అంగన్‌వా‘డీలా’

No facilities in anganwadis in adilabad - Sakshi

అమలుకు నోచుకోని మెనూ

సరుకులు లేక కొన్ని కేంద్రాల్లో నిలిచిన భోజనం

గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందని పౌష్టికాహారం

డిసెంబర్‌ నుంచి నిలిచిన పాల సరఫరా

పందిరి కింద..

నార్నూర్‌ మండల కేంద్రంలోని ఇందిరానగర్‌ కాలనీ, ఒడ్దెరబస్తీలోని అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించగా.. దొడ్డు బియ్యంతోనే భోజనం పెట్టారు. కేంద్రాలకు ఒక నెల నుంచి గుడ్లు ఇవ్వడం లేదని తెలిసింది. సొంత భవనం లేకపోవడంతో ఆరుబయటే కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇందిరానగర్‌లో కేంద్రానికి సొంత భవనాలు లేకపోవడంతో కాలనీ పెద్ద మనిషి ఇంటి వరండాలో కూర్చుని అంగన్‌వాడీ టీచర్లు కార్యకలాపాలను నిర్వహిస్తూ కనిపించారు. గుడ్లు ప్రతి రోజు కాకుండా నెలకు ఒకేసారి ఇస్తున్నారు. 

మూడేళ్లలోపు పిల్లలు    21,685
ఆరేళ్లలోపు పిల్లలు        30,503
గర్భిణులు, బాలింతలు    10,520

అంగన్‌వాడీ కేంద్రాలు
ప్రధాన కేంద్రాలు    987
మినీ కేంద్రాలు    269
మొత్తం    1256

మూడు నెలలుగా పాల సరఫరా లేదు..

భీంపూర్‌(బోథ్‌) : మండలంలో 29 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. శుక్రవారం నిపానిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించగా.. ఐసీడీఎస్‌ ద్వారా అందుతున్న పౌష్టికాహారంలో భాగంగా అన్నం, పాలు అందించాల్సి ఉంది కానీ వాటి జాడ కనిపించడం లేదు. మొత్తం 34మంది పిల్లలు ఉండగా.. వీరిలో 19 మంది ప్రీస్కూల్‌ పిల్లలు ఉన్నారు. సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో అరకొర సౌకర్యాలతో కొనసాగుతోంది. పిల్లలకు మూడు నెలల నుంచి పాలు లేకుండా సెంటర్‌ నిర్వహిస్తున్నారు. బియ్యంతోపాటు ప్రతీ రోజు ఆకు కూరలతో అక్కడే వండి వడ్డించాల్సి ఉండగా.. ఆ వ్యవస్థ కనిపించలేదు. ప్రీస్కూల్‌ ఆటవస్తువులు కూడా లేవు. 
ఆదిలాబాద్‌ టౌన్‌ : అంగన్‌వాడీ కేంద్రాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. పర్యవేక్షణ లోపం.. అరకొర సౌకర్యాలు.. ఇరుకైన గదులు.. అమలుకు నోచుకోని మెనూ.. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందని పౌష్టికాహారం.. మూడు నెలలుగా నిలిచిన పాల సరఫరా.. వెరసి అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ మొక్కుబడి వ్యవహారంగా మారింది. జిల్లాలోని 18 మండలాల్లో ఐదు ప్రాజెక్టులు, 51 సెక్టార్లు ఉన్నాయి. మొత్తం 1,256 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 21,685 మంది, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 30,503 మంది, గర్భిణులు, బాలింతలు 10,520 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రతి రోజు ఒక పూట మధ్యాహ్నం పూర్తి స్థాయి భోజనం వండిపెట్టాలి. కానీ ఏ కేంద్రంలోనూ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. చాలా కేంద్రాల్లో పాలు, నూనె, పప్పు సరుకులు లేవు. నాణ్యమైన భోజనం వండిపెట్టకపోవడంతో లబ్ధిదారులు కేంద్రాలకు రావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఉడికించిన కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా.. ఉడికించకుండానే కార్యకర్తలు వాటిని ఇంటికి పంపిస్తున్నారు. 

