
హైకోర్టు
అఫిడవిట్‌లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 31న వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించిన పిటిషన్‌ను హైకోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ ఫైల్ చేయడంతో పాటు బూత్ లెవెల్ ఓటర్ జాబితాను ఈసీ హైకోర్టుకు సమర్పించింది. అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా ఓటర్ల జాబితా ఉండాలని ఈసీకి హైకోర్టు సూచన చేసింది. అఫిడవిట్‌లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 31న వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 31కి హైకోర్టు వాయిదా వేసింది.
పిటిషనర్ మర్రి శశిధర్ రెడ్డి(మాజీ ఎమ్మెల్యే) మాట్లాడుతూ..న్యాయస్థానంపై మాకు పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా జరగాలి కానీ ఎన్నికల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ హైకోర్టు పర్యవేక్షణ చేస్తామనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు బూత్‌స్థాయిలో అభ్యంతరాలపై తమకు తెలియజేయాలన్నారు.
పిటిషనర్ తరపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మాట్లాడుతూ..హైకోర్టులో ఈ రోజు మరోసారి ఓటర్ల జాబితా పిటిషన్‌పై విచారణ కొనసాగిందని వెల్లడించారు. ఓటర్ల జాబితా అభ్యంతరాలను నివృత్తి చేయడానికి ఎన్నికలం సంఘం అఫిడవిట్ దాఖలు చేసిందని తెలిపారు. బూత్ స్థాయి జాబితాను కూడా ఎన్నికల సంఘం హైకోర్టుకు సమర్పించిందని, నామినేషన్ చివరి రోజు వరకు జరిగే ఓటర్ల నమోదు పక్రియను కూడా తామే పర్యవేక్షణ చేస్తామని హైకోర్టు తెలిపినట్లు వివరించారు. ఈ నెల 31న మరోసారి మా వాదనలను వినిపిస్తామం చెప్పారు.