ప్రజల భాగ స్వామ్యంతో గ్రామాల్లో సమస్యలను గుర్తించి, పరిష్కరించడంతో పాటు గ్రామాభివృద్ధికి బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రజల భాగ స్వామ్యంతో గ్రామాల్లో సమస్యలను గుర్తించి, పరిష్కరించడంతో పాటు గ్రామాభివృద్ధికి బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కార్యక్రమాలు ఐదురోజుల పాటు నిర్వహించే విధంగా ‘మనఊరు.. మన ప్రణాళిక’ పేర ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒక్కోగ్రామానికి మండలస్థాయి అధికారిని, మండలానికి జిల్లాస్థాయి అధికారిని నియమించింది.
జిల్లాకు రాష్ట్రస్థాయి ప్రత్యేకఅధికారిని నియమించింది. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు గ్రామాల్లోని సమస్యలను గుర్తించి, 18న గ్రామసభ నిర్వహించి ప్రజల సమక్షంలోనే సమస్యలను పరిష్కరించనున్నారు. గ్రామసభ సమయంలో ఆ ఊరి జనాభాలో కచ్చితంగా పదోవంతు మంది ఉంటేనే పనులకు ఆమోదం తెలుపుతారు. గ్రామస్థాయిలో రూపొందించిన ప్రణాళికను క్రోడీకరించి మండలస్థాయికి.. అక్కడి నుంచి జిల్లాస్థాయికి పంపిస్తారు. ఈ క్రమంలో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు మం డలస్థాయి ప్రణాళికను రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాస్థాయిలో 24 నుంచి29వ తేదీవరకు డీసీసీ(జిల్లా ప్రణాళిక కమిటీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఆమో దం పొందిన తర్వాతే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు.
ప్రతీ పనిలో ప్రజల భాగస్వామ్యం
గ్రామాల్లో ఇక నుంచి ప్రభుత్వం చేపట్టే ప్రతీ అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయనున్నారు. ‘మనఊరు- మన ప్రణాళిక’లో భాగంగా గుర్తించిన సమస్యలు, పనులను ప్రాధాన్యత క్రమంలో ఆమోదిస్తారు.
ఉదాహరణకు గ్రామంలో నీటిఎద్దడి ఉంటే ఆ సమస్య పరిష్కారం కోసం దాదాపు రూ. రెండు లక్షల కావాల్సి ఉందనుకుంటే, అందుకు అక్కడి ప్రజలు చందాల రూపంలో రూ.25వేల సహాయం చేశారనుకుంటే మిగతా రూ.1.75లక్షలను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇలా అన్ని సమస్యలకు ప్రజలను భాగస్వామ్యం చేయనున్నారు. పనులను పర్యవేక్షించేందుకు ఓ కమిటీని నియమిస్తారు.
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నియామకం
‘మనఊరు- మన ప్రణాళిక’ ద్వారా జిల్లాలో అమలయ్యే కార్యక్రమాలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం.జగదీశ్వర్‌ను నియమించింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్‌సప్లై అండ్ సేవింగ్‌బోర్డు, ట్రాన్స్‌పోర్టు తదితర శాఖల కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఆయనను నియమించింది.