స్థానికత ప్రామాణికం కాదు

Localization is not valid - Sakshi

     సీనియారిటీ ప్రకారమే న్యాయాధికారుల విభజన

     హైకోర్టు మార్గదర్శకాలను సమర్ధించిన సుప్రీం కోర్టు 

సాక్షి, న్యూఢిల్లీ: సబార్డినేట్‌ జ్యుడీషియరీ సర్వీసుల్లో క్యాడర్‌ విభజనకు స్థానికత ప్రామాణికం కాదని, సీనియారిటీనే ప్రామాణికమని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సీనియారిటీని రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన కోల్పోలేరని స్పష్టం చేసింది. సబార్డినేట్‌ జ్యుడీ షియరీ సర్వీసుల్లో తెలంగాణ నుంచి తగిన ప్రాతినిధ్యం లేదని, సీనియారిటీ ప్రకారం న్యాయాధికారుల విభజన జరిగితే తామెన్నటికీ పదోన్నతులు పొందలేమని, స్థానికత ఆధారంగా విభజన జరపాలని తెలంగాణ న్యాయాధికారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌లో జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది.

జ్యుడీషియరీ సర్వీసుల్లో న్యాయాధికారుల విభజనకు సంబంధించి హైకోర్టు తొలుత మార్గదర్శకాలను రూపొందించింది. 2014, జూన్‌ 02 నాటి సీనియారిటీ ఆధారంగా న్యాయాధికారుల కేటాయింపు ఉంటుందని పేర్కొంది. ఉద్యోగం లో చేరిన నాడు పేర్కొన్న సొంత జిల్లా ఉన్న రాష్ట్రానికి వెళ్లాలనుకున్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చెప్పింది. ఈ క్రమంలో ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవగా.. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలయింది. దీనిని విచారించిన సుప్రీం కోర్టు 2014, జూలై 7న యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తర్వాత మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నేతృత్వంలోని ధర్మాసనం అప్పటివరకు హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను ముసాయిదా మార్గదర్శకాలుగా పరిగణనలోకి తీసు కుని కేంద్ర ప్రభుత్వం తిరిగి ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించాలని, తాము తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తామని ఆదేశించింది.

ఈ మేరకు కేంద్రం ముసాయిదా మార్గదర్శకాలు రూపొందించి హైకోర్టుకు సమర్పించింది. హైకోర్టు వాటిని పరిశీలించి సవరించిన ముసాయిదాను మళ్లీ కేంద్రానికి సమర్పించింది. ఆప్షన్‌ ఎంచుకుని, సీనియారిటీ ఉన్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నది దీని సారాంశం. ఈ ముసాయిదాకు సమ్మతించిన కేంద్ర ప్రభుత్వం దీనిని అఫిడవిట్‌ రూపంలో సుప్రీం కోర్టుకు సమర్పించింది. తదనంతర పరిణామాల్లో ఈ పిటిషన్లు జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంలో ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విని ఆగస్టులో తీర్పును రిజర్వ్‌ చేసింది. దాదాపు 10 సుప్రీం కోర్టు తీర్పులను ఉటంకిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ‘పిటిషనర్ల ఆకాంక్ష రాజ్యాంగబద్ధంగా లేదు. హైకోర్టు సవరించిన మార్గదర్శకాల్లో సీనియారిటీని, స్థానిక తనూ గౌరవించి సమతూకం పాటించేందుకు ప్రయత్నించారు. వీటిని సమ్మతించాలి. ఈ మేరకు పిటిషన్లను పరిష్కరిస్తూ ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, హైకోర్టు ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆప్షన్ల ప్రక్రియను పూర్తిచేసి న్యాయాధికారుల విభజనను ఈరోజు నుంచి రెండు నెలల్లోగా పూర్తిచేయాలి’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top