పట్నం పల్లెయాత్ర

People Living In The Hyderabad City Went To Villages - Sakshi

సొంతూళ్లకు తరలిన నగరవాసులు

కిక్కిరిసిన బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు

30 లక్షల మంది నగరం దాటారని అంచనా

 ఆదివారం ఒక్కరోజే 10 లక్షల మంది ప్రయాణం

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండగకోసం పట్నం పల్లెబాట పట్టింది. సంక్రాంతి ప్రయాణాల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 లక్షల మంది పండుగకు సొంతూళ్లకు బయల్దేరారని అంచనా. దీంతో ఇప్పటి వరకూ నగరం దాటిన వారి సంఖ్య 30 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఉదయం నుంచి ఆర్టీసీ, రైల్వే, ప్రైవేటు వాహనాలు కిక్కిరిసిపోయాయి. టీఎస్‌ఆర్టీసీ ఏకంగా 5,252 బస్సులను, ఇందులో 1,560 ఆంధ్రకు, మిగిలినవి తెలంగాణకు నడుపుతోంది. వీటికితోడు ఏపీఎస్‌ఆర్టీసీ కూడా దాదాపు 2,000 బస్సులను హైదరాబాద్‌ నుంచి నడుపుతోంది.

ఎంజీబీఎస్‌ నుంచి ఆదివారం ఒక్కరోజే 5,300 బస్సులు (టీఎస్, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఆర్టీసీలు కలిపి) బయల్దేరినట్లు అధికారులు తెలిపారు. ఈ లెక్కన ఒక్క ఎంజీబీఎస్‌ నుంచే 2.30 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లారు. ఇక జేఎబీఎస్‌ నుంచి 1.50లక్షలు బస్సులు, ఉప్పల్, మిగిలిన ప్రాంతాల నుంచి మరో లక్ష మంది బయల్దేరినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తానికి ఆదివారం ఒక్కరోజే ఆర్టీసీ ద్వారా దాదాపు 5 లక్షల వరకు ప్రయాణించారని తెలిసింది. ఓ వైపు నగరం ఖాళీ అవుతుంటే.. పల్లెల్లో మాత్రం కొత్త కళ ఉట్టిపడుతోంది.  ఆత్మీయ పలకరింపులతో పల్లె కళకళ్లాడుతోంది. సంక్రాంతి ముగ్గులు, రంగవల్లులు, గొబ్బె మ్మలతో మరింత రంగులమయంగా మారాయి. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పడుచుల కేరింతలు వెరసి.. పల్లెలు వెలిగిపోతున్నాయి. 

విదేశీయుల సందడి
కాజీపేట రూరల్‌: వివిధ దేశాల నుంచి వచ్చిన యువతీ యువకులు సంక్రాంతి సంబురాల్లో మునిగితేలారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట ఫాతిమానగర్‌లోని బాలవికాసలో శిక్షణ పొందడానికి ఇటీవల కెనడా, శ్రీలంక, సుడాన్, బంగ్లాదేశ్‌ నుంచి 41 మంది వచ్చారు. కాగా, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం  నిర్వహించిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. 

జనసాధారణ్‌ రైళ్లకు దక్కని ఆదరణ 
సంక్రాంతి పండగ రద్దీని తగ్గించేందుకు దక్షిణమధ్య రైల్వే దాదాపుగా 140కిపైగా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వీటిలో 60 జనసాధారణ్‌ రైళ్లున్నాయి. ఇవి రోజుకు నాలుగు చొప్పున నడుపుతున్నారు. వీటిపై ప్రయాణికులకు అవగాహన కల్పించడంలో రైల్వే అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ప్రత్యేక రైలు అనగానే.. అధిక చార్జీలుంటాయేమోనని ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ జనసాధారణ్‌ రైళ్లలో.. 15 బోగీలకు జనరల్‌ టికెట్ల ధరలే వసూలు చేసినా.. ప్రజలు ఆదరించడం లేదు. తెలంగాణ ప్రాంతానికి ఇంతవరకూ ఒక్క ప్రత్యేక రైలు కూడా ప్రకటించకపోవడం గమనార్హం. 

రైళ్లు కిటకిట 

రైల్వే స్టేషన్లలోనూ ఆదివారం విపరీతమైన రద్దీ కొనసాగింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి సాధారణ రోజుల్లో 60 వేల మంది ప్రయాణిస్తారు. మూడ్రోజులుగా స్టేషన్‌కు రోజుకు లక్షమందికిపైగా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఆదివారం రోజే నగరంలోని వివిధ రైల్వేస్టేషన్ల నుంచి 2.40 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లారని రైల్వే అధికారులు తెలిపారు. ఇక ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు, క్యాబ్‌ల ద్వారా దాదాపుగా 3 లక్షల మంది, సొంతవాహనాల ద్వారా లక్ష మందికిపైగా వెళ్లారని సమాచారం. 

తూతూ మంత్రంగా ఆర్టీఏ తనిఖీలు 

ఓ వైపు వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాలు తెలంగాణలో తిరుగుతున్నాయి. వీటిలో వందలాది వాహనాలు పుదుచ్చేరి, అరుణాచల్‌ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చి హైద రాబాద్‌ నుంచి ఏపీకి ప్రయాణికులను తరలిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు కరవయ్యాయి. ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల చార్ట్‌ నిర్వహణ, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, ఫిట్‌నెస్‌లేని వందలాది బస్సులు, కార్లు రోడ్డు మీదికి రావ డం వంటివేవీ.. రవాణాశాఖకు పట్టడం లేదు. 11వ తేదీన సెంట్రల్‌జోన్‌లో 4, 12న సెంట్రల్‌ జోన్‌లో 22 కేసులు, వీటిలో రెండు వాహనాలు సీజ్, 13న 23 కేసులు మాత్రమే నమోదయ్యాయి. సరైన అనుమతుల్లేని వందల వాహ నాలు ప్రయాణికులను చేరవేస్తోంటే.. తూతూ మంత్రంగా తనిఖీలు చేసి ఒకట్రెండు వాహ నాలను సీజ్‌ చేసి చేతులు దులుపుకుంటున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top