‘కూటమి’ గెలిస్తే ఆంధ్రా నేతల పెత్తనం

 MP Kavitha Said Do Not Win Kutami In Nizamabad - Sakshi

 చంద్రబాబు కుట్రలో భాగమే మహాకూటమి

 ప్రజలే వారికి బుద్ధి చెప్పాలి

నిజామాబాద్‌ ఎంపీ కవిత

నవీపేట మండలంలో రోడ్‌షో

 సాక్షి, నవీపేట(బోధన్‌): ఆంధ్ర పాలకులతో విరక్తి చెంది కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని, ఎన్నికల్లో మహా కూటమి గెలిస్తే మళ్లీ మనకు ఆంధ్ర నాయకులు పెత్తనం తప్పదని ఎంపీ కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నాగేపూర్, బినోల, జన్నెపల్లి గ్రామాల్లో శనివారం రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు గ్రామాల్లో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబునాయుడు పన్నిన కుట్రలో భాగమే ఈ మహాకూటమి ఆవిర్భావమని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు 35 కేసులు వేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. మహాకూటమి అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసి, పగడ్బందీగా అమలు చేసిన రైతుబంధు, రైతు బీమా పథకాలతో దేశంలో ఆదర్శరాష్ట్రంగా గుర్తింపు సంపాదించామని పేర్కొన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టని అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్‌ కేవలం నాలుగున్నరేళ్లలో చేసి చూపించారని పేర్కొన్నారు. నవీపేట, నాగేపూర్, బినోల, జన్నెపల్లి గ్రామాలకు పలువురు యువకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో నాయకులు రాంకిషన్‌రావ్, మోహన్‌రెడ్డి, ఉప్పు సంతోష్, అవంతి రావ్, గిర్దావర్‌ గంగారెడ్డి, దేవిదాస్, బిల్ల మహేశ్, నర్సింగ్‌రావు, తెడ్డు పోశెట్టి, రమేశ్, ప్రవీణ్, లోకం నర్సయ్య, నాగేశ్వర్‌రావ్, మహేందర్, బాబర్, వీరేందర్‌రావు పాల్గొన్నారు. 

గులాబీ గూటికి మీర్‌ మజాజ్‌ అలీ  

సాక్షి,చంద్రశేఖర్‌కాలనీ: ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మీర్‌ మజాజ్‌ అలీ శనివారం గులాబీ గూటికి చేరుకున్నారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నగరంలోని వెంగళ్‌రావునగర్‌ సమీపంలో గల బాబాన్‌సాహెబ్‌ పహాడ్‌ వద్ద మైనారిటీలతో బహిరంగ సభ నిర్వహించారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మజాజ్‌ అలీ 31వేలపై చిలుకు ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. గతంలో నిజామాబాద్‌ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. ముస్లింలలో గట్టిపట్టు ఉన్న మీర్‌ మజాజ్‌అలీ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ టీఆర్‌ఎస్, ఎంఐఎంలు కలసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ మైనార్టీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వినియోగించుకుందని విమర్శించారు. ఎన్నికల వేళ కొందరు వచ్చి చెప్పే లేనిపోని మాటలను నమ్మవద్దని సూచించారు. నగరంలో నాలుగేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top