కాళేశ్వరం రూపకర్త కేసీఆరే

Minister Errabelli Dayakar visits kaleshwaram Project - Sakshi

సాక్షి, కాళేశ్వరం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరం తడుస్తుందని... కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూపాయి నిధులు ఇవ్వలేదని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన జయశంకర్‌ భూపాపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీలను ఎమ్మెల్యేలు గండ్ర వెంకట్‌రమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్లు పుట్ట మధుకర్, జక్కు శ్రీహర్షిణి, జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. ముందుగా కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటార్ల బిగింపును పరిశీలించారు. అనంతరం గోదావరి నుంచి అప్రోచ్‌ కెనాల్‌లోకి నీరు వచ్చే ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఈఈ రమణారెడ్డి, డీఈఈ సూర్యప్రకాశ్‌లు ప్రాజెక్టు వచ్చే టీఎంసీలు, నీటినిల్వ సామర్థ్యాన్ని వారికి వివరించారు. అక్కడినుంచి పంపుల నుంచి నీటిని ఎత్తిపోస్తున్న డెలివరీ సిస్టం వద్ద నీటిని గ్రావిటికాల్వను పరిశీలించారు.

నీటి లభ్యత పెరిగింది...
గత నెల 21న సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు నీటి లభ్యత లేకపోవడంతో కొంత సేపు మాత్రమే నీటిని ఎత్తిపోసినట్లు మంత్రి దయాకర్‌రావు తెలిపారు. ప్రస్తుతం గోదావరి, ప్రాణహితలు గలగల పారుతున్నయన్నారు. వీటి ద్వారా నీటి లభ్యత వివరీతంగా పెరిగిందన్నారు. నీళ్లను తెలంగాణ అంతటికి అందించడానికి సిద్ధమైనట్లు తెలిపారు. ఇదంతా గొప్ప విషయమని పేర్కొన్నారు. కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డైరెక్టర్, నిర్మాత, రచయిత సర్వం ఆయనేనన్నారు. ఆయనను తెలంగాణ ప్రజలంతా కొనియాడుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్‌ కృషితో తెలంగాణ సశ్యశామలం అవుతుందని సంతోషపడుతున్నారు.

ప్రతిపక్ష పార్టీలు విమర్శలతో గగ్గోలు పెడుతున్నాయన్నారు. కట్టలు తెగిపోతున్నాయని, పంపులు నడుస్తలేవని తప్పుడు ప్రచారం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులు ఒక్కసారి వచ్చి మోటార్ల పనితీరు చూసి నీళ్లు చల్లుకొని పోవాలని హితవు పలికారు. పంపుహౌస్‌లో మొత్తం 11 మోటార్లకు 3మోటార్లు నీటిని ఎత్తిపోస్తుందని తెలిపారు. త్వరలో 6మోటార్లు పూర్తిస్థాయిలో నడిపి రెండు టీఎంసీల నీటిని తరలించనున్నట్లు తెలిపారు. ఈ ఖరీఫ్‌కు మొత్తం 11మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో 3టీఎంసీలు ఎత్తిపోసేందుకు కేసీఆర్‌ ప్రణాళికలు చేశారన్నారు. మంత్రి వెంట ఎంపీపీ బస్సొడ రాణిబాయి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ శోభ, ఎంపీటీసీ మమత, సర్పంచ్‌ శ్రీపతిబాపు, మాజీ జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాసరావు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top