Sakshi News home page

కొనెటోళ్లేరి..?

Published Tue, Oct 14 2014 3:39 AM

కొనెటోళ్లేరి..? - Sakshi

ముఖం చాటేసిన ఐకేపీ, సీసీఐ, నాఫెడ్, మార్క్‌ఫెడ్

 సాక్షి, మహబూబ్‌నగర్:
 సీజన్ ప్రారంభంలో విత్తనాలు, ఎరువుల కొరత.. ఆ తరువాత తెగుళ్ల బెడద.. తీరా చేతికొచ్చాక పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. కొద్దోగొప్పో దక్కిన పంటను అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నదాతకు మద్దతుధరలు కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వరంగ సంస్థలు ముందుకురావడం లేదు. మొక్కజొన్న, వరి, పత్తి పంట దిగుబడులు చేతికొస్తున్నా తరుణంలో జిల్లాలో ఐకేపీ, సీసీఐ, నాఫెడ్ కొనుగోలు కేంద్రాల ఊసేలేదు.

దీంతో రైతన్నలు దళారులను ఆశ్రయించి నిలువునా మోసపోతున్నారు. రైతులు పండించిన పంటను సరైన గిట్టుబాటు అందిస్తామని, పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. అంతేకాదు రైతులెవరూ దళారుల వద్దకెళ్లి మోసపోవద్దంటూ ప్రకటించినా ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో వ్యాపార కేంద్రంగా ఉన్న బాదేపల్లి వ్యవసాయమార్కెట్ యార్డుకు మొక్కజొన్న రోజుకు సగటున 10వేల క్వింటాళ్లు, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 70వేల క్వింటాళ్లు విక్రయానికి వచ్చింది.

మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో కేవలం తొమ్మిది కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4,458 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం దాదాపు 49వేల క్వింటాళ్లు సేకరించాల్సి ఉండగా.. అందులో పదోవంతు కూడా సేకరించలేకపోయారు. ఐకేపీ కేంద్రాల ద్వారా జిల్లాలో 27కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. దీంతో సర్కారు వైఫల్యాన్ని ఆసరా చేసుకున్న దళారులు మొక్కజొన్న రైతన్నను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.1310 మద్దతు ధర ప్రకటించినా ఆ ధర దక్కడంలేదు.

కేవలం రూ.900 నుంచి రూ.1000 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. జిల్లాలో వరిధాన్యం చేతికొస్తుంది. గతేడాది పెబ్బేరు, గద్వాల ప్రాంతాల్లో ఐకేపీ, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలుచేసినా ఇప్పటివరకు ఆ ఏర్పాట్లు జరగలేదు. సోమవారం జడ్చర్ల మార్కెట్ యార్డుకు రెండువేల బస్తాల వరిధాన్యం విక్రయానికి వచ్చింది. సోనామసూరి క్వింటాలుకు రూ.1,785, హంస రకానికి రూ.1,580 ధర పలికింది. ఇదిలా ఉండగా, జిల్లాలో చాలాచోట్ల రైతులు వడ్లను విక్రయానికి కల్లాల్లోనే ఉంచారు. వరుణుడు ఆగ్రహిస్తే మరింత నష్టపోవాల్సి వస్తుంది.

  ‘తెల్ల'బోయిన బంగారం
 తెల్ల బంగారంగా పేరొందిన పత్తి పరిస్థితి జిల్లాలో ఈ సారి పూర్తి నిరాశాజనకంగా మారింది. వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. దీనికితోడు ఇప్పటివరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాల జాడేలేదు. ఏటా మద్దతు ధరకు కొనుగోలు చేసే సీసీఐ ఈసారి ఇప్పటివరకు జాడేలేదు. జిల్లాలో తొమ్మిది చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మార్కెటింగ్‌శాఖ అధికారులు సీసీఐకి లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన లేదు.

గతేడాది జిల్లాలో ఎక్కడా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈసారైన సీసీఐ కొనుగోలు చేపడితే మద్దతుధర అయిన లభిస్తుందేమోనని ఆశపడుతున్నారు. ఈ ఏడాది 4,31,966 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని సీసీఐ లక్ష్యం కాగా, సీజన్ ప్రారంభమై పత్తి మార్కెట్‌కు వస్తోన్న కొనుగోలుచేసే నాధుడే కరువయ్యాడు. పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.4050 అందాల్సి ఉండగా దళారులు, ప్రైవేట్ వ్యాపారులు మాత్రం కేవలం రూ.3,200 మాత్రమే ఇస్తున్నారు.

పత్తికి మార్కెటింగ్ లేకపోవడంతో గ్రామాల్లోనే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వీరు కేవలం క్వింటాలుకు రూ.3,200 మాత్రమే ఇస్తున్నారు. అంతేగాక  తూకం విషయంలో కూడా నిలువుగా ప్రైవేట్ వ్యాపారులు దోచుకుంటున్నారు. దీంతో పత్తిరైతు కూడా దగాకు గురై, దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పరిస్థితుల్లో ఇప్పటివరకు జిల్లాలో 15మంది పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.  
 
 మొక్కజొన్న పరిస్థితి
                                      2013        2014
 కొనాల్సిన కేంద్రాలు            06            36
 ఏర్పాటు చేసింది                06            09
 కొనాల్సిన లక్ష్యం                00            00
 కొన్నది (క్వింటాళ్లలో)        5,73,832        4,458
 
 పత్తి పరిస్థితి
                                     2013        2014
 కొనాల్సిన కేంద్రాలు            09            09
 ఏర్పాటు చేసింది               00            00
 కొనాల్సిన లక్ష్యం            3,80,000        4,31,966
 కొన్నది (క్వింటాళ్లలో)        00            00
 

Advertisement

తప్పక చదవండి

Advertisement