రూ. 40 వేల ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
వ్యవసాయ పనుల్లేక పోవడంతో రైతులు చాలా మంది ఇంటిగ్రేటెడ్‌ పద్ధతిలో కోళ్లు పెంచుతున్నారు. ఎండలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఇక స్వయంగా కోళ్ల పెంపకం చేపడుతున్న రైతుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం వేలసంఖ్యలో కోళ్లు చనిపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. చనిపోతున్న కోళ్లను పొలాల్లో గుంతలు తీసి పూడ్చివేస్తున్నారు.

నష్టం రోజుకు రూ. కోటికి పైగానే  
ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని ఆయా మండలాల్లో పౌల్ట్రీఫారాలు నిర్వహిస్తున్న దాదాపు వెయ్యి మందికి పైగా రైతులు ఆయా పీఏసీఎస్‌లు, వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.100 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. కోళ్ల పెంపకంతో వచ్చే ఆదాయంతో ప్రతి సంవత్సరం మార్చి 31 లోపు వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని విధాలుగా అనుకూలిస్తే 10 వేల కోళ్ల పెంపకం చేస్తున్న రైతులకు 40 రోజులకు రూ. 60 వేల నుంచి రూ.80 వేలు, 20 వేల కోళ్ల పెంపకం చేసే రైతులకు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. తద్వారా బ్యాంకులకు వాయిదాలు చెల్లిస్తుంటారు.

అయితే, ఎండల తీవ్రతతో ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని పలు గ్రామాల్లో వేలాది కోళ్లు మృతి చెందడంతో రైతులకు నిత్యం రూ. కోటికి పైగానే నష్టం వస్తోంది. ఇక జిల్లావ్యాప్తంగా అది రూ. 10 కోట్లకు పైమాటే. ఎండల తీవ్రతకు కోళ్లు చనిపోతే ఇంటిగ్రేషన్‌ సంస్థలు కోడి పిల్లల ఖర్చు భరిస్తాయే తప్పా, కోళ్ల పెంపకం ఉపయోగించే దాణా, వైద్యం ఖర్చులను రైతే భరించాల్సి ఉంటుంది. కోళ్లు చేతికి వచ్చే సమయంలో  చనిపోతుండడంతో రైతులు అప్పుల్లో మునిగిపోతున్నారు. ఆయా మండలాల్లో రెండు, మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ విషయంలో తమకు ఆపన్నహస్తం అందివ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు.

చనిపోయిన కోళ్లను చూపిస్తున్న 
రైతు లిక్కి సుధాకర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement