కాళేశ్వరంపై న్యాయ విచారణ షురూ  | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై న్యాయ విచారణ షురూ 

Published Thu, Apr 25 2024 4:51 PM

Meeting with Irrigation Department officials - Sakshi

హైదరాబాద్‌కు చేరుకున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ 

నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం 

26, 27 తేదీల్లో బ్యారేజీల సందర్శన?

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై సుప్రీం కోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన బీఆర్‌కేఆర్‌ భవన్‌లో తనకు కేటాయించిన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

నీటిపారుదల శాఖపై ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం, మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్‌ నిర్వహించిన దర్యాప్తు నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్‌ సమర్పించిన ఆడిట్‌ నివేదికలతో పాటు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన కీలక ఫైళ్లను జస్టిస్‌ చంద్రఘోష్ కు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు అందజేసినట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలపై న్యాయ విచారణ కోసం ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం తెలిసిందే. కాగా, 26 లేదా 27 తేదీల్లో బ్యారేజీల సందర్శనకు ఆయన వెళ్లే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి. 

నేడు అధికారులతో మళ్లీ భేటీ 
గురువారం ఉదయం 10 గంటలకు నీటిపారుదల శాఖ అధికారులతో మరోసారి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వివిధ సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక నివేదికను ప్రభుత్వం ఆయనకు అందజేయనున్నట్టు తెలిసింది. కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లకు నోటీసుల జారీపై గురువారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement