ముగిసిన చర్చలు.. కొనసాగుతున్న సస్పెన్స్‌

Minister Harish Rao Meeting With TMU Leader Over Strike Issue - Sakshi

ఐఆర్‌ ఇస్తే సంస్థపై రూ.900 కోట్ల భారం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య వివాదం, సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. సమ్మెకు వెళ్తే వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరించినా, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకే మొగ్గు చూపడంతో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే సమ్మె ఆలోచనను విరమించేందుకు, మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రులకు టీఎంయూ నేతల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. టీఎంయూకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీష్‌ రావుఅటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక సంఘాలకు మధ్యవర్తిత్వం వహించారు. ఆయనతో పాటు ఇతర మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌ రెడ్డి, టీఎంయూ ప్రదాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి, ఇతర కార్మిక సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సమ్మె చేస్తే తదనంతరం పరిణామాలను మంత్రి కార్మిక సంఘాలకు వివరించారు. మధ్యంతర బృతి ఇస్తే కార్మికులను ఎలా ఒప్పించాలనే అంశంపై మంత్రులు, కార్మిక సంఘాలు తీవ్ర తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. టీఎంయుపై కార్మికులకు నమ్మకం సన్నగిల్లకుండా ఏవిధంగా ముందుకు వెళ్లాలని సమాలొచనలు జరిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు 25 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేసినా చర్చల అనంతరం 15 శాతానికి దిగొచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా పీఆర్‌సీ, వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అయితే 12.5 శాతం ఇస్తామంటూ మంత్రుల బృందం వెల్లడించినట్లు సమాచారం. 

25 శాతం మధ్యంతర బృతి ఇస్తే రూ.900కోట్లకు పైగా భారం పడుతుందని మంత్రి వర్గం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు వివరించింది. ఈ చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించేందుకు మంత్రులతో పాటు టీఎంయూ ప్రధాన నేతలు ప్రగతి భవన్‌ బయలుదేరారు. అయితే మంత్రుల భేటి వివరాలను బయటకు వెల్లడించడానికి టీఎంయూ నేతలు నిరాకరించారు. ఆర్టీసీ పరిరక్షణ, లాభాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి వర్గం కార్మిక సంఘాలకు సూచించినట్లు తెలిసింది. ఎన్నో ఏళ్లుగా తీవ్ర నష్టాల ఎదుర్కొంటున్న ఆర్టీసీని గట్టెక్కించడానికి విభజనే పరిష్కారమనే ఆలోచనలో సర్కార్‌ ఉన్నట్లు సమాచారం. కర్ణాటక, తమిళనాడు తరహా పరిస్థితులపై అధ్యయనం చేసి, నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top