భవన నిర్మాణాలకు ఒకే దరఖాస్తు 

One application for building structures - Sakshi

మే నెలాఖరులోగా ప్రజలకు అందుబాటులోకి.. 

ఎన్‌ఓసీలు సమర్పించాల్సిన పనిలేదు 

జీహెచ్‌ఎంసీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారానే వివిధ విభాగాలకు.. 

సాక్షి, హైదరాబాద్‌: భవన నిర్మాణ అనుమతులు సులభంగా జారీ చేసేందుకు ఇప్పటికే పలు నూతన విధానాల్ని అందుబాటులోకి తెచ్చిన జీహెచ్‌ఎంసీ.. త్వరలోనే మరో సదుపాయాన్ని ప్రజలకు కల్పించనుంది. భవన నిర్మాణాల అనుమతులకు దరఖాస్తు చేసుకున్న వారే సదరు స్థలం ప్రభుత్వ భూమి కాదని.. యూఎల్‌సీ భూముల్లో లేదని.. ఇతరత్రా అంశాల్ని స్పష్టం చేసేందుకు సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) తెచ్చుకోవాల్సి వస్తోంది.

త్వరలో అందుబాటులోకి తేనున్న కొత్త విధానంలో ఆయా ఎన్‌ఓసీల కోసం వివిధ ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఆయా శాఖల నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీనే సంబంధిత శాఖలకు ఆన్‌లైన్‌లో పంపిస్తుంది. ఇందుకుగాను ఆయా శాఖలతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటుంది. ఉదాహరణకు నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న భూమి యూఎల్‌సీలో లేదని ఖరారు చేసుకునేందుకు దరఖాస్తు నేరుగా సంబంధిత జిల్లా కలెక్టర్‌కు వెళ్తుంది. కలెక్టర్‌ దాన్ని పరిశీలించి ఎలాంటి అభ్యంతరం లేకుంటే ఓకే చేస్తారు. ఏదైనా అభ్యంతరముంటే తెలియజేస్తారు.

ఇలా రెవెన్యూ అంశాలకు సంబంధించి కలెక్టర్లకు వెళ్తుంది. ఇతర విభాగాలకు సంబంధించి ఆయా విభాగాల ఉన్నతాధికారులకు వెళ్తుంది. భవన నిర్మాణ అనుమతులిచ్చే ముందు ప్రస్తుతం ఐదు అంశాల్లో ఎన్‌ఓసీలు అవసరమవుతున్నాయి. రెవెన్యూతోపాటు నీటి పారుదల, ఫైర్‌ సర్వీసెస్, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ, నేషనల్‌ మాన్యుమెంట్‌ అథారిటీల నుంచి ఎన్‌ఓసీలు తీసుకుంటున్నారు. ఇకపై ఇవి ఆన్‌లైన్‌లోనే సంబంధిత శాఖల అధికారులకు వెళ్తాయి. వారం రోజుల్లోగా వారు క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకుగాను జీహెచ్‌ఎంసీ ఆయా విభాగాలతో నెట్‌వర్క్‌ అనుసంధానం చేసుకుంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలున్నాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తోపాటు నీటిపారుదల విభాగంతో అనుసంధానం పూర్తయిందని చీఫ్‌ సిటీ ప్లానర్‌(సీసీపీ) దేవేందర్‌రెడ్డి తెలిపారు. మిగతా విభాగాల అధికారులతో అనుసంధానం దాదాపు పూర్తికావచ్చిందని పేర్కొన్నారు. మే నెలాఖరులోగా ప్రజలకు ఈ సదుపాయం అందుబాటులోకి రానుందన్నారు.  

జూలై నుంచి ‘రెరా’వెబ్‌సైట్‌.. 
రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కి సంబంధించిన ప్రత్యేక Ðవెబ్‌సైట్‌ జూలై æఒకటో తేదీ నుంచి అందుబాటులోకి రానుందని సీసీపీ పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్‌ అందుబాటులోకి వస్తే బూటకపు ప్రకటనలతో రియల్‌ వ్యాపారులు ప్రజలను మోసపుచ్చే అవకాశాలుండవు. ఏవైనా ఫిర్యాదులున్నా ప్రజలు వెబ్‌సైట్‌ ద్వారా రెరాను సంప్రదించవచ్చు. వివాదాల పరిష్కారంలో రెరా అథారిటీతోపాటు టౌన్‌ప్లానర్లు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రతినిధులు, బిల్డర్స్‌ ఫోరమ్‌ ప్రతినిధులకు కూడా భాగస్వామ్యం కల్పించినట్లు సీసీపీ తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top