
సాక్షి, హైదరాబాద్ : రికార్డుల్లో తప్పుగా నమోదైన తన పుట్టిన తేదీని సవరించేందుకు చర్యలు తీసుకునేలా రాష్ట్రపతి కార్యాలయాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. పుట్టిన తేదీ సవరణ విషయంలో చట్ట నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని జస్టిస్ శివశంకరరావుకు హైకోర్టు గుర్తు చేసింది. పుట్టిన తేదీ సవరణ విషయంలో 1996 నుంచి పిటిషనర్ పెట్టుకున్న వినతి పత్రాలపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరడం ఎంత మాత్రం సమంజసంగా ఉండదని, ఇలా అడిగితే, అది సమాజానికి తప్పుడు సంకేతం పంపినట్లవుతుందని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తుల పుట్టిన తేది గురించిన ప్రశ్న ఏదైనా తలెత్తినప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 217(3) ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని సంప్రదించి, రాష్ట్రపతి ఓ నిర్ణయం తీసుకుంటారని, ఈ అధికారాన్ని ఉపయోగించేందుకు కొన్ని పరిమితులున్నాయని హైకోర్టు పేర్కొంది. దీన్ని రాష్ట్రపతి ఇప్పటి వరకు 3–4 సార్లు మాత్రమే ఉపయోగించారంది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.1959 మార్చి 29న తాను పుట్టానని, రికార్డుల్లో అది 1957 ఏప్రిల్ 10గా నమోదైందని, ఈ తప్పును సవరించాలని కోరుతూ రెండు దశాబ్దాలుగా వినతిపత్రాలు సమర్పిస్తున్నా, కేంద్రం స్పందించడం లేదని, అందువల్ల మార్చి 31లోపు ఈ విషయంపై తగిన నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జస్టిస్ శివశంకరరావు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.జగన్నాథశర్మ వాదనలు వినిపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, పుట్టిన తేదీ సవరణ విషయంలో పిటిషనర్ జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు పిటిషన్లు వేశారని, వాటిని హైకోర్టు, ఆ తరువాత సుప్రీంకోర్టు కూడా కొట్టేసిందని గుర్తు చేసింది. దీనికి శర్మ స్పందిస్తూ, పునః సమీక్షా పిటిషన్‌లో సుప్రీంకోర్టు తమకు కొంత వెసులుబాటు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతానికి ఈ వ్యాజ్యంలో ముందుకెళ్లకుండా విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.