లోపించిన పర్యవేక్షణ..

ఐసీడీఎస్‌లో రెగ్యులర్‌ అధికారులు లేకపోవడంతో పర్యవేక్షణ లోపించింది. ఆదిలాబాద్‌ అర్బన్‌ ప్రాజెక్టుకు ఐదారేళ్లుగా ఇన్‌చార్జీ  అధికారులతో కాలం వెల్లదీస్తున్నారు. చాలామంది అంగన్‌వాడీ కార్యకర్తలు సమయపాలన పాటించడంలేదు. సక్రమంగా కేంద్రాలను తెరవడంలేదు. దీంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. కేంద్రాలు తెరిచిన వారిలో చాలా మంది అంగన్‌వాడీలు భోజనం సక్రమంగా వండిపెట్టలేదు. సరుకులు ఉన్న కేంద్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. పర్యవేక్షించాల్సి కొందరు సూపర్‌వైజర్లు కార్యాలయానికి పరిమితం అవుతున్నారు. కొందరు అంగన్‌వాడీ కార్యకర్తలు లబ్ధిదారులకు అందజేయాల్సిన గుడ్లు, ఇతర సరుకులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదిలాబాద్‌ అర్బన్‌ ప్రాజెక్టులో డిసెంబర్‌ నుంచి పాల సరఫరా లేదు. ఉట్నూర్, బోథ్‌ ప్రాజెక్టులో కూడా అదే పరిస్థితి ఉంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. 

హాజరు అంతంతమాత్రమే..

బోథ్‌ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం–2, సాయినగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రం–2ను ‘సాక్షి’ బుధవారం పరిశీలించింది. బోథ్‌ కేంద్రంలో 6 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 45 మంది ఉండగా, మూడు నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు 35మందితో కలిపి మొత్తం 80 మంది ఉన్నారు. కాగా ‘సాక్షి’ సందర్శించిన సమయానికి మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 16 మంది మాత్రమే కనిపించారు. పాలు రెండు నెలల తరువాత ఫిబ్రవరిలో వచ్చాయి. రెండు నెలలుగా చిన్నారులకు పాలు సరఫరా చేయలేదని అంగన్‌వాడీ కార్యకర్త చారుశీల పేర్కొన్నారు. సాయినగర్‌లో 2వ అంగన్‌వాడీ కేంద్రంలో ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 20 మంది ఉండగా, మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు 18 మంది కలిపి మొత్తం 38 మంది ఉన్నారు. వీరిలో 16 మంది మాత్రమే హాజరయ్యారు. పాలు రెండు నెలలుగా రాలేదని, నాలుగు రోజుల క్రితం వచ్చాయని కేంద్రం నిర్వాహకురాలు లలిత తెలిపారు.

బాలామృతం బంద్‌..

జైనథ్‌ మండలం బాలపూర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం 11.20 గంటలకు ‘సాక్షి’ సందర్శించింది. ఏడుగురు చిన్నారులు కనిపించారు. 6 నెలల నుంచి మూడేళ్లలోపు 23 మంది చిన్నారులకు గాను 10 మంది పేర్లు రిజిస్ట్రర్‌లో నమోదై ఉన్నాయి. ఏడుగురు కేంద్రంలో కనిపించారు. మిగతా ముగ్గురు ఇంటికి వెళ్లినట్లు సిబ్బంది చెప్పారు. కేంద్రం పరిధిలో గర్భిణులు, బాలింతలు ఐదుగురు చొప్పున ఉండగా.. ఇద్దరు గర్భిణులు మాత్రమే కేంద్రంలో కనిపించారు. కేంద్రానికి సంవత్సరం నుంచి పాలు సరఫరా కావడం లేదు. 2 నెలలుగా పిల్లలకు ఇచ్చే మురుకులు, బాలామృతం సరఫరా కావడం లేదు. అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో 1 నుంచి 3 సంవత్సరాల చిన్నారులు 27 మంది ఉన్నారు. వీరికి బాలామృతం రెండు రోజుల నుంచి రావడం లేదు. గర్భిణులు, బాలింతలు భోజనం చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలిసింది.

