ఆట..మొదలు

Nominations Starts From Today In Telangana Elections - Sakshi

నేటి నుంచి నామినేషన్లు.. తొలి రోజే వీఐపీలు

అత్యధిక మంది 14,19 తేదీల్లో దాఖలు

నామినేషన్‌ వేసినప్పటి నుంచే ఖర్చుల లెక్కలు

సాక్షి,సిటీబ్యూరో: ముందస్తు ఎన్నికల రణంతో గ్రేటర్‌ వేడెక్కనుంది. సోమవారం నోటిఫికేషన్‌ విడుదలతో పాటు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వారం రోజుల పాటు సాగే ఈ ప్రధాన ఘట్టంతో నగరమంతా ర్యాలీలు, సభలతో మరింత కోలాహలంగా మారనుంది. కార్తీక మాసం తొలి సోమవారం రోజే బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ముషీరాబాద్‌ స్థానం నుంచి, గోషామహల్‌లో రాజాసింగ్‌ లోథా నామినేషన్‌ వేయనున్నారు. అయితే, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని ప్రజాకూటమి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోవడంతో ఆ కూటమి అభ్యర్థులు 14వ తేదీన నామినేషన్లు దాఖలు చేసే అవకాశంఉంది. ముహూర్తం పరంగా ఆ రోజు సప్తమితో పాటు శ్రవణా నక్షత్రం కావడంతో అత్యధిక మంది అభ్యర్థులు అదే తేదీన తమ నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక 15,16 తేదీల్లో అష్టమి, నవమి ఉండడంతో నామినేషన్లు అతి తక్కువగా దాఖలయ్యే అవకాశం ఉంది. చివరి రోజైన 19వ తేదీ (సోమవారం) ఏకాదశి, ద్వాదశి సైతం వస్తున్నాయి. దీంతో చివరి రోజు కూడా పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లకు ముహూర్తంగా నిర్ణయించారు.

నేటి నుంచే రణరంగంలోకి..
బీజేపీ అభ్యర్థులుగా ముషీరాబాద్‌లో డాక్టర్‌ లక్ష్మణ్, గోషామహల్‌లో రాజాసింగ్‌ సోమవారం నామినేషన్లు వేస్తుండగా, 14వ తేదీన టి.పద్మారావుగౌడ్‌ (సికింద్రాబాద్‌) ఎం.రామ్మోహన్‌గౌడ్‌(ఎల్బీనగర్‌), భేతి సుభాష్‌రెడ్డి(ఉప్పల్‌), జి.సాయన్న(కంటోన్మెంట్‌)నామినేషన్‌ వేయనున్నారు. అదేరోజు పాషాఖాద్రి (చార్మినార్‌) నామినేషన్‌ వేస్తారు. ఇక 15న మాగంటి గోపీనాథ్‌(జూబ్లిహిల్స్‌), 16న మాధవరం కృష్ణారావు(కూకట్‌పల్లి), గజ్జెల యోగానంద్‌ (శేరిలింగంపల్లి), 17వ తేదీన జి.కిషన్‌రెడ్డి(అంబర్‌పేట), అక్బరుద్దీన్‌ ఒవైసీ(చంద్రాయణగుట్ట), 19న తలసాని శ్రీనివాసయాదవ్‌(సనత్‌నగర్‌), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయున్నారు. అయితే, ఈ మారు నామినేషన్లలో 35 అంశాలను పూరించాల్సి ఉంది. దీంతో అత్యధిక మంది అభ్యర్థులు రెండు కంటే ఎక్కువ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసిన రోజు నుంచే ఎన్నికల వ్యయాలకు లెక్క రాయాల్సి ఉంది. ఈ మేరకు ఎన్నికల యంత్రాంగం కూడా అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లను రంగంలోకి దింపనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top