స్పీడ్‌ థ్రిల్స్‌ బట్‌...!

Over-speeding takes away Nandamuri Harikrishna's life - Sakshi

ప్రముఖులకూ ప్యాషన్‌గా డ్రైవింగ్‌ 

మితిమీరిన వేగంతో దూసుకుపోతూ 

ప్రమాదాల బారినపడి వారు ఎందరో 

హరికృష్ణ ప్రమాదమూ ఆ కోవలోనిదే 

సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్‌... మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కుమారుడు అయాజుద్దీన్‌... ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్‌.. తాజాగా నందమూరి హరికృష్ణ... రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వీరిలో ఎవరికీ వాహనం నడపాల్సిన అవసరం లేదు. అయినా ప్యాషన్‌ కోసం స్టీరింగ్‌ పట్టి, మితిమీరిన వేగంతో దూసుకుపోతూ హఠాన్మరణం పాలయ్యారు. కేవలం ఇవే కాదు రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం శాతం అతి వేగం కారణంగానే జరుగుతున్నాయి. అంతర్గత రహదారులు గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో, జాతీయ రహదారులు గరిష్టంగా గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణించడానికి మాత్రమే అనువని రవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది దాటితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. నగరంలోని రోడ్ల సామర్థ్యం, వాటి పైకి వస్తున్న వాహనాల గరిష్ట వేగానికి మధ్య పొంతన లేకపోవడం గమనార్హం.  

పరిమిత వేగం పాదచారులకూ రక్షణే... 
ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా బాధితులుగా మారుతున్నది పాదచారులే. ఫుట్‌పాత్‌లు, క్రాసింగ్స్‌ సహా ఎలాంటి సౌకర్యాలు అవసరమైన స్థాయిలో ఉండవు. ఫలితంగా రోడ్డు దాటుతున్న, రహదారులపై నడుస్తున్న బాటసారులు ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం వాహన వేగం 5 శాతం తగ్గినప్పుడు ప్రమాదాలబారిపడే ఆస్కారం 30 శాతం తగ్గుతుందని స్పష్టం చేసింది. గంటకు 50 కిమీ వేగంతో ప్రయాణించే వాహనం ఓ పాదచారుడిని ఢీ కొట్టినా... అతడికి మరణం సంభవించే ప్రమాదం 30 శాతం తక్కువగా ఉంటుంది. వాహన వేగం గంటకు 80 కిమీ మించితే ఎదుటి వ్యక్తికి మరణం సంభవించే అవకాశం 60 శాతం పెరిగినట్లేనని డబ్ల్యూహెచ్‌ఓ అభిప్రాయపడింది. 

రెస్పాన్స్‌ కావడానికి కొంత సమయం... 
ప్రతి వాహనచోదకుడు వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో యాదృచ్ఛికంగానే ముందు వస్తున్న ప్రమాదాలను గమనిస్తూనే ఉంటాడు. ఎదుటి వాహనం, గుంత... ఇలాంటి ఏవైనా ముప్పులు కనిపించినప్పుడు వెంటనే స్పందించి బ్రేక్‌ వేయడానికో, పక్కను తప్పించుకోవడానికో ప్రయత్నిస్తాడు. ఇలా ముప్పును గుర్తించిన తర్వాత, బ్రేక్‌ వేయడం వంటి స్పందనకు మధ్య కొంత సమయం పడుతుంది. దీనినే సాంకేతికంగా రెస్పాన్స్‌ టైమ్‌ అంటారు. ఎదుట ఉన్న ముప్పును మెదడు గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడానికి పట్టే సమయమిది. ఈ మధ్య కాలంలో వాహనం కొంత మేర ముందుకు ప్రయాణించేస్తుంది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత దూరంలోనే ముప్పును గుర్తించి, అవసరమైన ముందే బ్రేక్‌ వేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top