అనారోగ్యలక్ష్మి

గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణకు ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. చాలా అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో అనారోగ్యలక్ష్మిగా మారింది. జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో పాలు, నూనె, పప్పు సరఫరా కావడం లేదు. కోడిగుడ్లు సరఫరా అవుతున్నా కొన్ని కేంద్రాల్లో సక్రమంగా పంపిణీ చేయడం లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఆకుకూరలు, కోడిగుడ్లు, పాలు, పెరుగుతో కూడిన పౌష్టికాహారం అందించాల్సి ఉన్నప్పటికీ కనీసం పప్పు అన్నం కొన్ని కేంద్రాల్లో పెట్టడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. చాలా కేంద్రాల్లో వంట చేయడం లేదు. సమయానికి కేంద్రాలు తెరవడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటోంది. చాలా అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు గదుల్లో కూర్చుంటూ అవస్థలకు గురవుతున్నారు.  

ఆరోగ్యలక్ష్మి మెనూ ఇదీ..
   వారం                               ఇవ్వాల్సిన భోజనం
సోమవారం          అన్నం, కూరగాయలతో సాంబారు, గుడ్డు కూర, పాలు
మంగళవారం       అన్నం, పప్పు, ఆకు కూరలు, గుడ్డు, పాలు
బుధవారం           అన్నం, ఆకు కూరలతో పప్పు, గుడ్డుకూర, గుడ్డు, పాలు
గురువారం           అన్నం, కూరగాయలతో సాంబారు, పెరుగు, గుడ్డుకూర, పాలు
శుక్రవారం            అన్నం, పప్పు, ఆకుకూరలతో కూర, గుడ్డు, పాలు
శనివారం             ఆకుకూరలతో పప్పు, పెరుగు, గుడ్డు, పాలు

ఈ మోను ప్రకారం భోజనం పెట్టాలి. కానీ ఏ కేంద్రంలోనూ పాటించడం లేదు. ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు జాడలేదు. పప్పునీళ్లు, గుడ్డు మాత్రమే ఇస్తున్నారు. దొడ్డు బియ్యంతో భోజనం పెట్టడంతో చాలామంది తినడానికి కేంద్రానికి రావడం లేదు.

భవనం లేక ఇబ్బందిగా ఉంది

మా కాలనీలో అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనం లేదు. ఆరుబయటే కూర్చుని భోజనం చేయాల్సి వస్తొంది. ఆయమ్మ లేకపోవడంతో వంట కూడా సరిగా> చేయడం లేదు. ఈ నెల గుడ్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. పెద్ద సార్లు పట్టించుకోని సమస్యలు పరిష్కరించాలి. – రమబాయి,  గ్రామం: ఇందిరనగర్, మం : నార్నూర్‌

భారం భరించలేకుండా ఉన్నాం

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ కష్టంగా మారుతోంది. సహాయకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సిలిండర్‌కు రూ.150 ఇస్తున్నారు. ఇవి ఎటూ సరిపోవడం లేదు. డబ్బులను స్వంతంగా ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అద్దె భవనాలకు సంవత్సరానికి ఒకసారి అద్దె చెల్లిస్తున్నారు. దీనివల్ల యాజమానులు ఖాళీ చేయాలంటున్నారు. మరోవైపు చిన్నారులకు రెండు నెలలుగా పాలు సరఫరా చేయడం లేదు. ప్రభుత్వం అన్ని వసతులు సమకూర్చాలి.             
చారుశీల,  అంగన్‌వాడీ కేంద్ర నిర్వాహకురాలు 

సమయ పాలన పాటించాలి..

అంగన్‌వాడీ కార్యకర్తలు సమయ పాలన పాటించాలి. మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. కంది పప్పు, నూనె, బియ్యం సరుకులు అందుబాటులో ఉన్నాయి. పా లకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి సరఫరా కావడం లేదు. ఈ విష యం జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. 
మిల్కా, జిల్లా సంక్షేమ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top